కరువు ప్రాంతంగా ప్రకటించాల్సిందే…
1 min readటీడీపీ పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి కాశీభట్ల సత్య సాయినాథ్ శర్మ
పల్లెవెలుగు, కమలాపురం: అనేక దశాబ్ధాలుగా కరువు పీడిత ప్రాంతంగా అతివృష్టి అనావృష్టి లాంటి అనేక ప్రకృతి వైపరీత్యాలకు లోనై ఇబ్బందులు పడుతున్న కమలాపురం ప్రాంతాన్ని శాశ్వత కరువు ప్రాంతంగా ప్రకటించే వరకు పోరాటం చేసి రైతన్నలకు అండగా నిలుద్దామని కమలాపురం నియోజకవర్గ ప్రజానాయకుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి, తెలుగు నాడు ప్రజాసేవ సమితి రాష్ట్ర అధ్యక్షుడు కాశీభట్ల సత్య సాయినాథ్ శర్మ అన్నారు.వీరపునాయునిపల్లె మండల కేంద్రంలో రైతులతో కలిసి వీరపునాయినపల్లె సెంటర్ నుండి తహసిల్దార్ కార్యాలయం వరకు శాంతియుతంగా రైతులచే ప్రదర్శన ర్యాలీ నిర్వహించి తహసిల్దార్ కార్యాలయం ఎదుట శాంతియుత నిరసన తెలిపారు. అనంతరం తహసిల్దార్ కార్యాలయంలో తక్షణం కరువు మండలంగా ప్రకటించాలని వినతిపత్రం అందజేశారు.ఆయన మాట్లాడుతూ కడప జిల్లాలో కరువు ప్రాంతానికి నిదర్శనగా నిలిచిన కమలాపురం నియోజకవర్గాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన కరువు మండలాల జాబితాలో చేర్చకపోవడం కమలాపురం నియోజకవర్గ రైతాంగానికి ద్రోహం చేసినట్లేనని ఆయన మండిపడ్డారు. పక్కనే ఉన్న అనంతపురం, అన్నమయ్య జిల్లాల్లో కరువు ప్రాంతాలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం కడప జిల్లాలోని కమలాపురం ప్రాంతాన్ని కరువు ప్రాంతంగా ఎందుకు గుర్తించలేకపోయిందని ప్రశ్నించారు.కిందిస్థాయి అధికారులు ఇచ్చే తప్పుడు లెక్కల సమాచారంతో నియోజకవర్గాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించకపోవడం శోచనీయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కరువు ప్రాంతంగా కమలాపురం నియోజకవర్గాన్ని గుర్తించకుండా పక్కన పెట్టినప్పటికీ నాయకులు ఎవరు నోరు మెదపకపోవడం విచారకరమన్నారు. కమలాపురం ప్రాంతం కంటే అనంతపురం, అన్నమయ్య జిల్లాలో వర్షపాతం ఎక్కువగానే కురిసినప్పటికీ అక్కడి నాయకులకు రైతుల పట్ల శ్రద్ధ ఉండడంతో వారి ప్రమేయంతో కరువు ప్రాంతంగా ప్రకటింప చేసుకున్నారన్నారు. కరువు ప్రాంత మండలాలను పరిశీలిస్తే పూర్తిస్థాయిలో నీటిపారుదల సౌకర్యం ఉన్న మండలాలను సైతం కరువు మండలాలుగా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం పూర్తి ఎడారి ప్రాంతంగా ఉన్న కమలాపురం నియోజకవర్గంలోని వీరపునాయునిపల్లె, పెండ్లిమర్రి, కమలాపురం, వల్లూరు మండలాలను కరువు మండలాలుగా గుర్తించకపోవడం రైతాంగానికి తీవ్ర అన్యాయం చేసినట్లేనన్నారు.రాష్ట్ర ప్రభుత్వం కమలాపురం నియోజకవర్గ రైతుల పట్ల అవలంబించిన తీరును ప్రశ్నించకపోవడం కూడా రైతాంగానికి తీరని అన్యాయం చేసినట్లేనన్నారు. వీరపునాయునిపల్లె మండలంలో నిర్మించిన సర్వరాయసాగర్ ప్రాజెక్టు నీరు రైతులకు అందకపోవడం దురదృష్టకరమని, రైతు పొలాలను గుండా కాలువలను తవ్వి ఇతర ప్రాంతాలకు నీటిని తరలించడం దుర్మార్గం అన్నారు. సర్వరాయసాగర్ వీరపునాయునిపల్లె మండల రైతులది ఈ నీటిని ఇతర ప్రాంతాలకు తరలిస్తే సహించేది లేదని హెచ్చరించారు.తక్షణమే ప్రభుత్వం స్పందించి వీరపునాయునిపల్లె మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ రైతులు నాయకులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.