అంగన్వాడి ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి :ఏపీటీఎఫ్
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల: గత 18 రోజుల నుండి అంగన్వాడి ఉద్యోగులు సమ్మె చేస్తున్నారని వారి సమస్యలను ప్రభుత్వము తక్షణమే పరిష్కరించాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి నగిరి శ్రీనివాసులు, నంద్యాల జిల్లా కార్యదర్శి ఆవుల మునిస్వామి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో గడివేములలోని ఎమ్మార్వో కార్యాలయం దగ్గర సమ్మె చేస్తున్న అంగన్వాడి ఉద్యోగుల సమ్మెకు ఏపీటీఎఫ్ మద్దతు తెలపడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ నిత్యవసర ధరలు ఆకాశానికి పెరిగిన సందర్భంలో అంగన్వాడీలకు కనీస వేతనాలు చెల్లించాలని అలాగే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీలకు ఐదు లక్షల గ్రాట్యుటీ నీ అమలు చేయాలని, అంగన్వాడీలు సర్వీస్ లో ఉండి చనిపోతే కారుణ్య నియామకాల ప్రకారం వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. అంగన్వాడీలను మానసిక ఒత్తిడికి గురి చేసే అనేక రకాలైన యాప్ లను తగ్గించాలని, సర్వీస్ లో ఉండి అంగన్వాడీలు చనిపోతే కనీసం మట్టి ఖర్చులకు కూడా ఇవ్వడం లేదని 25 వేల రూపాయలను మట్టి ఖర్చులకు ఇవ్వాలని, ప్రభుత్వము అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కూడా అంగన్వాడీలకు అమలు చేయడం లేదని అలాగే దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న సెంటర్ అద్దెలు మరియు డిఏ బిల్లులు ఇతర బకాయిలను తక్షణమే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్ మండల శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎల్. బాలస్వామి, మానపాటి రవి మారెన్న, నాయక్, పాపన్న, ఏపీటీఎఫ్ 257 మండల శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రాజేష్, పుల్లయ్య, బి టి ఎఫ్ ఓబయ్య, అంగన్వాడి నాయకురాలు వసంతలక్ష్మి, రాములమ్మ, రామ చెన్నమ్మ, లలితమ్మ, లక్ష్మీదేవి, పుష్ప, రుక్మిణి తదితరులు పాల్గొన్నారు.