అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించే అర్హత జగన్ కు లేదు
1 min readటీడీపీ నాయకులు గంజాయి నాగముని
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: దళితులకు అన్యాయం చేస్తూ, దళితులపై దాడులు చేస్తూ, అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులకు గురి చేస్తున్న జగన్ మోహన్ రెడ్డికి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించే అర్హత లేదని మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలుగుదేశం పార్టీ నాయకులు జి.నాగముని అన్నారు.శుక్రవారంనందికొట్కూరు పట్టణంలో ఉమ్మడి కర్నూలు జిల్లా మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలుగుదేశం పార్టీ నాయకులు జి.నాగముని, మరియు నందికొట్కూరు నియోజకవర్గ టిడిపి నాయకుల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి, పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఉమ్మడి కర్నూలు జిల్లా మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలుగుదేశం పార్టీ నాయకులు జి.నాగముని మాట్లాడుతూ దళితుల ఓట్లతో గెలిచి గద్దెనెక్కాక, దళితులపైనే దాడులకు పాల్పడుతూ, అక్రమకేసులు బనాయించి ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. అంతే కాకుండా గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన అంబేద్కర్ విదేశీ విద్య పథకానికి, జగనన్న విదేశీ విద్యగా పేరు మార్చిన జగన్ మోహన్ రెడ్డికి ఆ మహనీయుని విగ్రహం ఆవిష్కరించే అర్హత ఎంతమాత్రం లేదని అన్నారు.అలాగే కోడి కత్తి కేసులో అరెస్ట్ అయిన అమాయకుడైన శ్రీనివాసులుకు ఇప్పటిదాకా బెయిల్ రాకపోవడం అనేది దళిత వ్యతిరేక ప్రభుత్వ పాలనకు అద్దం పడుతోందన్నారు. న్యాయం కోసం కోడికత్తి శ్రీనివాసులు జైలులో నిరాహార దీక్ష చేస్తుంటే, ఆయన ముసలి తల్లిదండ్రులు ఇంటి దగ్గర నిరాహార దీక్ష చేస్తున్నారన్నారు. ఒక ప్రజాప్రతినిధి హోదాలో ఉండి దళితుడి శవాన్ని డోర్ డెలివరీ చేసిన వ్యక్తికి బెయిల్ ఇవ్వడమే కాకుండా సకల మర్యాదలు అందించడం అనేది, కేవలం వైసిపి ప్రభుత్వానికే చెల్లుతుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బుల్లెద్దుల.రాజన్న, టిడిపి ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి నిమ్మకాయల.మోహన్, బోరెల్లి. శేషన్న, జూపాడుబంగ్లా నాయకులు సుబ్బన్న, సుంకన్న, జి.నాగన్న, షేక్.బాషా, అయ్యరాజు, అలీ భాష, రఫీ, దళిత సంఘాల నాయకులు, మైనార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.