మద్ది ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్న ఎంపీ శ్రీధర్
1 min read– మర్యాదపూర్వకంగా ఆహ్వానం పలికిన ఈవో ఆకుల కొండలరావు
– లక్కవరం ఆర్యవైశ్య సంఘం వారు అన్న ప్రసాద వితరణ..
– కార్తీక మాసం సందర్భంగా అధిక సంఖ్యలో పోటెత్తిన భక్తులు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : జంగారెడ్డిగూడెం మండలంలోని గురవాయిగూడెం గ్రామము నందు తెల్ల మద్ది చెట్టు క్రింద స్వయంభువులై వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయస్వామి వారి ఆలయంలో కార్తీకమాసోత్సవములలో సందర్భముగా మంగళవారం ఏలూరు పార్లమెంటు సబ్యులు కోటగిరి శ్రీధర్, ఇతర నాయకులు విచ్చేసి స్వామివారిని దర్శించుకొన్నారు. తొలుత వారిని ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామివారి ప్రత్యేక పూజ ఏర్పాట్లు చేసినారు. అనంతరం ఆలయ మండపం వద్ద వేదపండితులు వేద ఆశీర్వచనం చేసి, వారికి స్వామివారి చిత్రపటం, శేషవస్త్రములు, ప్రసాదములు అందజేసినారు. ఆరో రోజు 21.11.2023 మంగళవారం “సప్తాహ మహోత్సవపూజలు” ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు ఉదయం గం5.00లకు నిత్య అర్చన, తోమాలసేవ, నిత్య హోమబలిహరణలు, ఉత్సవమూర్తులకు విశేష అష్టోత్తర పూజలు చేసిన అనంతరం భక్తులను దర్శనమునకు అనుమతించారు. మంగళవారం సందర్భముగా అధిక సంఖ్యలో భక్తులు, విచ్చేసి శ్రీస్వామి వారి ఆలయము చుట్టూ 108 ప్రదక్షణలు చేసి, మొక్కుబడులు తీర్చుకుని, శ్రీస్వామివారికి అత్యంత ప్రీతీకరమైన తమలపాకులు (నాగవల్లీ దళములు)తో అష్టోత్తర పూజలు, అన్నప్రాసనలు, వాహన పూజలను నిర్వహించారు. అధిక సంఖ్యలో మహిళలు ఉసిరిచెట్టువద్ద దీపారాదనలు చేశారు. ఈరోజు ఆలయము వద్ద లక్కవరం, ఆర్యవైశ్య సంఘం వారు అన్నప్రసాద వితరణ చేశారు. కార్తీకమాసోత్సవములు సందర్భముగా ఆలయమువద్ద వివిధ భజన సమాజముల వారిచే “నిరంతర నామ సంకీర్తన” కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈసందర్భముగా పోలీసు, వైద్య ఆరోగ్య, పంచాయితీ, అగ్నిమాపక రెవెన్యూ ఇతర శాఖల అధికారులు వారి సహాయ సహకారములు అందిస్తున్నారు. సాయంత్రం గం.6.00లకు నిత్యహోమము, మహాశాంతి హోమము, బలిహరణలు, నీరాజన మంత్రపుష్పములు, చతుర్వేదాధ్యయనములు, ప్రసాదవితరణ జరిగింది.ఆలయ పర్యవేక్షకులు జవ్వాది కృష్ణ, కురగంటి రంగారావు భక్తులకు విస్తృత ఏర్పాట్లు చేశారని, రేపు అనగా 22.11.2023 బుదవారం ఉదయం “లక్షపుష్పార్చన” మరియు ఉప ఆలయం “శ్రీ వేంకటేశ్వర స్వామి వారి శాంతి కళ్యాణమహోత్సవము” సాయంత్రం గం.6.00లకు శ్రీ స్వామివారి గ్రామోత్సవం మరియు ఇతర కార్యక్రమములు నిర్వహిస్తారని ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు తెలిపారు.