PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

థైరాయిడ్ ఆడవారిలోనే అధికం…

1 min read

థైరాయిడ్ అవగాహన మాసం…డా. ఎం. వైభవ్

కన్సల్టెంట్ ఇంటర్నల్ మెడిసిన్కి మ్స్ సవీర, అనంతపురం.

పల్లెవెలుగు వెబ్ అనంతపురం: థైరాయిడ్ ఒక దీర్ఘ కాలిక సమస్య. భారత దేశంలో ప్రతి పది మందిలో ఒకరి కన్నా ఎక్కువ మంది థైరాయిడ్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు.ఈ సమస్య మగవారిలో కన్నా, ఆడవారిలో దాదాపు రెట్టింపు కనిపిస్తుంది. గొంతు ముందు భాగంలో ఉండే థైరాయిడ్ గ్రంథి నుంచి ఉత్పత్తి అయ్యే హార్మోన్ ప్రభావం శరీరంలోని దాదాపు ప్రతి అవయవం మీదా ఉంటుంది. ఈ హార్మోన్ ఉత్పత్తి తగ్గితే హైపో థైరాయిడ్ అని, అధికంగా అయితే హైపర్ థైరాయిడ్ అని అంటారు. హైపో థైరాయిడ్ సమస్య హైపర్ థైరాయిడ్ కన్నా అయిదు రెట్లు అధికంగా ఉంది.

పిల్లల్లో తెలివితేటలపై ప్రభావం

గర్భిణుల్లో ఈ సమస్యను ముందుగా గుర్తించకపోతే, పుట్టే పిల్లల్లో మేధాపరమైన లోపాలు ఉండవచ్చు. చిన్న తనంలోనే ఈ సమస్య గుర్తించడం మంచిది. లేదంటే, పిల్లల ఎదుగుదల శారీరకంగానే కాదు, మానసికంగానూ మందగించే ప్రమాదం ఉంది.కాబట్టి థైరాయిడ్ సమస్యను ఆలస్యం చేయకుండా గుర్తించి, దానికి సరైన చికిత్స పొందడం చాలా ముఖ్యం.థైరాయిడ్ రక్త పరీక్ష రిపోర్ట్ ఎన్నో విషయాల మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు, గత నెలలో కొన్ని రోజులు మందులు వేసుకోకపోయినా, ఈ మధ్య కాలంలో ఏమైనా ఇన్ఫెక్షన్ లేక జ్వరం వచ్చినా, ల్యాబ్ నమ్మకమయినది కాకపోయినా, ఆ రిపోర్ట్‌తో ఎలాంటి నిర్ధారణకు రాలేము.

లక్షణాలు ఇవీ..ముందుగా థైరాయిడ్ లక్షణాల గురించి తెలుసుకుందాం. ఆ తరవాత మందులు వాడుతున్నా, థైరాయిడ్ సాధారణానికి రాకపోవడనికి గల కారణాలు తెలుసుకుందాం.

హైపో థైరాయిడ్ లక్షణాలు: నీరసం, మలబద్ధకం, చర్మం, వెంట్రుకలు పొడిబారడం, ఎక్కువ నిద్ర, బరువు పెరగడం, నెలసరిలో రక్తస్రావం ఎక్కువగా లేక తక్కువగా అవ్వడం, గర్భస్రావం, చలిని తట్టుకోలేక పోవడం, గుండె తక్కువ సార్లు కొట్టుకోవడం, జుట్టు రాలడం, థైరాయిడ్ గ్రంథి వాపు (goitre) తదితర లక్షణాలు ఉంటాయి.

 హైపర్ థైరాయిడ్ లక్షణాలు: ఆకలి ఎక్కువ అవ్వడం, బరువు తగ్గడం, చెమటలు ఎక్కువ పట్టడం, చిరాకు, స్థిమితం లేకపోవడం, నిద్ర లేమి, నీరసం, ఎక్కువసార్లు విరేచనం అవ్వడం, నెలసరిలో రక్తస్రావం తక్కువగా అవ్వడం, వేడిని తట్టుకోలేక పోవడం, గొంతు ముందు వాపు, గుండె దడ అనిపించడం, కళ్ళు పెద్దవిగా అవ్వడం, చేతులు వణకడం వంటివి కనిపిస్తుంటాయి.

థైరాయిడ్ సమస్య మగవారిలో కన్నా, ఆడవారిలో దాదాపు రెట్టింపు కనిపిస్తుంది.

థైరాయిడ్ రిపోర్టులో కనిపించే T3, T4 స్థాయిలు అనేవి మన శరీరంలోని అవయవాల జీవక్రియలకు సంబంధించినవి. అయితే, T3, T4 తయారీకి TSH ( థైరాయిడ్ స్టిములేటింగ్ హార్మోన్) అనేది అవసరం.

ఎప్పుడైతే శరీరంలో T3, T4 తగ్గుతాయో, అప్పుడు వీటి ఉత్పత్తిని పెంచడానికి TSH ఎక్కువగా విడుదల అవుతుంది. అందుకే హైపో థైరాయిడ్‌లో, T3, T4 తక్కువగా, TSH ఎక్కువగా ఉంటుంది. హైపర్ థైరాయిడ్‌లో పరిస్థితి దీనికి భిన్నంగా ఉంటుంది. మందులు వాడుతున్నా, హైపో థైరాయిడ్ అదుపులో ఉండకపోవడానికి అనేక కారణాలు ఉండవచ్చు.

నిర్లక్ష్యం చేయకూడదు…

థైరాయిడ్ గ్రంథిలో వాపు ఉన్నప్పుడు, సంబంధిత రక్త పరీక్ష సాధారణంగా ఉన్నంత మాత్రాన ఎలాంటి సమస్య లేదు అని అనుకోవడానికి లేదు. రక్త పరీక్ష బాగుండి, గొంతు ముందు భాగంలో గడ్డ లాగా, లేక వాపు లాగా ఉంటే, నిర్లక్ష్యం చేయకూడదు. అది కొన్నిసార్లు థైరాయిడ్ క్యాన్సర్ లక్షణం అయివుండవచ్చు. కాబట్టి, వెంటనే గొంతు స్కాన్ చేయించడం, అవసరమైతే ఆ వాపు నుండి సూది ద్వారా ముక్క తీసి (FNAC) పరీక్ష చేయడం మంచిది.థైరాయిడ్ క్యాన్సర్ చాలా రకాలుగా ఉంటుంది. త్వరగా గుర్తించి చికిత్స అందిస్తే, పూర్తి సాధారణ జీవితం గడిపే అవకాశం ఉండవచ్చు. అదే ఆలస్యం జరిగితే పరిస్థితి చేయి జారే ప్రమాదం ఉంది. సమస్యను సరిగ్గా గుర్తించి, సరైన మందును, సరైన మోతాదులో వాడుతూ, ప్రతి ఆరు నెలలకు ఒక సారి పరీక్ష చేసుకుంటూ, వైద్యుల పర్యవేక్షణలో ఉండడం అనేది థైరాయిడ్ లాంటి దీర్ఘకాలిక జబ్బుల విషయంలో చాలా ముఖ్యం.

About Author