కార్మికులకు అండగా టిజివి ట్రేడ్ యూనియన్ నిలబడింది..
1 min readకర్నూలు టిడిపి ఇంచార్జి టి.జి భరత్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కార్మికులకు అన్యాయం జరిగితే టిజివి ట్రేడ్ యూనియన్ చెక్ పోస్టులా ఉంటుందని ఇతర యూనియన్లన్నీ జాగ్రత్తగా ఉండే పరిస్థితి తీసుకొచ్చాం.. టి.జి భరత్ టిజివి ట్రేడ్ యూనియన్ అనుబంధ సంఘాల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న టి.జి భరత్ కార్మికులకు అన్యాయం జరిగితే టిజివి ట్రేడ్ యూనియన్ ఒక చెక్‌పోస్టులా ఉంటుందని ఇతర యూనియన్లు సైతం జాగ్రత్తగా ఉండే పరిస్థితిని తీసుకొచ్చామని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భరత్ అన్నారు. నగరంలోని సి.క్యాంపులోని టి.జి లక్ష్మీ వెంకటేష్ కమ్యూనిటీ హాల్‌లో టిజివి ట్రేడ్ యూనియన్ నగర కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన టిజివి ట్రేడ్ యూనియన్ అనుబంధ సంఘాల ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ పారిశ్రామికవేత్త కార్మికుల కోసం సొంతంగా ట్రేడ్ యూనియన్ ఏర్పాటుచేయలేదని చెప్పారు. కార్మికులకు అండగా ఉండి, వారి జీవితాలు బాగుండాలన్న మంచి ఉద్దేశంతో తన తండ్రి టి.జి వెంకటేష్ ఈ ట్రేడ్ యూనియన్ ఏర్పాటు చేశారని తెలిపారు. టిజివి ట్రేడ్ యూనియన్ స్థాపించినప్పటి నుండి నేటి వరకు కార్మికులకు ఎన్నో విధాలుగా అండగా ఉన్నట్లు తెలిపారు. ఇక తన తండ్రి ప్రజలకు ఎంతో సేవ చేశారని.. ఆయన అడుగుజాడల్లోనే తాను కూడా నడుస్తున్నట్లు చెప్పారు. ఎలాంటి స్వార్ధం లేకుండా ప్రజా సేవ కోసమే రాజకీయాల్లో పోటీ చేస్తున్న తనను వచ్చే ఎన్నికల్లో గెలిపించాలన్నారు. తాము ఒకరికి సహాయం చేయడమే తప్ప.. ప్రజల సొమ్ము ఆశించబోమన్న విషయం గుర్తించాలని ఆయన కోరారు. ట్రేడ్ యూనియన్ నాయకులు, సభ్యులందరూ ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని చెప్పారు. సొంతూరైన కర్నూలు ప్రజలు కష్టాలు పడకూడదని తామెప్పుడూ కోరుకుంటామన్నారు. తనను గెలిపిస్తే కర్నూల్లో ఉన్న ప్రతి ఒక్కరి భవిష్యత్తు బాగుండేలా చేస్తానని చెప్పారు. నగరంలోని చిల్డ్రన్స్ పార్కుతో పాటు, బిర్లాగేటు వద్ద చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని బ్రతికే వారిని అక్కడి నుంచి తొలగించి వారిని రోడ్డున పడేశారన్నారు. తాము అధికారంలో ఉండింటే ఇలాంటి పరిస్థితి రాకుండా మున్సిపాలిటీకి ఆదాయం తేవడంతో పాటు చిన్న వ్యాపారస్తులకు న్యాయం చేసేవాళ్లమన్నారు. ఇవన్నీ గమనించి వచ్చే ఎన్నికల్లో తనను గెలిపించేందుకు కష్టపడాలన్నారు. ఈ కార్యక్రమంలో టిజివి ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు బాలయ్య, గౌరవ అద్యక్షుడు శేషగిరిశెట్టి, చిన్న వ్యాపారస్తుల సంఘం నగర అధ్యక్షుడు జూటూరు రవి, అనుబంధ సంఘాల నాయకులు నరసింహులు, ఏసు, తిమ్మప్ప, రాఘవేంద్ర, సుదర్శన్, తదితరులు పాల్గొన్నారు.