విద్యార్థుల అభ్యసనాభివృద్ధే లక్ష్యంగా టీచర్లు పనిచేయాలి
1 min readఅన్నమయ్య జిల్లా డి ఈ ఓ శ్రీ రాం పురుషోత్తం
పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా బ్యూరో: విద్యార్థుల సర్వతో ముఖాభివృద్ధే లక్ష్యంగా ఉపాధ్యాయులు పనిచేసి మంచి ఫలితాలు సాధించాలని అన్నమయ్య జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీరామ్ పురుషోత్తం పేర్కొన్నారు. . శుక్రవారం ఆయన కలికిరి మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, బొమ్మరవారిపల్లి ప్రాథమిక పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల అభ్యసనా స్థాయిని పరిశీలించారు. తరగతుల వారీగా ఎంతవరకు సిలబస్ పూర్తి చేశారని ఉపాధ్యాయులను, విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఇటీవల జరిగిన నిర్మాణాత్మక మూల్యాంకనంలో భాగంగా విద్యార్థులను వారి సామర్ధ్యాల ఆధారంగా గ్రేడింగ్ చేసి అభ్యసనంలో వెనుకబడిన విద్యార్థులను కూడా ‘ఏ’ గ్రేడ్ కు చేరుకునే విధంగా ప్రణాళికలను రూపకల్పన చేసి అమలు చేయాలన్నారు. అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలను సకాలంలో అమలు చేసి 100% లక్ష్యాలను సాధించాలన్నారు. నాడు నేడు ప్రభుత్వం యొక్క ప్రతిష్టాత్మక కార్యక్రమమని, దీన్ని వేగవంతం చేసి పనులు పూర్తి చేయాలన్నారు.మండలం లో నిర్వహించిన స్టేట్ లర్నింగ్ అచీవ్మెంట్ సర్వే (సీస్) పరీక్షల నిర్వహణ గురించి అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎంఈఓ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.