కర్నూల్లో బీసీల ఐక్యత చాటి చెప్పాలి.. టిడిపి ఇంచార్జి టి.జి భరత్
1 min readజయహో బీసీ కార్యక్రమంపై టి.జి భరత్ ఆధ్వర్యంలో మౌర్య ఇన్లో బీసీ నాయకుల ముఖ్య సమావేశం
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూల్లోని వాడవాడలో ఉన్న బీసీల్లో చైతన్యం తీసుకురావాలని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భరత్ అన్నారు. నగరంలోని మౌర్య ఇన్లో జయహో బీసీ కార్యక్రమంపై టి.జి భరత్ ఆధ్వర్యంలో కర్నూలు నియోజకవర్గ బీసీ నాయకుల ముఖ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జయహో బీసీ కార్యక్రమం కార్యచరణపై చర్చించారు. ఈ సందర్భంగా టి.జి భరత్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి బీసీలు వెన్నెముక అన్నారు. పార్టీ ఆవిర్భావం నుండి బీసీలకు తగిన గుర్తింపు ఉందన్నారు. టిడిపి హయాంలో బీసీలకు జరిగిన మేలుతో పాటు ప్రస్తుతం బీసీలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని సూచించారు. తమ ప్రభుత్వం ఉన్నప్పుడు బీసీలకు స్వయం ఉపాధి రుణాలు, చేతి వృత్తులకు ఆదరణ పథకం కింద రాయితీపై పరికరాలు అందిచినట్లు గుర్తు చేశారు. ప్రస్తుతం పేద ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. బీసీలు బలహీనులు కాదని, బలవంతులన్నదే తమ పార్టీ సిద్దాంతమని టి.జి భరత్ పేర్కొన్నారు. కర్నూల్లో ఉన్న బీసీలందరూ ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. కర్నూల్లో తన తండ్రి టి.జి వెంకటేష్ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఎంతో సేవ చేశారన్నారు. అర్హులకు సంక్షేమ పథకాలు అందించడంతో పాటు కర్నూలును ఎంతో అభివృద్ధి చేశారని తెలిపారు. ఆయన హయాంలో ప్రజల కోసం నగరంలో 24 కమ్యూనిటీ హాల్స్ కట్టించారన్నారు. అధికారంలో లేకపోయినా తమ టిజివి గ్రూప్స్ తరుపున తాము ప్రజలకు సేవ చేస్తున్న విషయాన్ని నాయకులందరూ ప్రజలకు వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి నాగశ్వర్ యాదవ్, నియోజకవర్గ పరిశీలకులు శ్రీనివాసమూర్తి, నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్, స్టేట్ బీసీ సెల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సంజీవలక్ష్మి, వీరశైవ సాధికార కమిటీ రాష్ట్ర కన్వీనర్ శివరాజ్, కార్పోరేటర్ పరమేష్, సీనియర్ బీసీ నాయకులు సత్రం రామకృష్ణుడు, తిరుపాల్ బాబు, దాశెట్టి శ్రీనివాసులు, రాంబాబు, రమణమూర్తి, సుభాష్ చంద్రబోస్, తదితరులు పాల్గొన్నారు.