PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పారదర్శకతతో స్వచ్ఛమైన ఓటర్ల జాబితా సిద్ధం చేయండి..

1 min read

స్వీప్ కార్యక్రమాల ద్వారా అర్హులైన ఓటర్లతో  పాటు 18 సంవత్సరాలు నిండిన యువతను ఓటర్లుగా నమోదు చేయండి..

ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ బి. శ్రీధర్

జిల్లాలో ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంపై సంతృప్తి వ్యక్తం చేసిన వివిధ రాజకీయ పక్షాల ప్రతినిధులు

పల్లెవెలుగు వెబ్ ఏలూరు  : స్వచ్ఛమైన ఓటర్ల జాబితా రూపొందించడం ద్వారా ఎన్నికల ప్రక్రియను సజావుగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవడానికి వీలుంటుందని కాలుష్య నియంత్రణామండలి మెంబర్ సెక్రటరీ, జిల్లా రోల్ అబ్జర్వర్ బి. శ్రీధర్ అన్నారు. ఫోటో ఓటరు జాబితాల సంక్షిప్త సవరణ-2024 కార్యక్రమానికి సంబంధించి ఏలూరు జిల్లా రోల్ అబ్జర్వర్ బి. శ్రీధర్  బుధవారం స్థానిక కలెక్టరేట్ గౌతమీ సమావేశ మందిరంలో జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా ఇన్ చార్జి కలెక్టర్ బి. లావణ్యవేణి, జిల్లాలోని ఏడు నియోజకవర్గాల ఈఆర్వోలు, ఏ ఈ ఆర్ ఓ లు, గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి, ఏలూరు జిల్లాలో ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణ కార్యక్రమం పై సమీక్షించారు. తొలుత ఏలూరు జిల్లాలో ఓటర్ల జాబితాల ప్రత్యేక సంక్షిప్త సవరణ, స్వీప్ కార్యక్రమాలపై  జిల్లా ఇన్ చార్జి కలెక్టర్ బి. లావణ్యవేణి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్బంగా రోల్ అబ్జర్వర్ బి. శ్రీధర్ మాట్లాడుతూ స్వచ్ఛమైన ఓటర్ల జాబితా రూపొందించేందుకే తరచూ గుర్తింపు పొందిన రాజకీయ పక్షాల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి ఏమైనా సమస్యలుంటే వెంటనే పరిష్కరించడం జరుగుతుందన్నారు. 2024 జనవరి 1 నాటికి 18 సంవత్సరాల వయస్సు గల  ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేయాలన్నారు. ఇందుకోసం స్వీప్ కార్యక్రమాలను నిర్వహించి అన్ని విద్యా సంస్ధల్లో 18 సంవత్సరాలు నిండిన విద్యార్ధినీ విద్యార్ధులను ఓటర్లుగా నమోదు చేసే బాధ్యత మనపై ఉందన్నారు.  ఓటర్ల నమోదుకు ఇంకా సమయం ఉన్నందున ఈ విషయంపై ఏఇఆర్ఓలు, ప్రత్యేక ఏఇఆర్ఓలు దృష్టి సారించాలన్నారు. ఎన్నికల సంవత్సరం కాబట్టి ఫోటో ఓటర్ల జాబితాల సంక్షిప్త సవరణపై ప్రత్యేక దృష్టి సారించాలని, అర్హులైన ఓటర్లను నమోదు చేయాలని, ఓటర్ల జాబితాలు స్వచ్చీకరణ చేయడం, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేయడం ఎంతో ముఖ్యమన్నారు. వివిధ రాజకీయ పక్షాల నుంచి వచ్చిన ఫిర్యాదులు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి ఈసీ నిబంధనలు పాటించి పరిష్కరించాలన్నారు.  ఏ చిన్న ఫిర్యాదు అందిన చాలా జాగ్రత్తగా పరిశీలించి ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం సరైన విధంగా పరిష్కరించాలన్నారు. ఓటర్ల జాబితాలపై క్లెయిమ్ లు,  అభ్యంతరాల స్వీకరణకు డిసెంబర్ 9 వరకు గడువు ఉందని, డిసెంబర్ 26 లోగా వాటిని పరిష్కరించాలని, 2024 జనవరి 5 నాటికి తుది జాబితాలు ప్రకటించాలన్నారు. డిసెంబర్ 2, 3 తేదీలలో ప్రత్యేక క్యాంపెయిన్ నిర్వహించి క్లైయిమ్ లు,  అభ్యంతరాలు స్వీకరించాలన్నారు. ఏలూరు జిల్లాలో ప్రతి పోలింగ్ స్టేషన్ల్ కు బిఎల్ఓలను నియమించడం జరిగిందని అదే విధంగా  టిడిపి, వైఎస్ఆర్ సిపి పార్టీలు బూత్ లెవల్ ఏజెంట్లను నియమించుకోవడం జరిగిందన్నారు. అదే విధంగా గత నెల 27వ తేదీన ఓటర్ల జాబితా ముసాయిదాను విడుదల చేసి సాప్ట్, హార్డ్ కాపీలను గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు అందించడం జరిగిందన్నారు.  తొలుత జిల్లా ఇన్ చార్జి కలెక్టర్ బి. లావణ్యవేణి మాట్లాడుతూ ఏలూరు జిల్లాలో 3 రెవెన్యూ డివిజన్లు, 28 మండలాలు, 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, ఒక పార్లమెంటరీ నియోజకవర్గం ఉన్నాయన్నారు. జిల్లా జనాభా 21,35,149 కాగా ఓటర్ల జాబితాల సవరణ షెడ్యూల్ ప్రకారం గత నెల 27 నాటికి ముసాయిదా జాబితాలు ప్రకటించడం జరిగిందన్నారు, దీని ప్రకారం జిల్లాలో పురుష ఓటర్లు 7,78,884, మహిళా ఓటర్లు 8,09,615  థర్డ్ జెండర్ ఓటర్లు 123, కాగా మొత్తం 15,88,622 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. సర్వీసు ఓటర్లు 688 మంది ఉన్నారన్నారు.  జనాభా: ఓటర్ల నిష్పత్తి (ఈ పీ రేషియో) 744, జెండర్ రేషియో 1039 కాగా   జిల్లాలో 1743 పోలింగ్ కేంద్రాలు గుర్తించినట్లు ఇన్ చార్జి కలెక్టర్ తెలిపారు. వాటిలో అవసరమైన మౌలిక వసతులు కల్పించడం జరిగిందన్నారు. జిల్లాలో ఈనెల 4,5 తేదీల్లో ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమం చేపట్టడం ద్వారా 4వ తేదీన 5 వేల 129, 5వ తేదీన 6 వేల 431 క్లైయిమ్ లు స్వీకరించడం జరిగిందన్నారు.  జిల్లాలో ఇప్పటి వరకు 1,95, 122 క్లైయిమ్ లను స్వీకరించగా వాటిలో ఇప్పటికే 1,85,052 పరిష్కరించడం జరిగిందన్నారు.డిశంబరు 2, 3 తేదీల్లో ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమం అన్ని పోలింగ్ స్టేషన్ లలో నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో స్వీప్ కార్యక్రమాలు చేపట్టామన్నారు.  ఈ సమావేశంలో పాల్గొన్న వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు సిర్రా భరత్(బిఎస్పీ), నెరుసు నెలరాజు(బిజెపి), ఎ. రవి(సిపిఎం), రాజనాల రామ్మోహన్ రావు(కాంగ్రేస్), పాలి ప్రసాద్(టిడిపి), కలవకొల్లు సాంబ(వైఎస్ఆర్ సిపి)  జిల్లాలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై తమ సంతృప్తిని వ్యక్తం చేశారు.  ప్రతివారం జిల్లా కలెక్టర్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ఓటర్ల జాబితాపై ఏమైనా సమస్యలు, సందేహాలుంటే నివృత్తి చేసి పరిష్కరించడం జరుగుతున్నదన్నారు.  ఈవిఎం లకు సంబంధించి ఫస్ట్ లెవల్ చెకింగ్ లో పాల్గొన్నామని వారు సంతృప్తి వ్యక్తం చేశారు.  పత్రికల్లో ఓటర్ల జాబితాపై వస్తున్న వార్తలను పరిశీలించి తగు చర్యలు తీసుకొని వాస్తవాలను పత్రికాముఖంగా తెలపాలని కోరారు. సమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారి ఎం. వెంకటేశ్వర్లు, ఈఆర్ఓలైన నూజివీడు సబ్ కలెక్టర్ ఆదర్ష్ రాజేంధ్రన్,జెడ్పి సిఇఓ కె. ఎస్.ఎస్. సుబ్బారావు, ఏలూరు ఆర్డిఓ ఎన్.ఎస్.కె. ఖాజావలి, కె.ఆర్.సిసి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జివివి సత్యనారాయణ, జంగారెడ్డిగూడెం ఆర్డిఓ కె. అద్దయ్య, పోలవరం ప్రాజెక్ట్ ఆర్ఎంసి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె. గీతాంజలి, జిల్లాలోని వివిధ నియోజకవర్గాల ఏఇఆర్ఓలు, ప్రత్యేక ఏఇఆర్ఓలు పాల్గొన్నారు.

About Author