ఏలూరు జిల్లా సమగ్రాభివృద్ధికై సిపిఎం ప్రదర్శన..
1 min readరెడ్ షర్ట్ వాలంటీర్ల కవాతు..
జిల్లా సమగ్రాభివృద్ధిపై పాలకులకు చిత్తశుద్ధి లేదు..
కార్పొరేట్ల కోసం భూ చట్టాల్లో మార్పులు.. భూములు కోల్పోతున్న రైతులు
పేదలకు భూములు పంచుకుండా అభివృద్ధి సాధ్యం కాదు..
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు :జిల్లా సమగ్రాభివృద్ధిపై పాలకులకు చిత్తశుద్ధి లేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు తీవ్రంగా విమర్శించారు. జిల్లాల విభజన అనంతరం ఏర్పడిన ఏలూరు జిల్లా మెట్ట, ఏజెన్సీ ప్రాంతాలతో రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల మాదిరిగా వెనుకబడిన జిల్లాగా అభివృద్ధికి దూరంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.ఏలూరులో నిర్వహిస్తున్న సిపిఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు సందర్భంగా మంగళవారం స్థానిక కాశీ విశ్వేశ్వర కళ్యాణ మండపంలో సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా సమగ్రాభివృద్ధిపై సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు సిపిఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి అధ్యక్షత వహించారు.ముఖ్యఅతిథిగా విచ్చేసిన వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ జిల్లాలో పేదలకు పంచేందుకు 16 రకాల ప్రభుత్వ భూములు 3 లక్షల ఎకరాలకు పైగా ఉన్నాయని చెప్పారు. జిల్లాలో 6 లక్షల మంది భూమి లేని వ్యవసాయ కార్మికులకు భూ పంపిణీ జరిగితేనే జిల్లాలో నిజమైన అభివృద్ధి జరుగుతుందని అన్నారు. ప్రభుత్వం భూ చట్టాల్లో మార్పులు తీసుకొచ్చి రైతుల భూములను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టేందుకు కుట్రలు చేస్తోందని విమర్శించారు. భూ యాజమాన్య హక్కు చట్టం వలన రైతులు నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. భూములు పై తమకు అన్ని హక్కు పత్రాలు ఉన్న వాటిని ప్రభుత్వానికి సమర్పించి ఈ చట్టం ద్వారా తమ హక్కును నిరూపించుకోవాల్సి వస్తుందని చెప్పారు. ఈ చట్టాల వలన రైతుల భూములు కోల్పోతారని అన్నారు. రైతుల భూములను కార్పొరేట్లకు కారు చౌకగా అప్పనంగా అప్పగించేందుకు ప్రభుత్వాలు ప్రయత్నాలు చేయడం అన్యాయమని విమర్శించారు. ప్రభుత్వాలు పేదలకు భూ పంపిణీ కోసం మాట్లాడడం లేదని తాత్కాలిక ఉపశమనంగా పథకాలు మాత్రమే ప్రకటిస్తున్నాయని చెప్పారు. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టు నిర్మాణం పట్ల ప్రభుత్వం, జిల్లా అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు పట్టించుకోకుండా గాలికి వదిలేసారని విమర్శించారు. మట్ట ప్రాంత భూములకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించే చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని ఎందుకు పూర్తి చేయలేదని ఆయన ప్రశ్నించారు. సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని అందుకు తగిన నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.
విద్య, వైద్య రంగాల పట్ల నిర్లక్ష్యం తగదు..
ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు (ఐ.వి)
కార్పొరేట్, ప్రైవేట్ హాస్పిటల్స్ లో అధిక ఫీజులు వసూలు చేయడం వలన పేదలు సరైన వైద్యం అందక చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ హాస్పిటల్స్ అభివృద్ధి చేసి పేదలకు వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు విద్యాసంస్థల్లో అధిక ఫీజులు వలన పేదల పిల్లలు చదువులకు దూరం అవుతున్నారని చెప్పారు. అన్ని గ్రామాలలో ప్రాథమిక పాఠశాలలో అన్ని మండల కేంద్రాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేయాలని కోరారు. జిల్లాలో రోడ్లు అద్వాన్నంగా ఉన్నాయని రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయాలి.
సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మంతెన సీతారాం జిల్లాలో ఆయిల్ పామ్, కొబ్బరి, కోకో, మామిడి, జీడి మామిడి,నిమ్మ, ఉద్యాన పంటలు విస్తీర్ణమే అధికంగా ఉందని చెప్పారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను ఏర్పాటుకు ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలన్నారు. తద్వారా రైతుల కనీస ధరలు, యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. అంగట్లో అన్ని ఉన్నా అల్లుడు నోట్లో శని అన్నట్లు సహజ వనరులు విస్తారంగా ఉన్న వాటిని వినియోగించి పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి కల్పించడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు జిల్లా అభివృద్ధికి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
జిల్లా సమగ్ర అభివృద్ధికై ఉద్యమం..
సిపిఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి
ఏలూరు జిల్లా సమగ్ర అభివృద్ధి పై మేధావులతో, నిపుణులతో చర్చలు జరిపి నివేదిక తయారు చేసి దాని ఆధారంగా ఉద్యమాలు సాగిస్తామని ఆయన చెప్పారు. కొల్లేరు కాంటూరు ఐదు నుండి మూడు కు కుదించాలని డిమాండ్ చేశారు. ఎకో సెన్సిటివ్ జోన్ ప్రతిపాదనను విరమించుకోవాలని కోరారు.
ఆకట్టుకున్న సిపిఎం రెడ్ షర్ట్ వాలంటీర్ల కవాతు
సదస్సుకు ముందు స్థానిక జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మెయిన్ గేట్ నుండి ఆర్ఆర్ పేట మీదుగా కాశీ విశ్వేశ్వర కళ్యాణ మండపం వరకు సిపిఎం నిర్వహించిన రెడ్ షర్ట్ వాలంటీర్లకు కవాతు, ప్రజా ప్రదర్శన ఆకట్టుకుంది. జిల్లా సమగ్ర అభివృద్ధి చర్యలు చేపట్టాలంటూ సిపిఎం కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కళాకారుల డప్పుల నృత్యం, పాటలు ఆకట్టుకున్నాయి. సదస్సు వేదిక పైకి వక్తలను, ఆహ్వానితులను సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కె.శ్రీనివాస్ ఆహ్వానించగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పి.కిషోర్ వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు తెల్లం రామకృష్ణ, జిల్లా కమిటీ సభ్యులు బి సోమయ్య, గుడిపాటి నరసింహారావు, పి. రామకృష్ణ,తామా ముత్యాలమ్మ, పి.మంగరాజు, ఎం. జివరత్నం,తెల్లం దుర్గారావు,వై.నాగేంద్రరావు తదితరులు పాల్గొన్నారు.