ఆరేళ్ల బాబుకు మూత్రనాళంలో 9 సెం.మీ. రాయి!
1 min read* ఇంత పెద్ద రాయి ఉండటం రాయలసీమలో ఇదే తొలిసారి
* విజయవంతంగా శస్త్రచికిత్స చేసి తీసిన కర్నూలు కిమ్స్ వైద్యులు
* ఆరోగ్యశ్రీ పథకంలో పూర్తి ఉచితంగా చికిత్స
పల్లెవెలుగు వెబ్ కర్నూలు : సాధారణంగా చిన్న పిల్లలకు మూత్ర నాళాల్లో రాళ్లు ఏర్పడటమే అరుదు. అలాంటిది ఆరేళ్ల బాలుడికి ఏకంగా 9 సెంటీమీటర్ల రాయి ఏర్పడటం, అది మూత్రనాళాన్ని దాదాపు పూర్తిగా మూసేయడం లాంటి సమస్యలు వచ్చాయి. ఇందుకు సంబంధించిన వివరాలను కర్నూలు కిమ్స్ ఆస్పత్రికి చెందిన సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్టు, యూరాలజీ విభాగాధిపతి, ఆండ్రాలజిస్టు డాక్టర్ వై. మనోజ్ కుమార్ తెలిపారు. “కర్నూలు జిల్లాకు చెందిన ఈ బాలుడికి మూత్రంలో రక్తం రావడం, తీవ్రమైన జ్వరంతో బాధపడుతూ కర్నూలు కిమ్స్ ఆస్పత్రికి వచ్చాడు. ముందుగా అతడికి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేస్తే మూత్ర నాళంలో పెద్ద రాయి ఉన్నట్లు తెలిసింది. దాంతో సీటీ స్కాన్ చేసి చూడగా, ఈ రాయి వల్ల మూత్రపిండం వాపు కూడా వచ్చింది. దానికితోడు 9 సెంటీమీటర్ల పరిమాణంలో ఉన్న ఈ రాయి దాదాపుగా అతడి మూత్రనాళం మొత్తాన్ని మూసేసింది. ఇది చాలా సంక్లిష్టమైన కేసు. బాబు వయసు తక్కువ కావడం, దానికితోడు ఇన్ఫెక్షన్ ఉండటంతో ముందుగా ఒక స్టెంట్ అమర్చాం. రెండు వారాల తర్వాత ఇన్ఫెక్షన్ పూర్తిగా తగ్గడంతో అప్పుడు శస్త్రచికిత్స చేశాం. అత్యంత జాగ్రత్తగా ఒకే శస్త్రచికిత్సలో మొత్తం 9 సెంటీమీటర్ల రాయిని తొలగించాం. దాంతో ఇప్పుడు బాబుకు మళ్లీ మూత్రవిసర్జన సాధారణంగా జరుగుతోంది. రాయిని విశ్లేషణ కోసం పంపించాం. దాన్ని బట్టి ఇలాంటి రాళ్లు మళ్లీ ఏర్పడే అవకాశం ఉంటుందా లేదా అన్నది తెలుస్తుంది. అప్పుడు అవసరమైతే కొన్ని మందులు వాడాల్సి ఉంటుంది. రాయలసీమ ప్రాంతంలోనే ఇంత చిన్న వయసు పిల్లలకు ఇంత పెద్ద రాయి ఉండటం ఇదే మొదటిసారి. ఇంత సంక్లిష్టమైన శస్త్రచికిత్సను మొత్తం ఆరోగ్యశ్రీ పథకంలో పూర్తి ఉచితంగా చేశాం” అని డాక్టర్ మనోజ్ కుమార్ వివరించారు.