ఏపీజీబీ వార్షిక ఆదాయం.. రూ.286 కోట్లు
1 min read–బ్యాంకు చైర్మన్ రాకేష్ కశ్యప్
పల్లెవెలుగు వెబ్: ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు 2020–21 ఆర్థిక సంవత్సరానికి రూ.286.07 కోట్లు లాభం ఆర్జించినట్లు ఆ బ్యాంకు చైర్మన్ రాకేష్ కశ్యప్ తెలిపారు. కడప రీజనల్ కార్యాలయంలో ఆయన .. బ్యాంకు సాధించిన పురోగతిని వివరించారు. ఈ ఏడాది మార్చినాటికి రూ.36639 కోట్లు వ్యాపారస్థాయిని సాధించి..గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే దాదాపు రూ.5096 కోట్లు అదనపు వ్యాపారం గడించడంతో 16.16శాతం వృద్ధిరేటు నమోదు అయిందన్నారు. కరెంటు మరియు సేవింగ్స్ బ్యాంకు ఖాతా డిపాజిట్లు 19.19 శాతం వృద్ధి చెంది రూ.5193.64 కోట్ల నుంచి రూ.6227.86 కోట్లకు పెరిగిందని బ్యాంకు చైర్మన్ రాకేష్ కశ్యప్ వివరించారు.
కర్నూలు రీజనల్ పరిధిలో… రూ.4536 కోట్ల వ్యాపారం
కర్నూలు రీజనల్ కార్యాలయం పరిధిలో 4536 కోట్ల వ్యాపారం చేసినట్లు రీజనల్ మేనేజర్ పి. ఓబయ్య తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కర్నూలు ప్రాంతీయ కార్యాలయం పరిధిలో 71శాఖలు, 19 ఏటీఎంలు, 16 మంది ప్రతినిధి ఏజెంట్లు మరియు 164 మంది వ్యాపార ప్రతినిధుల ద్వారా రూ.4536 కోట్లు వ్యాపారం సాధించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాల నిర్ధేశిత లక్ష్యాలకు అనుగుణంగా.. జగనన్నతోడు పథకం ద్వారా 3984 మంది ఖాతాదారులకు 3.98 కోట్ల రుణాలు అందజేశామని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం పథకం ముద్ర ద్వారా విరివిగా రుణాలు అందజేశామని ఆర్ఎం పి. ఓబయ్య వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయం, అనుబంధ రంగాలలో రూ.570 కోట్లు రుణ వితరణ లక్ష్యంగా నిర్దేశించుకున్నామని , మహిళా పొదుపు గ్రూపు సభ్యులకు 472 కోట్లు రుణాలు లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. ఏపీజీబీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ ఇస్తున్నామని, ఖాతాదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆర్.ఎం. కోరారు.