PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మాకు  పార్కు వద్దే వద్దు…!

1 min read

ప్రజల అభిప్రాయ సంతకాల సేకరణ.

ఏబీఎం పాలెంలో ముదురుతున్న పార్కు వివాదం.

పార్కు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నా మహిళలు.

కళ్యాణ మండపం కావాలంటున్న కాలనీ వాసులు.

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు:  నందికొట్కూరు పట్టణంలోని  ఏబీఎం పాలెంలో నూతనంగా నిర్మిస్తున్న పార్కు మాకు వద్దు అంటూ కాలనీ మహిళలు వ్యతిరేకిస్తున్నారు. పార్కు వద్దంటూ రెండు రోజులుగా కొంతమంది యువకులు సంతకాల సేకరణ చేపట్టారు.కాటేపోగు జాన్ ,మాజీ ఎమ్మార్పీఎస్ నాయకులు డా.రాజు ఆధ్వర్యంలో చేపట్టిన సంతకాల సేకరణకు మహిళలు, యువకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది.ఏబీఎం పాలెంలో దాదాపు 3500 ఓట్లు ఉన్నాయి. సగానికి పైగా మంది పార్కు ను వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం . పార్కు ఏర్పాటు వివాదం రోజురోజుకు ముదురుతోంది.కాలనీ ప్రజలు రెండు వర్గాలుగా విడిపోయారు. పార్కు ను వ్యతిరేకిస్తున్న వారిని వైసీపీ నేతలు భయాందోళనలకు గురిచేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మున్సిపల్ కార్మికులను, వాలంటరీ లను విధుల నుంచి  తొలగిస్తామని బెదిరింపులకు గురిచేస్తున్నారని పార్కు వ్యతిరేక వర్గం ఆరోపిస్తున్నారు. ఏబీఎం పాలెంలో వీధులు ఇరుకుగా ఉన్నాయని ఇళ్ల ముందు పెళ్ళిళ్లు జరుపుకోవలంటే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పార్క్ స్థలంలో కళ్యాణ మండపం ఏర్పాటు చేసుకుంటే అందరికి ఉపయోగకరమని పలువురు మహిళలు, కాలనీ వాసులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.పార్కు వలన ఎలాంటి ఉపయోగం లేదని బాహాటంగానే పేర్కొంటున్నారు. పార్కు సమస్య పై జిల్లా అధికారులను కలువనున్నట్లు తెలిపారు.పార్కు కావాలని అనుకూలంగా మరో వర్గం సంతకాల సేకరణ చేపట్టినట్లు తెలుస్తోంది.పార్కు కు అనుకూలంగా సంతకాలు సేకరించాలని వాలంటరీలను ఆదేశించినట్లు పార్కు వ్యతిరేక వర్గం పేర్కొట్టుంది .పార్కు వివాదం చిలికిచిలికి గాలి వాన గా మారుతోందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. అధికారులు చొరవ తీసుకుని సమస్యను పరిష్కరించాలని కాలనీ ప్రజలు కోరుతున్నారు.

About Author