ముదురుతున్న పార్కు వివాదం…
1 min readపార్కు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నా ఏబీఎం పాలెం వాసులు .
కల్యాణ మండపం కావాలంటున్న కాలనీ వాసులు.
పార్కు వద్దు అంటూ సంతకాల సేకరణ.
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నందికొట్కూరు మున్సిపాలిటీ ఏబీఎం పాలెం 1వ వార్డులో నిర్మిస్తున్న పార్కు పనులపై వివాదం ముదురుతోంది. కాలనీలో పార్కు అవసరం లేదని పార్కు ఏర్పాటు చేస్తున్న స్థలంలో కాలనీ వాసులకు ఉపయోగకరమైన కల్యాణ మండపం నిర్మించాలని కాలనీ వాసులు పేర్కొంటున్నారు. పార్కు నిర్మాణం వలన ఎటువంటి ఉపయోగం లేదని కాలనీ ప్రజలు పార్కు ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారు. నందికొట్కూరు మున్సిపాలిటీ లోని ఏబీఎం పాలెం లో పార్కు నిర్మాణం కోసం కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కూడా ) రూ.40 లక్షల తో పార్కు నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం జరిగింది. దాదాపు 42 సెంట్ల స్థలంలో దసరా పండగ వేళ అక్టోబర్ 24 న పనులు ప్రారంభించారు. మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు.అయితే సంఘం పెద్దలు ,కాలనీ యువకులు పార్కు నిర్మాణాం వద్దు అంటూ వ్యతిరేకిస్తున్నారు. ఈ స్థలంలో కల్యాణ మండపం నిర్మించాలని ఏబీఎం కాలనీ ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని అంటున్నారు. కాలనీ వాసుల అవసరాల కోసం 1987లో కందూరు శేషయ్య గుప్తా స్థలాన్ని దానం చేయడం జరిగిందన్నారు.గ్రామీణ రక్షిత మంచినీటి సరఫరా పథకం కింద ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం చేపట్టారు.మాజీ మంత్రి బైరెడ్డి శేష శయన రెడ్డి అధ్యక్షతన అప్పటి కర్నూలు జిల్లా పరిషత్ అధ్యక్షుడు మసాల వీరన్న మంచినీటి పథకాన్ని ప్రారంభించారు.కాలక్రమేనా ఇక్కడి స్థలంలో నంద్యాల మాజీ ఎంపీ ఎస్పీవై రెడ్డి ఫిల్టర్ వాటర్ కేంద్రాన్ని ఎంపీ నిధులను కేటాయించి ఏర్పాటు చేసి కాలనీ వాసులకు మంచినీటి సమస్య పరిష్కారానికి కృషి చేశారు. ఆయన మరణాంతరం అది కూడా అటకెక్కింది.మంచినీటి సమస్య పరిష్కారం కోసం ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డితో చర్చి పరిష్కారానికి కృషి చేస్తామని చైర్మన్ సుధాకర్ రెడ్డి హామీ ఇచ్చారు. హామీకి ఇప్పట్లో మోక్షం లేనట్లే అని కాలనీ వాసులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పార్కు నిర్మాణంతో ప్రవేట్ స్థలాన్ని మున్సిపాలిటీలో విలీనం చేయడానికే కొంతమంది కుట్రలు చేస్తున్నారని కాలనీకి చెందిన యువకులు ఆరోపిస్తున్నారు. పార్కు నిర్మాణం పేరుతో ప్రవేట్ స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని కాలనీకి చెందిన జాన్, డా.రాజు మరికొందరు ఆరోపిస్తున్నారు.పార్కు నిర్మాణాన్ని అడ్డుకుంటామని జిల్లా అధికారులదృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.ప్రజల అభిప్రాయం తెలుసుకోకుండా పార్కు నిర్మాణం ఎలా చేపడుతారని ప్రశ్నించారు.కొందరి రాజకీయ స్వార్థం కోసం ప్రజలకు వ్యతిరేకంగా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం మంచిది కాదని హితవు పలికారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఆ స్థలంలో అందరికి ఉపయోగపడే కల్యాణ మండపం నిర్మాణం చేపట్టాలని కోరారు. లేని పక్షంలో ప్రజలను సమీకరించి పార్కు పనులను అడ్డుకోవడానికి ఉద్యమం తీవ్ర స్థాయిలో ఉంటుందని పేర్కొన్నారు.