ఎన్ ఎం ఎం ఎస్ పరీక్షకు విద్యార్థులు హాజరు కావాలి..
1 min readఉత్తీర్ణత సాధించాలి… ఉపాధ్యాయులకు జిల్లాకలెక్టర్ సూచన..
పల్లెవెలుగు వెబ్ ఏలూరు: కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఎన్.ఎం. ఎం .ఎస్. (నేషనల్ మీన్స్ అండ్ మెరిట్ స్కాలర్షిప్) పరీక్షకు ప్రభుత్వ పాఠశాలల నుండి విద్యార్థులు ఎక్కువమంది హాజరై ,ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ అన్నారు.స్థానిక కలెక్టరేట్ లో శుక్రవారం ఎన్.ఎం.ఎం.ఎస్.పరీక్షకు జిల్లా వ్యాప్తంగా హాజరుకానున్న ఎనిమిదవ తరగతి విద్యార్థుల కోసం ఉచితంగా రూపొందించిన స్టడీ మెటీరియల్ ను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ ప్రతిభ కలిగిన గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులు తమ విద్యను పేదరికం కారణంగా మధ్యలోనే నిలిపివేస్తున్నారని అన్నారు. అటువంటి ప్రతిభ కలిగిన పేద విద్యార్థులు తమ విద్యను కొనసాగించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్.ఎం.ఎం.ఎస్. మెరిట్ ఎగ్జామ్ ఏటా నిర్వహిస్తోందన్నారు.ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ఏడాదికి 12,000 రూపాయలు చొప్పున నాలుగు సంవత్సరాలు పాటు 48 వేల రూపాయలను మెరిట్ స్కాలర్షిప్ గా కేంద్ర ప్రభుత్వం అందజేస్తుందన్నారు.ఈ మెరిట్ స్కాలర్షిప్ తో ప్రతిభ కలిగిన గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులు ఇంటర్మీడియట్ వరకు చదువును కొనసాగించవచ్చునని చెప్పారు.ఎన్. ఎం.ఎం.ఎస్.పరీక్ష ప్రయోజనాలను విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు వివరించి పిల్లలను ప్రోత్సహించాలన్నారు.ప్రతి పాఠశాల నుంచి ఎక్కువ మంది విద్యార్థులు హాజరై ,ఎన్. ఎం.ఎం.ఎస్. పరీక్షలో ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు తర్ఫీదు ఇవ్వాలన్నారు. పేద విద్యార్థులకు ఉచితంగా అందించడానికి ఎన్.ఎం.ఎం.ఎస్. స్టడీ మెటీరియల్ తయారు చేసిన డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ రీ ఆర్గనైజ్డ్ టీచర్స్ యూనియన్ సేవలను కలెక్టర్ అభినందించారు.కార్యక్రమంలో పెదపాడు జడ్పీ హై స్కూలు ప్రధానోపాధ్యాయులు, డెమొక్రటిక్ రీ ఆర్గనైజ్డ్ టీచర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.వెంకటేశ్వరరావు,సేవాదళ్ నాయకులు యు వి సత్యనారాయణ, నేరుసు శ్రీను, ఎస్ శ్రీనివాస్, జీ డేవిడ్ తదితరులు పాల్గొన్నారు.