ఐదేళ్ల పాపకు అత్యంత తీవ్రమైన సమస్య
1 min read* శస్త్రచికిత్స చేసి ప్లీహం తీసేసిన ఎస్ఎల్‌జీ వైద్యులు
* కాలేయం చుట్టూ ఉన్న కొల్లేటరల్స్ తొలగింపు
* సంక్లిష్టమైన శస్త్రచికిత్సతో పాపకు ప్రాణదానం
పల్లెవెలుగు వెబ్ హైదరాబాద్ : పంజాబ్‌కు చెందిన ఐదేళ్ల పాపకు అత్యంత తీవ్రమైన అనారోగ్యం వచ్చింది. హిమోగ్లోబిన్ స్థాయి తరచు పడిపోతుండటం, పదే పదే రక్తం ఎక్కించాల్సి రావడం, ప్లేట్‌లెట్లు 20-30 వేలు మాత్రమే ఉండటం, దానివల్ల తరచు చిన్న చిన్న దెబ్బలకు కూడా రక్తస్రావం కావడం, తెల్ల రక్తకణాల సంఖ్య తగ్గిపోవడంతో తరచు ఇన్ఫెక్షన్లు సోకడం.. ఇలాంటి తీవ్రమైన సమస్యలు తలెత్తాయి. అంతకుముందు చాలా పెద్ద పెద్ద ఆస్పత్రులలో చూపించినా, పాప వయసు దృష్ట్యా శస్త్రచికిత్స చేస్తే ఎలా ఉంటుందోనని ఎవరూ ముందుకు రాలేదు. పాప తండ్రి ఉద్యోగరీత్యా బదిలీపై హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత ఇక్కడ కూడా పలు ఆస్పత్రులకు తిప్పినా ఎవరూ ధైర్యం చేయలేదు. చివరకు నగరంలోని ప్రధాన ఆస్పత్రులలో ఒకటైన ఎస్ఎల్‌జీ ఆస్పత్రికి తీసుకురాగా, ఇక్కడ కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు డాక్టర్ పవన్ కుమార్ పాపకు ఒక సంక్లిష్టమైన శస్త్రచికిత్సతో ప్రాణదానం చేశారు. ప్రతి పదివేల మందిలో ఐదుగురికి మాత్రమే వచ్చే అత్యంత అరుదైన ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఆయన తెలిపారు. “ఈ పాపకు కాలేయానికి రక్తం సరఫరా చేసే ప్రధాన రక్తనాళం.. పోర్టల్ వెయిన్ బ్లాక్ అయింది. దాన్ని వైద్య పరిభాషలో ఎక్స్‌ట్రా హెపాటిక్ పోర్టల్ వెయిన్ అబ్‌స్ట్రక్షన్ అని చెబుతాం. ఈ రక్తనాళానికి చుట్టూ చిన్న చిన్న శాఖలు (కొల్లేటరల్స్) ఏర్పడ్డాయి. వాటినుంచి రక్తం బయటకు రావడంతో కడుపులో బుగ్గలు ఏర్పడ్డాయి. దానికితోడు ప్లీహం బాగా పెద్దగా పెరిగిపోయింది. ప్లీహం ప్రధాన విధి రక్తంలోని వివిధ కణాల స్థాయి సరిగా ఉండేలా చూసుకోవడం. కానీ ఈ కేసులో ప్లీహం బాగా పెరిగిపోవడంతో రక్తంలో పలు సమస్యలు రావడంతో పాటు.. కొద్దిసేపు ఆడుకున్నా త్వరగా అలసిపోయేది. వయసుకు తగ్గట్లు బరువు పెరగకుండా, ఎప్పుడూ డల్‌గా ఉండేది. నిజానికి ఇదంతా పుట్టుకతోనే వచ్చిన సమస్య. కొందరు పెద్దల్లో కూడా ఈ సమస్య వస్తుంది. పుట్టినప్పుడు బాగానే ఉన్నా, తర్వాత వివిధ కారణాల వల్ల 30 ఏళ్ల లాంటి పెద్ద వయసులో ఇలాంటి సమస్యలు ఏర్పడతాయి. ఇవి ఎక్కువగా ఉత్తర భారతదేశంలో వస్తుంటాయి. ఎస్ఎల్‌జీ ఆస్పత్రిలో ఆమెకు పలు రకాల వైద్య పరీక్షలు చేసిన తర్వాత ముందుగా ప్లీహాన్ని పూర్తిగా తొలగించడానికి స్ప్లీనెక్టమీ అనే శస్త్రచికిత్స చేశాం. ముందుగా కాలేయానికి రక్తం సరఫరా చేసే ప్రధాన రక్తనాళానికి చుట్టూ ఏర్పడిన కొల్లేటరల్ రక్తనాళాలను డిస్ కనెక్ట్ చేశాం. దానివల్ల ఇక అంతర్గతంగా రక్తస్రావం అనేది ఉండదు. తర్వాత ప్లీహాన్ని పూర్తిగా తొలగించాం. నిజానికి ప్లీహం చాలా ముఖ్యమైనది. దానివల్లే రక్తంలోని వివిధ కణాల సంఖ్య సరిగా, సమతుల్యంగా ఉంటుంది. కానీ ఇక్కడ ఈ కేసులో ప్లీహంలో చిన్న ముక్క మిగిలిపోయినా అది మళ్లీ పెరిగి పెద్దయిపోయి సమస్యలకు కారణం అవుతుంది. అందువల్ల మొత్తం ప్లీహాన్ని తొలగించాల్సి వచ్చింది. అయితే, దీనివల్ల ఇన్ఫెక్షన్లు రాకుండా ఉండేందుకు ముందుగానే టీకాలు ఇచ్చాం. ప్రతి ఐదేళ్లకోసారి టీకాల బూస్టర్ డోస్ తీసుకోవాలి. ప్లీహాన్ని పూర్తిగా తీసేయడం వల్ల భవిష్యత్తులో ఏవైనా ఇన్ఫెక్షన్లు వస్తే ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతుంది. అందువల్ల ఈ శస్త్రచికిత్స చేయించుకున్నవాళ్లు ఎవరైనా జీవితాంతం అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం జ్వరం వచ్చినా వెంటనే వైద్యుల వద్ద చూపించుకోవాలి తప్ప నిర్లక్ష్యం చేయకూడదు” అని డాక్టర్ పవన్ కుమార్ వివరించారు.