రాజ్యాంగ స్పూర్తితో అధికారులు… ప్రజలకు సేవలందించాలి
1 min readజిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: రాజ్యాంగ స్పూర్తితో అధికారులు బాధ్యతతో ప్రజలకు సేవలందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన పేర్కొన్నారు. ఆదివారం భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాజ్యాంగ రూపకర్త డా.బిఆర్. అంబేద్కర్ చిత్రపటానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన, డిఆర్ఓ మధుసూదన రావు , జిల్లా అధికారులు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కలెక్టర్ రాజ్యాంగం పీఠికను అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎంతోమంది మహానుభావులు దశాబ్దాల తరబడి చేసిన త్యాగాల ఫలితంగా దేశానికి స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలు లభించాయని, ఆ స్వేచ్ఛను బాధ్యతయుతంగా వినియోగించుకునేలా ఎంతోమంది గొప్పవారు కూర్చుని ప్రపంచ దేశాలలో ఉండే మంచిని తీసుకుని ఒక గొప్ప రాజ్యాంగాన్ని రూపొందించారన్నారు..ఈ రాజ్యాంగం ద్వారా దేశాన్ని అన్ని విధాలా పురోగతి వైపు ఏ విధంగా తీసుకెళ్లాలని దిశా నిర్దేశం చేశారన్నారు. ఏ స్ఫూర్తితో అయితే రాజ్యాంగం లిఖించబడిందో, ఆ స్పూర్తికి తగ్గట్టుగా మనం పని చేస్తున్నామా లేదా అని ప్రతి రోజు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడు మీద ఉంటుందని, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల మీద ఆ బాధ్యత ఇంకా ఎక్కువగా ఉంటుందని కలెక్టర్ స్పష్టం చేశారు… ప్రభుత్వ ఉద్యోగులు ప్రజా సేవకులని , ప్రజా సేవకులు ఏ విధంగా ఉండాలో కొన్ని ఆదర్శాలు ఉంటాయని, వాటికనుగుణంగా పనిచేస్తున్నామా లేదా అని చూసుకోవాలన్నారు. మహాత్మా గాంధీ చెప్పినట్లు సమాజంలో అట్టడుగున ఉన్న వ్యక్తిలో వ్యవస్థ నా కోసం పని చేస్తోందని, నన్ను కష్టాల నుండి బయటికి తీసుకుని వస్తుందన్న ఆశ, నమ్మకం కలిగిస్తున్నామా లేదా అని ప్రతి రోజూ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. విధి నిర్వహణలో ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా, వాటిని అధిగమించి రాజ్యాంగానికి కట్టుబడి పనిచేయాలని, తద్వారా మన వ్యక్తిత్వాన్ని, ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవాలని సూచించారు..అప్పడే దేశ గౌరవాన్ని నిలబెట్టిన వాళ్లమవుతామన్నారు. పదిమందికి మంచి చేయాలనే ఉద్దేశంతో పని చేసినప్పుడు ఎంతో మంది గొప్ప వ్యక్తులు త్యాగాలు చేసి మనకు ఇచ్చిన స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలను నిబద్ధతతో గౌరవించుకున్న వాళ్లమవుతామని కలెక్టర్ పేర్కొన్నారు.డిఆర్ఓ మధుసూదన రావు మాట్లాడుతూ మనకు స్వాతంత్రం వచ్చిన సమయం నాటికి ఇంకా రాజ్యాంగం ఏర్పాటు చేసుకోలేదని, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటై సుమారు 2 సంవత్సరాల 11 నెలలు వివిధ దేశాల రాజ్యాంగాలను పరిశీలించి మన సమాజానికి, మన దేశానికి అవసరమైనటువంటి రాజ్యాంగాన్ని రాయడం జరిగిందన్నారు.. భారత రాజ్యాంగం అతిపెద్ద రాజ్యాంగం అని అందుకే మన రాజ్యాంగానికి ఏనుగు గుర్తు కూడా ఉంటుందని పేర్కొన్నారు. భారత రాజ్యాంగం ప్రపంచంలోనే ఎంతో ప్రాముఖ్యత కలిగిఉందని, అందుకే ప్రతి సంవత్సరం నవంబర్ 26న మన దేశంలో రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.