యధేచ్చగా ఇసుక అక్రమ రవాణా..
1 min read– తెలంగాణ నుంచి అక్రమంగా ఆంధ్రలోకి..
– చెక్ పోస్ట్ వద్ద అడ్రస్ లేని సెబ్ అధికారులు.?
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నియోజవర్గంలో యధేచ్చగా ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అక్రమ మద్యం అక్రమ ఇసుక రవాణాను అరికట్టేందుకు ఎక్సైజ్ శాఖ కాకుండా సెబ్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వ ఆశయాన్ని నీరుగార్చేందుకు అధికారులు వ్యవహరిస్తున్న తీరే ఇందుకు నిదర్శనం.నిత్యం తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఇసుక అక్రమ రవాణా కొనసాగుతోంది. కర్నూలు జిల్లా పూడూరు వద్దనున్న తుంగభద్ర నది నుంచి అక్రమంగా ఇసుక రవాణా యదేచ్ఛగా జరుగుతుంది. నందికొట్కూరు నుంచి ప్రతినిత్యం వందల ట్రాక్టర్ల ద్వారా అక్రమ రవాణా చేస్తున్న పోలీసు అధికారులు పట్టి పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పోలీసుల కంటపడకుండా ఇసుకను తరలించేందుకు ట్రాక్టర్ల యజమానులు డ్రైవర్లు అతివేగంతో వెలుతుండటంతో ద్విచక్ర వాహన దారులు ప్రమాదాలకు గురై ప్రాణాలను సైతం పోగొట్టుకుంటున్నారు. ఇటీవల మండలంలోని వడ్డమాను గ్రామం వద్ద ఓ ద్విచక్ర వాహనాదారుడు ట్రాక్టర్ డీకొనడంతో కోమా లోకి వెళ్లిన పరిస్థితి నెలకొంది. బ్రాహ్మణ కొట్టుకూరు వద్ద పాఠశాలకు వెళ్లే విద్యార్థులు సైతం ఈ ఇసుక ట్రాక్టర్ల వల్ల ప్రమాదాలకు గురవుతున్నారని గ్రామస్తులు విమర్శిస్తున్నారు. అక్రమ ఇసుక రవాణాను అరికట్టవలసిన అధికారులే మామూళ్ల మత్తులో మునుగుతున్నట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణాలను అరికట్టి ప్రమాదాలను నివారించవలసిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు కోరుకుంటున్నారు.