PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పల్లెల్లో గుప్పుమంటున్నా నాటు సారా..!

1 min read

విచ్చలవిడిగా సారా అమ్మకాలు..

చోద్యం చూస్తున్నా ఎక్సైజ్ అధికారులు.?

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు:  నందికొట్కూరు మండలం లోని పలు   గ్రామాల్లో సారా విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. పచ్చని పల్లెల్లో నాటు సారా రక్కసి కోరాలుచాచి కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తోంది. పలుమార్లు ఫిర్యాదు చేసినా ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. దీంతో అక్రమార్కుల వ్యాపారం సాఫీగా సాగుతోంది. కొంతకాలం స్తబ్ధుగా ఉన్న నాటు సారా మళ్లీ జడలు విప్పుతోంది. పచ్చని పల్లె జీవనంలో చిచ్చుపెడుతోంది. మత్తుకు బానిసలై ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. పల్లెపల్లెనా గుడుంబా గుప్పుమంటోంది. మద్యం ధరలు భారీగా పెరగడంతో మందుబాబులు సారా  వైపు ఆసక్తి చూపుతున్నారు. కారుచౌకగా ఇంటి ముందే లభిస్తుండడంతో రాత్రిపగలు లేకుండా నాటు సారా సేవిస్తున్నారు.

మండలంలో జోరుగా సారా..

యువత సైతం సారా కు  బానిసలుగా మారుతున్నారు. నందికొట్కూరు మండలంలోని దామగట్ల, కోళ్లబాపురం , మల్యాల, వడ్డేమాను, నాగటూరు,అల్లూరు, కొణిదెల,   గ్రామాలలో విచ్చలవిడిగా  నాటు సారా వ్యాపారం కొనసాగుతోంది . ఇంత జరుగుతున్నా ఎక్సైజ్​అధికారులు పట్టిపట్టనట్లు వ్యవహారిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి . సారా విక్రయాలపై  ఉక్కుపాదం మోపాలని సర్కారు స్పష్టమైన ఆదేశాలు జారీచేసినా పెడచెవిన పెడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

జోరుగా తయారీ..

నందికొట్కూరు  మండలంలోను మరియు నందికొట్కూరు పట్టణంలో  నాటుసారా అమ్మకాలు జోరందుకుంది. మద్యం ధరలు పెరగడంతో పేద, మధ్య తరగతి మందుబాబులు తక్కువ ధరలో లభించే నాటు సారా పై ఆసక్తి చూపుతున్నారు. ప్లాస్టిక్‌ కవర్లలో సారా  నింపి గుట్టుగా రవాణా చేస్తున్నారు. ద్విచక్ర వాహనాలపై గ్రామాలకు సరఫరా చేస్తున్నారు. కొందరు సారా తయారీనే వృత్తిగా మల్చుకుని అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. గతంలో నాటు సారా తయారీ పెద్దఎత్తున సాగిన రోజుల్లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం తయారీకి అడ్డుకట్ట వేసేలా నల్ల బెల్లం క్రయవిక్రయాలపై ఆంక్షలు విధించింది. సారా తయారీపైనే ఆధారపడిన అనేక కుటుంబాలకు వేరే ఉపాధి అవకాశాలు కల్పించారు. ఇటీవల మళ్లీ సారా తయారీ జోరందుకున్నట్లు తెలుస్తోంది. కొందరు కుళ్లిన పండ్లతో సారా తయారు చేస్తుండగా, మరికొందరు పటిక, బెల్లం, కుళ్లిన అరటిపండ్లు, ఇతర మత్తు పదార్థాలను కలిసి సారా తయారు చేసి వ్యాపారం సాగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

నాటుసారా వైపు మందుబాబుల చూపు..

మద్యం ధరలకు రెక్కలు రావడంతో పేద, మధ్య తరగతి మందుబాబులు తక్కువ ధరకు లభించే నాటుసారా వైపు ఆసక్తి చూపుతున్నారు. మద్యం తాగాలంటే అధిక ధరలు ఉండడంతో   నాటుసారా అతి చౌకగా లభించడంతో అటువైపే మొగ్గుచూపుతున్నారు. మండల కేంద్రంతోపాటు కొన్ని గ్రామాలలో నాటు సారా విక్రయాలు జోరుగా సాగుతున్నాయి.

కొరవడిన నిఘా..

నాటు సారా తయారీ, విక్రయాలపై ఎక్సైజ్‌ శాఖ నిఘా కరువైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా నాటుసారా తయారు చేసే మూలాలపై సంబంధిత శాఖ అధికారులు దృష్టి సారించడం లేదని ప్రజలు బహిరంగంగానే మండిపడుతున్నారు. అయితే అప్పుడప్పుడు ఎక్సైజ్‌ అధికారులు ,పోలీసులు సారా తయారీ స్థావరాలపై  దాడులు చేస్తున్నా మూలాలను విస్మరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సారా తయారీ కేంద్రాలపై దాడులు చేస్తే సారా నుంచి పేద, మధ్య తరగతి కుటుంబాలను కాపాడొచ్చనే వాదనలు ఉన్నాయి. ద్విచక్ర వాహనాలపై నడి రోడ్డుపై యథచ్ఛేగా నాటు సారా ను  తరలిస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారని ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా సారా నియంత్రణపై ఎక్సైజ్‌ శాఖ అధికారులు దృష్టిసారించాలని ప్రజలు కోరుతున్నారు.

About Author