అంగన్వాడీల సమస్యలు పరిష్కారమయ్యే వరకు ఆందోళనలు
1 min readగుడ్లు, పాలు పంపిణీ సచివాలయాల సిబ్బందికి కేటాయిస్తే ఊరుకోం
తాసిల్దార్ ,ఎంపీడీవో కార్యాలయం ముందు ధర్నా…
బస్టాండ్ లో మానవహారం నిర్వహించిన అంగన్వాడీలు
పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: అంగన్ వాడి సమస్యలను పరిష్కరించే వరకు సమ్మె, ఆందోళన విరమించరని సిపిఎం, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వీర శేఖర్, మద్దిలేటి శెట్టి సిఐటియు మండల కార్యదర్శి అశోక్ స్పష్టం చేశారు. శుక్రవారం మండలంలోని అంగన్ వాడి కార్యకర్తలు, ఆయాలు ప్రధాన వీధుల గుండా ర్యాలీగా తరలివచ్చి మండల తాసిల్దార్ కార్యాలయం ముందు, ఎంపీడీవో కార్యాలయం దగ్గర అదేవిధంగా బస్టాండ్ సెంటర్లో మానవహారం నిర్వహించి తమ నిరసనను వ్యక్తం చేశారు . ఈ సందర్భంగా అంగన్వాడీ యూనియన్ నాయకురాలు జ్యోతి శ్రీదేవి ల అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ, అంగన్వాడీలకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, అంగన్వాడి కేంద్రాల కు నాణ్యమైన ఆహారాన్ని సరఫరా చేయాలని , ముఖ్యమంత్రి గారు వాగ్దానం చేసినట్లు తెలంగాణ కంటే ఎక్కువ వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు విధివిధానాలను అనుసరించి కనీస వేతనాలు అమలు చేయాలని కోరారు. అలాగే గౌరవ వేతనంతో ఉన్న మాకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు కావడం లేదని అన్నారు.ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి సంక్షేమ పథకాలు రద్దు చేసినా ఫర్వాలేదని, గౌరవ వేతనం ఇస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని వారు కోరారు. గత 25 రోజులుగా సమ్మె చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వము ఏమాత్రం స్పందించకపోవడం విచారకరమన్నారు. అంగన్వాడి సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోక మరోవైపు అంగన్వాడి కేంద్రాలను సచివాలయ సిబ్బందికి కేటాయించడం సరికాదన్నారు. బాలింతలకు, చిన్నారులకు అందాల్సిన పౌష్టికాహారం సచివాలయ సిబ్బందితో పంపిణీ చేస్తే ఊరుకోమని అంగన్వాడీ కార్యకర్తలు హెచ్చరించారు. అంగన్వాడి సమస్యలపై ప్రభుత్వ సానుకూలంగా స్పందించి వెంటనే కనీస వేతనం అమలు చేసే విధంగా చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు, ఈ సందర్భంగా ఎంపీడీవో డౌన్ డౌన్ అంటూ, ఏలాంటి రాతపూర్వక ఆదేశాలు లేకున్నా మౌఖిక ఆదేశాల పేరుతో సచివాలయ సిబ్బందిని తమపై రెచ్చగొట్టి ఘర్షణ వాతావరణం ఎంపీడీవో సృష్టిస్తున్నారని ఇది తగదని పేర్కొన్నారు. చట్టబద్ధంగా అధికారులు విధులు నిర్వహించాలి కానీ దౌర్జన్యం చేయడం సబబు కాదని ఈ సందర్భంగా ఎంపీడీవోకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు దాంతో ఎంపీడీవో వివరణ ఇస్తూ ప్రభుత్వ ఆదేశాలను మాత్రమే నేను అమలు చేస్తున్నానని ఎవరిని ఇబ్బంది పెట్టే కించపరిచే ఉద్దేశం తమకు లేదని పేర్కొన్నారు. అదే సందర్భంలో మాకు కూడా సహకరించాలని వారు కోరారు. మండల రెవెన్యూ అధికారులకు వినతి పత్రం అందజేసి, దేవనకొండ- పత్తికొండ రహదారిపై నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు యూసుఫ్ భాష, సూరి అంగన్వాడి యూనియన్ నాయకులు లతా, రసూల్ బి, మబున్ని, విజయలక్ష్మి ,రాజమ్మ, లక్ష్మీదేవి ,వెంకటలక్ష్మి ,ఎర్రమ్మ, విజయలక్ష్మి, వివిధ గ్రామాల అంగన్వాడి కార్యకర్తలు ఆయాలు పాల్గొన్నారు.