పోణంగి లో డంపింగ్ యార్డ్… నిత్యం వాయు కాలుష్యం..
1 min read– రోగాల బారిన పడుతున్న స్థానిక నివాస ప్రాంత ప్రజలు..
– వాహనదారులకు కూడా తప్పని వాయు కాలుష్య ప్రమాదం..
– ఎన్నిసార్లు మొరపెట్టుకున్న పట్టించుకోని ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ అధికారులు..
– ప్రజా సమస్యల విస్మరిస్తే ఉద్యమం చేపడతాం..
– ఏలూరు టిడిపి ఇన్చార్జ్ బడేటి చంటి
పల్లెవెలుగు వెబ్ ఏలూరు: ఏలూరు పోనంగిలోని డంపింగ్ యార్డ్ ద్వారా వెలువడుతున్న వాయు కాలుష్యం పరిసర ప్రాంత ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుంటే ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని తన చేతగానితనం తో సమస్యను పరిష్కరించలేకపోయారని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి బడేటి చంటి ఆరోపించారు. ప్రమాదకరంగా మారిన డంపింగ్ యార్డును తక్షణమే తరలించకపోతే ప్రజా ఉద్యమం చేపడతామని ఆయన హెచ్చరించారు. పోనంగిలోని డంపింగ్ యార్డ్ కారణంగా వెలువడుతున్న వాయు కాలుష్యంతో నివాస ప్రాంతంప్రజలు, వాహనదారులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల టిడిపి నాయకుల పాదయాత్ర సందర్భంగా ఒక చిన్నారి ఈ విషయాన్ని టిడిపి ఇన్చార్జి బడేటి చంటి దృష్టికి తీసుకువచ్చింది. దీనిపై ప్రత్యేకంగా సర్వే చేయించిన ఆయన వాస్తవాలను తెలుసుకున్నారు. డంపింగ్ యార్డ్ ఇక్కడే ఉంటే పోనంగితోపాటు చుట్టుపక్కల ఉన్న కాలనీల ప్రజలు కూడా వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని గుర్తించారు. దీంతో సోమవారం మధ్యాహ్నం పోనంగికి చెందిన పెద్దలతో ప్రత్యేక సమావేశాన్ని బడేటి చంటి నిర్వహించారు. వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఏ విషయమైనా తనకు ప్రయోజనం లేకపోతే పట్టించుకోని ప్రజాప్రతినిధి ఈ విషయాన్ని కూడా తేలిగ్గా తీసుకోవడం ఆయన బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని చంటి మండిపడ్డారు. ఒకపక్క ప్రజారోగ్యం ప్రమాదంలో పడితే ప్రజాప్రతినిధికి చీమకుట్టినట్లయినా లేకపోవడం ఆయనకు ప్రజల పట్ల ఉన్న ప్రేమను తెలియజేస్తుందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే మాటవిని అటు మేయర్, ఇటు కార్పొరేషన్ అధికారులు కూడా ప్రజా సంక్షేమాన్ని విస్మరించడం బాధాకరమన్నారు. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ ప్రజల తరపున పోరాడుతుందని, తక్షణమే సమస్యను పరిష్కరించకపోతే ప్రజా ఉద్యమాన్ని చేపడతామని బడేటి చంటి హెచ్చరించారు. ఎన్నిసార్లు స్థానిక నివాస ప్రాంత ప్రజలు మొరపెట్టుకున్న ప్రజా ప్రతినిధులు గాని, కార్పొరేషన్ అధికారులు కానీ పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమం లో 14 వ డివిజన్ ఇంచార్జ్ గొంగడి సాంబశివరావు, మర్రపు ధనుంజయ్య, దావుద్, యేసు మరియు పొణింగి గ్రామ పెద్దలు, వైయస్సార్ కాలనీ పెద్దలు పాల్గొన్నారు.