మగ్గం గుంతల్లో మగ్గిపోతున్న బతుకులు
1 min readపల్లెవెలుగు వెబ్: నూలు పోగులను అందమైన వస్త్ర రూపంగా తీర్చిదిద్దుతారు నేతన్నలు. సకల కళాకృతులను అందులో సృజనాత్మకంగా పొందుపరుస్తారు. శరీర స్వేదంతో నూలుపోగులకు రంగులద్దుతారు. తమ శ్రమ శక్తితో అద్భుతమైన కళాఖండాలను ఆవిష్కరిస్తారు. కానీ.. నేతన్నల జీవితాలు మాత్రం రంగు వెలిసిపోతున్నాయి. మగ్గం గుంతల్లోనే మగ్గిపోతున్నాయి. పాలకుల విధానాలు మగ్గానికి చెదలు పట్టేలా చేశాయి. నేతన్నల జీవితాల్లో చీకట్లను నింపాయి. పూట గడవడమే గగనంగా మార్చేశాయి.
పాలకుల నిర్లక్ష్యం:
పవర్ లూమ్స్ ప్రవేశం తర్వాత… పాలకవర్గాల నిర్లక్ష్యం కారణంగా నేతన్నలు మగ్గాన్ని వదిలేసే పరిస్థితి వచ్చింది. పవర్ లూమ్స్ వచ్చిన తర్వాత మగ్గం మీద నేసిన చీరలకు డిమాండ్ పూర్తిగా తగ్గిపోయింది. కిలో నూలు కొనాలంటే 4500 రూపాయలు వెచ్చించాల్సిన పరిస్థితి. అంత ఖర్చుతో చీర తయారీ చేసినా.. కొనే నాథుడు ఉండడు. ప్రభుత్వ సహకారంతో ఏర్పాటయిన ఆప్కో… చేనేతల ఉత్పత్తులు కొనాలని పాలకులు జారీ చేసిన జీవోలు అటకెక్కాయి.
మూతపడ్డ క్లస్టర్లు:
ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్లస్టర్లు మూతపడ్డాయి. చేనేత సహకార సొసైటీలు రాజకీయ నిరుద్యోగుల అవినీతి ఊబిలో కొట్టుమిట్టాడుతున్నాయి. పేరుకు మాత్రమే సొసైటీ ఉంటుంది. కానీ.. అక్కడ నేతన్నలు ఉండరు. ఇలా వందల కోట్లు చేనేత సహకార సంఘాల బడ్జెట్ రాబందుల చేతుల్లోకి వెళ్లిపోతోంది. దీంతో నేతన్న బతుకు దినదిన భారంగా మారింది. తాము ఇంత దుర్బర జీవితాలను అనుభవిస్తుంటే పాలకులు సహాయం చేయకుండా చూస్తు ఉండటం బాధాకరం అంటున్నారు. మగ్గం వదులుతున్న నేతన్నను ఆదుకుంటేనే ప్రభుత్వాలు చెప్పే మాటలకు అర్థం ఉంటుందని అంటున్నారు. పాలకులు మాటలు చెప్పడం మాని.. చేతల్లో చూపించాలని చేనేతలు కోరుకుంటున్నారు.