కరువు ప్రాంతంగా ప్రకటించే వరకు పోరాటం చేద్దాం
1 min readవి.యన్. పల్లె అభిమానుల కార్యకర్తల సమావేశంలో సాయినాథ్ శర్మ పిలుపు*
7 వ తేదీ వి. ఎన్. పల్లె లో రైతులతో కలసి నిరసన
పల్లెవెలుగు వెబ్ కమలాపురం : గత అనేక దశాబ్దాలుగా కరువు పీడిత ప్రాంతంగా అతివృష్టి అనావృష్టి లాంటి అనేక ప్రకృతి వైపరీత్యాలకు లోనై ఇబ్బందులు పడుతున్న కమలాపురం ప్రాంతాన్ని శాశ్వత కరువు ప్రాంతంగా ప్రకటించే వరకు పోరాటం చేసి రైతన్నలకు అండగా నిలుద్దామని “”కమలాపురం నియోజకవర్గ ప్రజానాయకుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి తెలుగు నాడు ప్రజాసేవ సమితి రాష్ట్ర అధ్యక్షుడు “కాశీభట్ల సత్య సాయినాథ్ శర్మ” నియోజకవర్గంలోని వీరపనాయన పల్లె మండలం తన అభిమానులకు కార్యకర్తలకు నాయకులకు పిలుపునిచ్చారు””. కమలాపురం లోని తన కార్యాలయంలో వి.యన్. పల్లె మండల వాసులతో ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. కడప జిల్లాలో కరువు ప్రాంతానికి “నిదర్శనంగా” నిలిచిన కమలాపురం నియోజకవర్గాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన కరువు మండలాల జాబితాలో చేర్చకపోవడం కమలాపురం నియోజకవర్గ రైతాంగానికి వీరు “ద్రోహం చేసినట్లేనని” ఆయన మండిపడ్డారు. పక్కన ఉన్న అనంతపురం జిల్లాలో అన్నమయ్య జిల్లాలో కరువు ప్రాంతాలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం కడప జిల్లాలోని ముఖ్యంగా” కమలాపురం ప్రాంతాన్ని కరువు ప్రాంతంగా “ఎందుకు గుర్తించలేకపోయిందని ఆయన ప్రశ్నించారు. కిందిస్థాయి అధికారులు ఇచ్చే తప్పుడు లెక్కల సమాచారంతో నియోజకవర్గాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించకపోవడం శోచనీయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కరువు ప్రాంతంగా కమలాపురం నియోజకవర్గాన్ని గుర్తించకుండా పక్కన పెట్టినప్పటికీ నాయకులు ఎవరు నోరు మెదపకపోవడం విచారకరమన్నారు. కమలాపురం ప్రాంతం కంటే అనంతపురం జిల్లాలో ,అన్నమయ్య జిల్లాలో వర్షపాతం ఎక్కువగానే కురిసినప్పటికీ అక్కడి నాయకులు, రైతుల పట్ల శ్రద్ధ ఉండడంతో వారి ప్రమేయంతో కరువు ప్రాంతంగా ప్రకటింప చేసుకున్నారన్నారు. కరువు ప్రాంతాల మండలాలను పరిశీలిస్తే పూర్తిస్థాయిలో నీటిపారుదల సౌకర్యం ఉన్న మండలాలను సైతం కరువు మండలాలుగా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం “”పూర్తి ఎడారి ప్రాంతంగా ఉన్న కమలాపురం నియోజకవర్గంలోని వీరపనాయినిల్లె మండలాన్ని ,పెండ్లిమర్రి ,కమలాపురం, వల్లూరు, ప్రాంతాలను కరువు మండలాలుగా గుర్తించకపోవడం రైతాంగానికి తీవ్ర అన్యాయం చేసినట్లేనన్నారు””. రాష్ట్ర ప్రభుత్వం కమలాపురం నియోజకవర్గ రైతుల పట్ల అవలంబించిన తీరును ప్రశ్నించకపోవడం కూడా “రైతాంగానికి తీరని అన్యాయం” చేసినట్లేనన్నారు. రైతుల సంక్షేమం పట్ల రైతులకు సహాయం చేయడం పట్ల రాజకీయాలు పక్కన పెట్టాలన్నారు. కరువు ప్రాంతంగా ప్రకటించకపోవడం వల్ల అనేక రకాల సదుపాయాలను రైతులు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. వీరపునాయన పల్లె మండలంలో “”సర్వారాయ సాగర్ రైతుల సంక్షేమం”” కోసం ఎంతగానో ఉపయోగపడుతుందని భావించిన వీరపునాయుని పల్లె కర్షకులకు ఆ ప్రాజెక్టు ఒక కలగానే మిగిలిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సర్వారాయ సాగర్ కుడి కాలువ ఎడమ కాలువ నిర్మాణ పనులు మధ్యలోనే ఆగిపోవడం వాటిపట్ల నాయకులు శ్రద్ధ పెట్టకపోవడం శోచనీయమన్నారు. సర్వారాయ సాగర్ ఏర్పాటయితే “కరువు పీడత ప్రాంతంగా ఉన్న వీరపునాయునిపల్లె మండలం సస్యశ్యామలమవుతుందని భావించిన రైతాంగానికి తీరని వ్యధను పాలకులు మిగిల్చారన్నారు”. సర్వారాయ సాగర్ నిర్మాణం ద్వారా ఎడమ కాలువకు, కుడికాలువకు నీళ్లు వదిలితే ఆ కాలువల ద్వారా అనుసంధానంగా పిల్ల కాలువలు త్రవ్వి తమకు ఎంతగానో మేలు చేస్తారని మండల రైతాంగమంతా భావించారని అయితే రైతుల ఆశలన్నీ అడియాసలయ్యాయన్నారు. గత రెండు మూడు దశాబ్దాలుగా ఒకవైపు అతివృష్టి, అనావృష్టి కారణంగా అప్పుల ఊబిలో కూరుకుపోతున్న కమలాపురం నియోజకవర్గ రైతాంగానికి “కరువు ప్రాంతంగా” ప్రకటించకుండా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన వైఖరి రైతులకు గోరుచుట్టపై రోకలి పోటు లాగా మారిందన్నారు. ఈ కార్యక్రమంలో VN పల్లే మండల నాయకులు అడవిచెర్లోపల్లె చిన్న నారాయణరెడ్డి (సర్పంచ్), బేరి లక్ష్మయ్య, గండి రామకృష్ణయాదవ్ కాటసాని లక్ష్మిరెడ్డి, దివాకర్ రెడ్డి, భార్గవ్ రెడ్డి,శివానందరెడ్డి, నారాయణరెడ్డి, ప్రతాప్ రెడ్డి, అనిమల హరి, కిరణ్ రెడ్డి ,రామయ్య, మొయిల చెరువు శ్రీరామ్ రెడ్డి, రామచంద్ర రెడ్డి, కృష్ణారెడ్డి, సిద్దేశ్వర్ రెడ్డి , ఊర్లుటూరు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.