PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సాధార‌ణ ప్రస‌వాలే శ్రేయ‌స్కరం..!

1 min read

* మిసెస్ మామ్ గ్రాండ్ ఫినాలెలో ప్రముఖ సినీన‌టి కాజ‌ల్ అగ‌ర్వాల్‌

* వైభ‌వంగా ముగిసిన ఏడో సీజ‌న్ కార్యక్రమం

డాక్టర్ కె.శి ల్పిరెడ్డి ఫౌండేష‌న్‌, కిమ్స్ క‌డ‌ల్స్ కొండాపూర్ ఆధ్వర్యంలో నిర్వహ‌ణ‌

* సందేశాల‌తో ర్యాంప్ వాక్ చేసిన 40 జంట‌లు

* ప్రశాంత చిత్తంతో సాధార‌ణ ప్రస‌వాలు సాధ్యం: బ్రహ్మకుమారీస్ ప్రతినిధి బీకే స్వామినాథ‌న్‌

హైద‌రాబాద్: ఇటీవ‌లి కాలంలో ప్రస‌వం అంటేనే సిజేరియ‌న్ అంటున్నార‌ని, వాటి కంటే సాధార‌ణ ప్రస‌వాలే ఎప్పుడూ శ్రేయ‌స్కర‌మ‌ని ప్రముఖ సినీన‌టి కాజ‌ల్ అగ‌ర్వాల్ అన్నారు. సాధార‌ణ ప్రస‌వాల మీద అవ‌గాహ‌న పెంపొందించే ల‌క్ష్యంతో డాక్టర్ కె.శిల్పిరెడ్డి ఫౌండేష‌న్‌, కిమ్స్ క‌డ‌ల్స్ ఆస్పత్రి ఆధ్వర్యంలో గ‌త ఏడు సంవ‌త్సరాలుగా విజ‌య‌వంతంగా నిర్వహిస్తున్న మిసెస్ మామ్ ఏడో సీజ‌న్ గ్రాండ్ ఫినాలె కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. బ్రహ్మకుమారీస్‌కు చెందిన శాంతిస‌రోవర్‌లోని గ్లోబ‌ల్ పీస్ ఆడిటోరియంలో ఆదివారం సాయంత్రం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ప్రత్యేక కార్యక్రమం గర్భిణీ స్త్రీలకు మాతృత్వంలో ఉన్న సవాళ్లు, ఆనందాల గురించి తెలుసుకోవడానికి ఒక అవకాశాన్ని కల్పించింది. ఈ సంద‌ర్భంగా గ్రాండ్ ఫినాలె ద‌శ వ‌ర‌కు చేరుకున్న 40 జంట‌ల‌ను కాజ‌ల్ అగ‌ర్వాల్ అభినందించారు. మాతృత్వం అనేది ఒక మ‌ధురానుభ‌వం అని, అందులోని ప్ర‌తి ద‌శ‌నూ త‌ల్లిదండ్రులు ఇద్ద‌రూ ఆస్వాదించాల‌ని తెలిపారు. గ‌ర్భిణి అయిన భార్య‌ను కంటికి రెప్ప‌లా కాపాడుకోవ‌డంతో పాటు, పుట్ట‌బోయే బిడ్డ సంర‌క్ష‌ణ విష‌యంలో కూడా తండ్రుల‌ది చాలా కీల‌క పాత్ర అని ఆమె చెప్పారు. భ‌ర్త చేదోడువాదోడుగా ఉంటే భార్య త‌న మాతృత్వాన్ని మ‌రింత ఆస్వాదించ‌గ‌ల‌ద‌ని వివ‌రించారు.

బ్రహ్మకుమారీస్ సంస్థ ప్రతినిధి బీకే స్వామినాథ‌న్ మాట్లాడుతూ, గ‌ర్భిణులు ప్రశాంత చిత్తంతో ఉంటే సాధార‌ణ ప్రస‌వాలు చేయ‌డం చాలా సుల‌భ‌మ‌న్నారు. ఇందుకోసం యోగ‌, ధ్యానం లాంటివి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని చెప్పారు. ప్రస్తుత కాలంలో ఉద్యోగాల్లో ఉండే ఒత్తిడులు గ‌ర్భిణుల‌పై ప్రభావం చూపుతున్నాయ‌ని, స‌మ‌ష్టి కుటుంబాలు ఉంటే వాటిలోని పెద్దలు ఏం తినాలో, ఏం చేయాలో అన్నీ చెప్పేవార‌ని.. ఇప్పుడు చిన్న కుటుంబాలు కావ‌డంతో ఇవ‌న్నీ స‌రిగా తెలియ‌క చాలామంది ఇబ్బంది ప‌డుతున్నార‌ని అన్నారు. గ‌ర్భ సంస్కారం అనేది చాలా ముఖ్య‌మైన ప్రక్రియ అని, దాన్ని కాబోయే త‌ల్లిదండ్రులు అంద‌రూ పాటించాల‌ని సూచించారు.

గ్రాండ్ ఫినాలెకు హాజ‌రైన అతిథులు, జంట‌ల‌ను ఉద్దేశించి కిమ్స్ కడల్స్ ఆస్ప‌త్రి ఆబ్స్టెట్రిక్స్, గైనకాలజీ క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ కె. శిల్పిరెడ్డి మాట్లాడుతూ, “ సాధార‌ణ ప్రస‌వాల‌ను ప్రోత్సహించడంతో పాటు కుటుంబ వ్యవ‌స్థను మ‌ళ్లీ ప‌రిచ‌యం చేయ‌డానికి ఈ కార్యక్రమాన్ని నిర్వ‌హించాం. త‌ల్లిదండ్రులు ఏం తినాలి, పిల్లల‌కు ఏం పెట్టాల‌నే అంశాల‌ను వారికి వివ‌రించాం. 70-80 ర‌కాల అంశాల‌ను ఈ త‌ల్లిదండ్రుల‌కు ప‌రిచ‌యం చేశాం. ఇంత‌మందికి ఒకేచోట ఎడ్యుకేట్ చేయ‌గ‌లిగితే వాళ్లు స‌మాజంలో ఈ సందేశాన్ని పంచుతారు. సాధార‌ణ ప్ర‌స‌వం అన‌గానే నొప్పులు భ‌రించ‌లేం అన్నట్లుగా చెబుతున్నారు. ఇది త‌ప్పు. గ‌తంలో అన్నీ సాధార‌ణ ప్ర‌స‌వాలే ఉండేవి. త‌ర్వాత క్ర‌మంగా వివిధ కార‌ణాల‌తో సిజేరియ‌న్లు పెరిగాయి. ప్రస‌వం అనేది సహ‌జంగా జ‌రిగే ప్రక్రియ‌. దాన్ని అలాగే జ‌ర‌గ‌నివ్వాలి. ఇంత‌కుముందు సీజ‌న్లలో పాల్గొన్న‌వారిలో 85% మందికి సాధార‌ణ ప్రస‌వాలే జ‌రిగాయి. వ‌క్రీక‌ర‌ణ‌లు చాలా జ‌రుగుతున్నాయి కాబ‌ట్టి, వీరికి అవ‌గాహ‌న పెంచాలి. ఇక్కడ పాల్గొన్నవారు త‌మ బంధువులు, స్నేహితుల‌కు చెప్పినా నెమ్మ‌దిగా స‌మాజం మొత్తం మారుతుంది” అని చెప్పారు.

న‌వంబ‌రు 19, 24, 25 తేదీల‌లో మొత్తం 290 జంట‌ల‌కు ఆహారం, వ్యాయామాలు, యోగా, ప్రీనేట‌ల్ యోగా, జుంబా, మెంట‌ల్ వెల్ నెస్, చైల్డ్ కేర్, పీడియాట్రిక్, స్కిన్ కేర్, డెంట‌ల్ కేర్, గ్రూమింగ్, ప‌ర్స‌నాలిటీ డెవ‌ల‌ప్‌మెంట్, రిలేష‌న్‌షిప్ బిల్డింగ్, క‌పుల్ సెష‌న్స్ లాంటి ప‌లు కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. వాటిలో వారి ప్రాతినిధ్యం, భాగ‌స్వామ్యం, అవ‌గాహ‌న‌ల ఆధారంగా వారిలోంచి 40 జంట‌ల‌ను గ్రాండ్ ఫినాలేకు ఎంపిక చేశారు. విశాఖ‌ప‌ట్నం, చెన్నై, బెంగ‌ళూరు న‌గ‌రాల్లో కూడా ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. మూడు న‌గ‌రాల్లో మొద‌టి మూడు స్థానాల్లో నిలిచిన 9 జంట‌ల‌ను హైద‌రాబాద్ తీసుకొచ్చి, ఇక్క‌డ వారికి నేరుగా గ్రాండ్ ఫినాలెలో ప్ర‌వేశం క‌ల్పించారు. వారితో క‌లిపి మొత్తం 40 జంట‌లు గ్రాండ్ ఫినాలె సంద‌ర్భంగా గ‌ర్భ‌ధార‌ణ‌, ప్ర‌స‌వం, పిల్ల‌ల పెంప‌కం త‌దిత‌ర అంశాల‌కు సంబంధించి భావిత‌రాల‌కు ఉప‌యోగ‌ప‌డేలా సందేశాల‌ను ప్ర‌ద‌ర్శిస్తూ ర్యాంప్ వాక్ చేశారు. అనంత‌రం జానీ చేసిన స్టాండ‌ప్ కామెడీ అంద‌రినీ న‌వ్వుల్లో ముంచెత్తింది.

కిమ్స్ క‌డ‌ల్స్ మిసెస్ మామ్ ఏడో సీజ‌న్ గ్రాండ్ ఫినాలెలో విజేత‌గా… నిలిచారు.

ర‌న్నర్, ఫస్ట్ ర‌న్నర‌ప్, సెకండ్ ర‌న్నర‌ప్‌, బెస్ట్ హెయిర్, బెస్ట్ స్కిన్, బ్యూటిఫుల్ బ్రెయిన్… ఇలాంటి కేట‌గిరీల‌లో బ‌హుమ‌తులు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి గౌర‌వ అతిథిగా ఒయాసిస్ ఫెర్టిలిటీ సెంట‌ర్ డైరెక్టర్ డాక్టర్ దుర్గారావు హాజ‌ర‌య్యారు. ప్రత్యేక అతిథులు, జ్యూరీ స‌భ్యులుగా శాషా క్లినిక్ డైరెక్టర్ డాక్టర్ న‌వ్య‌, నుస్కా కిచెన్ వ్యవ‌స్థాప‌కురాలు శ్రీ‌మ‌తి అప‌ర్ణా తివారీ, కార్డ్ లైఫ్ ఇండియా టెక్నిక‌ల్ డైరెక్టర్ డాక్టర్ ప్రశాంతోరాయ్ చౌధురి, హౌస్ ఆఫ్ మాన్సి వ్య‌వ‌స్థాప‌కురాలు శ్రీ‌మ‌తి మాన్సి ఉప్పల‌, జేజే హాస్పిట‌ల్‌కు చెందిన గైనకాల‌జిస్టు డాక్టర్ జ‌యంతి రెడ్డి, సాగ‌ర్ చంద్ర‌మ హాస్పిట‌ల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తింతిషా సాగ‌ర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.     

About Author