కుల,మతాలకతీతంగా ప్రజలకు సేవ చేస్తా: టి.జి భరత్
1 min readరోజా వీధిలో 47, 48, 49 వార్డుల ప్రజలతో క్యాండిల్ లైటింగ్ ఆరాధన కార్యక్రమం
- ఏసుక్రీస్తు పుట్టిన బెత్లెహేము వెళ్లడం తన అదృష్టమన్న టి.జి భరత్
కర్నూలు, పల్లెవెలుగు: కుల, మతాలకు అతీతంగా ప్రజలకు సేవ చేస్తానని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భరత్ అన్నారు. నగరంలోని రోజా వీధిలో 47, 48, 49 వార్డుల ప్రజలతో క్రిస్మస్ క్యాండిల్ లైటింగ్ ఆరాధన కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. ప్రజలందరి మధ్య కేక్ కట్ చేసి అనంతరం క్యాండిల్స్ వెలిగించి ముందస్తు క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఈ సందర్భంగా టి.జి భరత్ మాట్లాడుతూ ప్రపంచంలోని అన్ని దేశాల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతాయన్నారు. గతేడాది ఇక్కడే క్రిస్మస్ వేడుకలు నిర్వహించామని.. అప్పుడు కొన్ని కారణాల వల్ల స్థానిక నాయకుడు, తమ కుటుంబ సభ్యుడు దేవా తమ వర్గంలో లేరన్నారు. ఇప్పుడు దేవాతో కలిసి ప్రజలందరి మధ్య మరింత వైభవంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. తమ నుండి వెళ్లిపోయిన దేవా మళ్లీ మేమేంటో తెలుసుకొని స్వప్రయోజనాలు ఆశించకుండా మా దగ్గరకు తిరిగి వచ్చారన్నారు. ఇతరులకు, టి.జి కుటుంబానికి ఉన్న తేడా ఏంటో ఆయన తెలుసుకున్నారని చెప్పారు. ఇక ఏసు క్రీస్తు జన్మించిన బెత్లెహేము ప్రాంతాన్ని తాను దర్శించుకున్నానని.. ఇది తన అదృష్టంగా భావిస్తానన్నారు. ఏసు చెప్పిన మంచి వ్యాఖ్యాలను తన జీవితంలో పాటిస్తున్నట్లు భరత్ తెలిపారు. తాను ఏ దేవుడి దగ్గరకు వెళ్లినా తనతో పాటు ప్రజలందరూ బాగుండాలని కోరుకుంటానన్నారు. ప్రజలకు సేవ చేయడం తప్ప కుల, మత బేధాలు తమకు లేవన్నారు. వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న తమ కంపెనీలో సైతం అన్ని కులాలకు, మతాలకు సంబంధించిన వ్యక్తులు పని చేస్తున్నారన్నారు. అయితే కేవలం ఎన్నికల సమయంలో ప్రజలకు తమపై చెడు అభిప్రాయం కలిగించేందుకు మమ్మల్ని ఒకే మతానికి చెందిన వారిగా ప్రచారం చేస్తుంటారన్నారు. ప్రజలందరూ ఈ విషయం గమనించాలని, టి.జి కుటుంబం అంటే అన్ని కులాలను, మతాలను ఒకే విధంగా చూస్తుందని గుర్తించాలన్నారు. ఇక ఈ 4 సంవత్సరాల 9 నెలల కాలంలో పాలన ఎలా ఉందో అందరికీ తెలుసని, కర్నూలుతో పాటు రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోయిందన్నారు. అందుకే తనను దీవించి వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వాలని కోరారు. అప్పుడు తన పనితీరు ఎలా ఉంటుందో ప్రజలే చూస్తారన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కర్నూలుకు పరిశ్రమలు తీసుకువచ్చి ఇక్కడి యువతకు ఉద్యోగాలతో పాటు ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. ప్రజలందరి దీవెనలు తనపై ఉండాలని కోరుకుంటున్నట్లు భరత్ తెలిపారు. అనంతరం కార్యక్రమానికి తరలివచ్చిన 2 వేల మందికి భోజనాలు పెట్టారు. ఈ కార్యక్రమం సందర్భంగా ఏర్పాటుచేసిన చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు మన్సూర్ ఆలీఖాన్, దేవా, భాస్కర్, శ్యాం, విక్రమ్, సురేంద్ర, దీవన్న, మహిళా నాయకురాళ్లు, అనుబంధ సంఘాల నాయకులు, క్లస్టర్ ఇంచార్జీలు, బూత్ ఇంచార్జీలు, సీనియర్ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.