వారు ఎత్తువేస్తే చదరంగం రణరంగమే..
1 min read– జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతాకాల పంట..
– తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ముందడుగు..
– అభిషేక్, అనురూఫ్ లక్ష్యం గ్రాండ్ మాస్టర్ గా పసిడి పతాకం అందుకోవడమే..
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అనే నానుడి నిజం చేస్తూ ఏలూరు నగరంలోని ఇద్దరు చిన్నారులు చిన్నతనంలోనే విశేష ప్రతిభ కనబరుస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు. పల్లె వెలుగు దినపత్రిక ప్రతినిధి తెలుసుకున్న వివరాలు ప్రకారం ఏలూరు నగరానికి చెందిన గంజి అబ్రహం సుగుణమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు అభిషేక్ అనురూప్, అయితే వీరు ఇరువురు చిన్నతనం నుండే చెస్ ఆటలో ప్రావీణ్యం సంపాదించడం విశేషం. స్వతహాగా అబ్రహం చెస్ అకాడమీకి కోచ్ గా పనిచేస్తున్నారు. ఇతని భార్య సుగుణమ్మ పిల్లలను గొప్పవారుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో తన భర్త నుంచి చెస్ ఆటను నేర్చుకొని చిన్నతనం నుండే పిల్లలకు తనే దగ్గరుండి ఆటను పరిచయం చేసింది. ఆమె కూడా జిల్లాస్థాయిలో బహుమతులు అందుకున్నారు. అయితే పిల్లల్లో కూడా ఈ ఆటలోని మజా ను ఆస్వాదిస్తూ ఆటలోని మెలుకువలను తల్లి నుండి నేర్చుకుంటూ నాలుగు సంవత్సరాల ప్రాయం నుండే విశేష ప్రతిభ ఆటల పోటీల్లో కనబరుస్తుండడం గమనార్హం. అభిషేక్ వయసు 11 సంవత్సరాలు ఏలూరులో అమలోద్భవి స్కూల్లో ఆరో తరగతి చదువుతున్నాడు. ఈ చిరుత అండర్ ..7, అండర్..8, అండర్..9, అండర్ ..10, అండర్ 11, అండర్ 15, అండర్ 17 విభాగాల్లో జిల్లాలో ప్రథమ స్థానం , జాతీయస్థాయిలో అండర్ టెన్ విభాగంలో ప్రత్యేక బహుమతి, అండర్ టెన్ విభాగంలో అంతర్జాతీయ విభాగంలో నాలుగో స్థానం సాధించి తనలోని తన అంతర్గత శక్తిని చాటుకున్నాడు. అభిషేక్ మొత్తం 71 చెస్ ఆటల పోటీలలో మెడల్స్ సాధించడం విశేషం. ఎప్పటికైనా గ్రాండ్ మాస్టర్ సాధించాలనే లక్ష్యంతో ఉన్నానని తెలిపాడు. అదేవిధంగా చిన్న కుమారుడు అనురూప్ నాలుగవ సంవత్సరంలో చెస్ పోటీలో అండర్..5, విభాగంలో రాష్ట్రస్థాయిలో మొదటి స్థానం అండర్..7, అండర్ ..8, అండర్ ..9, విభాగాల్లో జిల్లాలో ప్రథమ స్థానం సాధించి అండర్ సెవెన్ విభాగంలో ఇంటర్నేషనల్ లెవల్లో రెండవ స్థానం సాధించాడని తల్లిదండ్రులు తెలిపారు. వీరి లక్ష్యం వరల్డ్ ఛాంపియన్ కావాలనేదే ఆశయమని ఈ విధంగా పిల్లలు ఇద్దరు ఏలూరు నగరంలో ఉత్తమం ప్రతిభ కనిపిస్తూ నగరానికి తలమానికంగా నిలుస్తున్నారు. గంజి అబ్రహం చెస్ ఆకాడమీ కోచ్ గా పనిచేస్తున్నప్పటికీ ఆర్థిక పరిస్థితుల కారణంగా జీవనోపాధి కోసం నగరంలోని చిన్నారులకు చెస్ ఆటలో ప్రావీణ్యం సంపాదించే విధంగా చిన్నారులకు ఈ ఆటను నేర్పిస్తున్నారు. అదేవిధంగా నగరంలోను, చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ వివిధ ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులకు చెస్ ఆటను నేర్పిస్తున్నారు. ఈ విధంగా దాదాపు పాతిక వేలకు మందికి పైగా తన దగ్గర చిన్నారులు ఈ ఆటలో ప్రావీణ్యం సంపాదించారని తెలిపారు. ఆసక్తి గల విద్యార్థిని, విద్యార్థులకు తన నివాసం వద్ద కానీ, లేదా చిన్నారుల నివాసం వద్ద కు తానే స్వయంగా వచ్చి నేర్పించడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు.