సుంకేసుల డ్యాంలో.. జలకళ..
1 min readఇన్ ఫ్లో… ఔట్ ఫ్లో సేమ్…
- నీటి సామర్థ్యం 1.2 టీఎంసీలే…
- తుంగభద్ర నది నుంచి నీరు రాకపోతే.. 15 రోజులకు మాత్రమే సరిపడ తాగు,సాగునీరు
- ఆ తరువాత కష్టమే…? : కేసీ కెనాల్ డీఈ రఘురామిరెడ్డి
- రైతుల్లో మొదలైన ఆందోళన…
పల్లెవెలుగు:కర్నూలు నగర ప్రజల దాహార్తిని తీర్చే సుంకేసుల డ్యాంలో 1.2 టీఎంసీలు మాత్రమే నిల్వ చేసే సామర్థ్యం ఉండటం…అధికంగా వచ్చిన నీటిని ఎప్పటికప్పుడు విడుదల చేయాల్సి వస్తుండటంతో అటు ప్రజలతోపాటు రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం పై నుంచి రోజుకు 2వేల క్యూ సెక్కులు (ఇన్ఫ్లో) వస్తుండగా…. కర్నూలు ప్రజల దాహార్తి, పంటల సాగు కోసం 2వేల క్యూసెక్కుల నీరు రోజు ( ఔట్ ఫ్లో) విడుదల చేస్తున్నట్లు కేసీ కెనాల్ డీఈ రఘురామిరెడ్డి తెలిపారు. తుంగ భద్ర నది నుంచి రోజుకు 2వేల క్యూసెక్కుల చొప్పున 10 లేదా 15 రోజులు మాత్రమే నీరు వచ్చే అవకాశం ఉందని సందేహం వ్యక్తం చేసిన డీఈ … నెల రోజుల తరువాత తాగు,సాగునీరు కష్టమేనని స్పష్టం చేశారు. ఉన్న నీటిని నగర ప్రజలు, రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కేసీ కెనాల్ డీఈ రఘురామిరెడ్డి కోరారు.
రైతుల్లో.. ఆందోళన..
కేసీ (కర్నూలు, కడప)కెనాల్ పరిధిలో మొత్తం 2.65 లక్షల ఎకరాలు సాగు అయ్యే అవకాశం ఉండగా… వర్షాభావ పరిస్థితుల కారణంగా ప్రస్తుతం 1.30 లక్షల ఎకరాలు మాత్రమే సాగుతున్నాయి. ఎక్కువగా వరి, మొక్కజొన్న, మిర్చి, సోయాబిన్ తదితర పంటలు సాగు చేస్తున్న రైతులు… పంటలు చేతికందే వరకు సాగునీరు అందుతాయో.. లేదో..నని ఆందోళన చెందుతున్నారు. లక్షల రూపాయలు వెచ్చించి సాగు చేస్తున్న పంటలకు చివరి దాకా నీరు అందకపోతే ఎండుముఖం పట్టే అవకాశం ఉంటుందని దిగాలు చెందుతున్నారు.
నేడు ఐఏబీ సమావేశం..
సాగు,తాగునీటికి సంబంధించి ఉమ్మడి కర్నూలు జిల్లా ఉన్నతాధికారులతో కలిసి ప్రజాప్రతినిధులు శనివారం నంద్యాలలో ఐఏబీ సమావేశం నిర్వహించనున్నారు. మీటింగ్లో హంద్రీ, కేసీ కెనాల్ పరిధిలో తాగు,నీగునీరు.. ముచ్చుమర్రి తదితర ప్రాజెక్టుల అభివృద్ధిపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.