వేగంగా… ‘స్వమిత్వ’ పనులు
1 min readటార్గెట్ 11001… పూర్తి చేసినవి 4493
- గ్రామాల్లో దగ్గరుండి పరిశీలిస్తున్న పంచాయతీరాజ్ జిల్లా అధికారి నాగరాజు నాయుడు
పల్లెవెలుగు, కర్నూలు:కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అబాది సర్వే ( నివాస ప్రాంతాలు) పనులను పకడ్బందీగా నిర్వహిస్తున్నామన్నారు పంచాయతీరాజ్ జిల్లా అధికారి నాగరాజు నాయుడు. గ్రామీణ ప్రజలకు ఉపయోగపడే స్వమిత్వ పనులను శరవేగంగా… చురుకుగా కొనసాగిస్తున్నామన్నారు. బుధవారం కర్నూలు జిల్లాలోని తిప్పాయపల్లి, కన్నమడకల గ్రామాల్లో స్వమిత్వ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓర్వకల్లుతోపాటు కేతవరం, కన్నమకడల, తిప్పాయపల్లి, లొద్దిపల్లి, కర్నూలు మండలంలోని గార్గేయపురం, బి.తాండ్రపాడు, వెల్దుర్తి మండలంలోని బుక్కాపురం గ్రామాల్లో స్వమిత్వ పనులను పంచాయతీరాజ్ సిబ్బంది చురుకుగా చేస్తున్నారన్నారు. ఇప్పటి వరకు 11001 లక్ష్యంగా ఇవ్వగా… వారం రోజుల్లోనే 4493 పనులు పూర్తి చేశామన్నారు. పనుల్లో భాగంగా ప్రజల ఇంటి స్థలాలకు సంబంధించి హద్దులు చూపడం… పట్టా లేకుండా ప్రభుత్వం ద్వార శాశ్విత భూ హక్కు పత్రం ఇచ్చేలా చేయడం, బ్యాంకులలో లోన్ సౌకర్యం కల్పించడం, ఖాళీ స్థలాలను పంచాయతీలకు అప్పగించడం వంటి పనులను స్వమిత్వ ద్వారా చేస్తున్నామన్నారు. గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అబాది సర్వే (నివాస ప్రాంతం) పనులు చేస్తోందని, ఇందుకు ప్రజలు పూర్తిస్థాయిలో సహకరించాలని ఈ సందర్భంగా పంచాయతీరాజ్ జిల్లా అధికారి నాగరాజు నాయుడు కోరారు.