సామాజిక వన విభాగం ఆధ్వర్యంలో కార్తీక వన మహోత్సవం..
1 min readముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ వై ప్రసన్న వెంకటేష్ , జాయింట్ కలెక్టర్ బి లావణ్య వేణి
ప్రకృతిని అభివృద్ధి చేద్దాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : పర్యావరణ పరిరక్షణ మనందరి సమిష్టి బాధ్యత అని జిల్లా కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ అన్నారు. పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా నూజివీడు మండలం బత్తులవారిగూడెంలో సామాజిక వనవిభాగం ఆధ్వర్యంలో నగరవనంలో ఏర్పాటుచేసిన కార్తీక వన మహోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ ప్రకృతిని ప్రేమించటం, ప్రకృతితో కలిసి జీవించటం జీవన విధానంలో ఒక భాగం చేసుకోవాలని, అప్పుడే పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందన్నారు. ప్రతీ వ్యక్తి పుట్టిన రోజు, పెళ్లి రోజు వంటి ప్రముఖ రోజులలో ఒక చెట్టును నాటే సంప్రదాయాన్ని అలవాటుగా చేసుకోవాలని, అంతేకాక తమ పిల్లలకు చిన్నతనం నుండే అభిరుచిగా చేయాలన్నారు. ప్రకృతికి మనిషికి విడదీలేని అనుబంధం ఉందన్నారు. అయినప్పటికీ మానవుడు చేసే కొన్ని చర్యలతో పర్యావరణానికి ముప్పు ఏర్పడుతుందని, దీనివల్ల నీటికొరత, నదులు ఎండిపోవడం, కాలుష్యం పెరగడం లాంటి ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని, వీటివల్ల మానవజాతి మనుగడకు ముప్పు ఏర్పడుతుందన్నారు. ఏలూరు జిల్లాలో మూడు ప్రదేశాలను పూర్తి చెట్లతో కూడిన ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రజలు కుటుంబ సభ్యులతో సహా వచ్చి సేదతీరేందుకు వీలుగా నగరవనాలుగా అభివృద్ధి చేస్తున్నామని, ఏలూరు, నూజివీడులను ఇప్పటికే నగరవనాలు ఏర్పాటు చేశామని వీటితో పాటు మరో ప్రాంతాన్ని గుర్తించి అభివృద్ధి చేస్తామన్నారు. ప్రతీ కుటుంబం ఈ నగరవానాలలో వారంలో కనీసం ఒక్కరోజైనా టెన్షన్ జీవితానికి, కాలుష్యానికి దూరంగా, ప్రకృతి ఒడిలో ఆహ్లాదంగా గడపాలన్నదే నగరవానాల ముఖ్య ఉద్దేశ్యమన్నారు. రోడ్లు, భవనాల శాఖ, పంచాయతీ రాజ్ శాఖలు రోడ్లు నిర్మాణం, రోడ్లు వెడల్పు వంటి సమయాలలో రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటి, వాటి పరిరక్షణకు చర్యలు తీసుకోవాలన్నారు. జాయింట్ కలెక్టర్ బి. లావణ్య వేణి, ఐ టి డి ఏ ప్రాజెక్ట్ అధికారి సూర్య తేజ, నూజివీడు సబ్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, అసిస్టెంట్ కలెక్టర్ శ్రీపూజ జిల్లా అటవీశాఖాధికారి రవీంద్ర దామా, సామజిక వనాల అధికారి హిమ శైలజ, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో జాయింట్ డైరెక్టర్ నక్కా సూర్యచంద్రరావు, డి పీ ఓ తూతిక శ్రీనివాస్ విశ్వనాధ్, గృహ నిర్మాణ శాఖ పీడీ కె వి ఎస్. రవికుమార్, ఇరిగేషన్, ట్రాన్స్కో, పంచాయతీ రాజ్ ఎస్. ఈ లు శ్రీనివాసరావు, సాల్మన్ రాజు, కేదారేశ్వరరావు, జిల్లా వ్యవసాయశాఖాధికారి వై. రామకృష్ణ, డ్వామా పీడీ రాము, డి ఈ ఓ శ్యాంసుందర్, పశుసంవర్ధక శాఖ జేడి నెహ్రూ బాబు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖధికారి డా. శర్మిష్ఠ, తహసీల్దార్ ఎల్లారావు, ప్రభృతులు పాల్గొన్నారు. అనంతరం క్రీడల్లో గెలుపొందిన విద్యార్థినీ, విద్యార్థులకు బహుమతులను కలెక్టర్ అందజేశారు.