గాయత్రి గోశాలలో సహస్ర గో ప్రదక్షిణ కార్యక్రమం
1 min readసహస్ర గో ప్రదక్షిణ కార్యక్రమాన్ని ప్రారంభించిన బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు
జీవితంలో మొదటిసారి వెయ్యి గోవులకు ప్రదక్షిణ చేసినట్లు వెల్లడించిన చాగంటి
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: దేశంలోనే మొదటిసారిగా కర్నూలు నగర శివారులోని డోన్ రోడ్డులో ఉన్న తమ గాయత్రి గోశాలలో సహస్ర గో ప్రదక్షిణ కార్యక్రమం ప్రారంభించినట్లు గాయత్రి గోసేవ సమితి నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని గురువారం బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రజా నాయకుడు టి.జి భరత్‌తో పాటు ఆయన తల్లి టి.జి రాజ్యలక్ష్మి పాల్గొన్నారు. తన జీవితంలో మొదటి సారి వెయ్యి గోవులకు ఒకేసారి ప్రదక్షిణ చేసినట్లు చాగంటి కోటేశ్వరరావు తెలిపారు. ఈ అవకాశం కల్పించిన టి.జి భరత్‌తో పాటు గాయత్రి గోశాల నిర్వాహకులను ఆయన అభినందించారు. ఇక గోసేవ చేయడం ఎంతో గొప్పదన్న ఆయన.. గోసేవ చేసే వారిపై దేవతలు అనుగ్రహం చూపుతారని చెప్పారు. వారంలో ఒకసారి ప్రతి ఒక్కరూ గోసేవలో పాల్గొనాలన్నారు. గోశాలకు వచ్చిన ప్రతి ఒక్కరూ తోచినంత సహాయం చేయాలని సూచించారు. ప్రజలందరికీ ప్రవచనాలు చెప్పే అవకాశం దేవుడు తనకు ఇవ్వడం సంతోషించే విషయమన్నారు. తన ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు ప్రవచన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు గోశాలలో గోప్రదక్షిణ కార్యక్రమం ప్రారంభమవ్వడం తన అదృష్టంగా భావిస్తానని టి.జి భరత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గోశాల నిర్వాహకులు, భారీ సంఖ్యలో భక్తులు, తదితరులు పాల్గొన్నారు.