PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

తప్పుల తడక ఓటర్ల జాబితాను సరిచేయాలి… టి.జి భరత్

1 min read

ఓకే ఇంటిలో పదికి పైగా ఓట్లు ఉన్నవి 12  వేలకు పైగా ఓట్లు

గతంలో ఓటు వేసిన వైశ్యులవి 18 నుండి 20 శాతం తొలగింపు

బి.ఎల్.ఓల వెరిఫికేషన్ తర్వాత కూడా తప్పుల తడకగానే ఓటరు జాబితా

చివరిగా విడుదలయ్యే ఓటరు జాబితా కరెక్టుగా ఉండేలా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలి

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  కర్నూలు నియోజకవర్గంలో ఓటర్ల జాబితా తప్పుల తడకగానే ఉందని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భరత్ అన్నారు. శుక్రవారం మౌర్య ఇన్ లో ఓటర్ల జాబితా తప్పుల తడకపై ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలోని ఓటరు జాబితాలో చాలా తప్పులు ఉన్నాయన్నారు. బి.ఎల్.ఓలు ఇంటింటికీ తిరిగి ఓటర్ జాబితా సవరణ చేపట్టినప్పటికీ ఎలాంటి మార్పు కనిపించడం లేదన్నారు. కొత్తగా విడుదల చేసిన ఓటరు జాబితాను తమ బూత్ ఏజెంట్లు ఇంటింటికీ తిరిగి పరిశీలించారన్నారు. ఒకే ఇంటిపై పదికి పైగా ఓట్లు ఉన్నవి 12 వేలకు పైగానే ఓట్లు ఉన్నట్లు తేలిందన్నారు. చనిపోయిన వారి ఓట్లు, డూప్లికేట్ ఓట్లు, షిఫ్ట్ అయిన ఓట్లు వేలాదిగా ఉన్నాయన్నారు. ఇక గత ఎన్నికల్లో ఓటు వేసిన వైశ్యుల్లో 20 శాతం మంది ఓట్లు తొలగించబడ్డాయన్నారు. అదే ఇళ్లలో నివసిస్తున్న వారి ఓట్లను ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. వీటన్నింటినీ సరిచేయాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ పై ఉందన్నారు. త్వరలో విడుదలయ్యే ఫైనల్ ఓటరు జాబితా కరెక్టుగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. తప్పుల తడకగా ఉన్న ఓటరు జాబితాతో న్యాయంగా, నిజాయితీగా ఎన్నికలు జరిగే పరిస్థితి ఉండదన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి పరిస్థితి ఉండటమేంటన్నారు. దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీ తరుపున పోటీ చేస్తున్న తమకు ఆందోళనగా ఉందని.. ఇక స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేయాలంటే ముందుకు రాగలరా అన్నారు. చివరగా విడుదలయ్యే ఓటరు జాబితాలో సైతం కరెక్టుగా లేకుండా తప్పుల తడకగా ఉంటే తాము కోర్టుకు వెళ్లి న్యాయ పోరాటం చేస్తామని ఆయన అన్నారు. ఎన్నికల కమిషన్ తప్పుల తడక ఓటరు జాబితాను సరిచేస్తుందని తాము ఆశిస్తున్నట్లు టి.జి భరత్ చెప్పారు.

About Author