ఆటకు అందలం..అడుదాం ఆంధ్రా..!
1 min readకనీవినీ ఎరుగని మహా క్రీడా సంరంభం..
యువత లో క్రీడా నైపుణ్యాలను వెలికి తీయడమే లక్ష్యంగా..
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మునుపెన్నడూ నిర్వహించని విధంగా సరికొత్త క్రీడా సంరంభాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు యువతలో క్రీడా నైపుణ్యాలను వెలికి తీయడమే లక్ష్యంగా ఈ మెగా టోర్నమెంట్ జరగనుంది. రాష్ట్రంలో పాఠశాల, కళాశాల స్థాయి క్రీడా కార్యక్రమాలే అంతంతమాత్రంగా గతంలో జరిగేవి. వాటన్నింటికీ భిన్నంగా ఆసక్తి ఉన్న వారెవరైనా నమోదు చేసుకుని, తమకు నచ్చిన ఆటల పోటీల్లో పాల్గొనేందుకు అవకాశం కల్పించే వినూత్న వేదికే ఈ ‘ఆడుదాం ఆంధ్రా’. ఇందుకు కావాల్సిన అర్హతలు కూడా చాలా తేలికైనవే. ఆంధ్రా స్థానికులు కావడం, 15 ఏళ్లు పైబడి ఉండటం మాత్రమే. క్రీడాపోటీలకు నమోదు చేసుకుంటే చాలు సామగ్రి నుంచి నగదు బహుమతుల వరకు మొత్తం ప్రభుత్వమే భరించనుండటం విశేషం. మరి ఇంకెందుకాలస్యం.. ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి అంటోంది ప్రభుత్వం.
సచివాలయ స్థాయి నుంచి..
ప్రభుత్వం ఈ క్రీడాపోటీలను ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయ స్థాయి నుంచి అయిదు దశల్లో నిర్వహించనుంది. ప్రతి దశలోనూ క్రీడాకారుల ప్రతిభను వెలికితీయడంతో పాటుగా విజేతలను సర్టిఫికెట్స్, మెమెంటోలు, నగదు పురస్కారాలతో సత్కరించనుంది.
విజేతలకు నగదు బహుమతులు..
క్రీడా చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో 15 సంవత్సరాల వయస్సు పైన ఉన్న ప్రతి ఒక్కరూ ఇందులో పాల్గొనవచ్చు. యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడానికి అయిదు క్రీడలు- క్రికెట్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, బ్యాడ్మింటన్ డబుల్స్‌లో విజేతలకు నగదు బహుమతులు ఇవ్వనుంది. దీనితోపాటు సంప్రదాయ యోగా, టెన్నీకాయిట్, మారథాన్ పోటీలను నిర్వహించనుంది ఏపీ ప్రభుత్వం.
లక్షన్నర మ్యాచ్ లు..
తొలి దశలో భాగంగా 15,004 గ్రామ/వార్డు సచివాలయాల పరిధిలో మొత్తం 1.50లక్షల మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఇక్కడి విజేతలు అనంతరం మండల స్థాయిలో పోటీపడతారు. అంటే 680 మండలాల్లో మొత్తం 1.42లక్షల మ్యాచ్‌లు ఉంటాయి. ఈ దశలో గెలుపొందిన జట్లను నియోజవకర్గ పోటీలకు పంపిస్తారు. 175 నియోజకవర్గాల్లో 5,250 మ్యాచ్‌లలో పోటీలు నిర్వహిస్తారు.
50 రోజులపాటు క్రీడా మహోత్సవం..
వీటిల్లో సత్తా చాటిన వారు జిల్లా స్థాయికి ఆడాల్సి ఉంటుంది. 26 జిల్లాల్లో 312 మ్యాచ్‌లు నిర్వహిస్తారు. జిల్లా స్థాయి విజేతలతో రాష్ట్ర స్థాయిలో 250 మ్యాచ్‌ల్లో పోటీపడేలా షెడ్యూల్ రూపొందిస్తున్నారు. గ్రామ వార్డు సచివాలయ స్థాయిలో 34.20 లక్షల మంది, మండల స్థాయిలో 17.10లక్షల మంది, నియోజకవర్గ పోటీల్లో 77,520 మంది, జిల్లా స్థాయిలో 19,950 మంది, రాష్ట్ర స్థాయిలో 2,964 మంది ‘ఆడుదాం-ఆంధ్ర’ క్రీడల్లో ప్రాతినిధ్యం వహించనున్నారు. వివిధ దశల్లో కలిపి మొత్తం 52.31లక్షల మంది ఒకే వేదికపై 50 రోజుల పాటు క్రీడా మహోత్సవంలో సందడి చేయనున్నారు.
దరఖాస్తు చేసుకోండిలా..
15 ఏళ్లకు పైబడిన క్రీడాకారులు పురుషులు గానీ మహిళలు తమ సమీపంలోని గ్రామ వార్డు సచివాలయంలో, వాలంటీర్ల ద్వారా, ఆన్‌లైన్‌లో aadudamandhra.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా, 1902కి ఫోన్ చేసి వివరాలు నమోదు చేసుకునే వెసలుబాటును కల్పించింది ప్రభుత్వం. ఇప్పటికే క్రీడా సామగ్రిని జిల్లాలకు తరలించారు అధికారులు. పోటీల్లో విజేతలకు సర్టీఫికెట్లు, ట్రోఫీలు, పతకాలు అందజేస్తారు. నియోజవకర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయి విజేతలకు ప్రత్యేక నగదు బహుమతులు అందజేస్తారు. విశాఖపట్నంలో ఫైనల్స్ జరగనున్నాయి.