ఘనంగా విప్లవ నిర్మాత కామ్రేడ్ లెనిన్ శత వర్ధంతి
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: SUCI(C) పార్టీ ఆధ్వర్యంలో ప్రపంచ కార్మిక వర్గ మహా నాయకులు, నవంబర్ సోషలిస్టు మహా విప్లవ నిర్మాత కామ్రేడ్ లెనిన్ శత వర్ధంతిని ఘనంగా పాటిస్తూ కర్నూలు పార్టీ ఆఫీసు లో లెనిన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా SUCI(C) పార్టీ జిల్లా ఇంచార్జీ వి. హరీష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ – 1917 నవంబర్ లో రష్యాలో మహోన్నత లెనిన్ నాయకత్వన సోషలిస్టు విప్లవం జరిగిందని, జార్ చక్రవర్తుల నిరంకుశ పాలన అంతమై సోషలిజం స్థాపితమైందని తెలిపారు. కార్మిక కర్షక శ్రమజీవుల రాజ్యం ఏర్పడిందని, ఆ దేశంలో దోపిడీ, పీడన, పేదరికం పూర్తిగా నిర్మూలన జరిగిందని గుర్తు చేశారు. రష్యాలోని సోషలిస్టు వ్యవస్థ గొప్పతనాన్ని చాటటానికి ఒక విద్యారంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులు చాలు అని, ఈ విధంగా రష్యా దేశం ఎంతో అభివృద్ధిని సాధించి, సూపర్ పవర్ గా ఎదిగిందని తెలిపారు. అయితే మన దేశంలో 76 ఏళ్లు పూర్తి అయినప్పటికీ నిరక్షరాస్యత, పేదరికాన్ని కూడా నిర్మూలించలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు… నేడు మనం దేశంలో ఉన్న పెట్టుబడిదారీ దోపిడీ పాలనకు వ్యతిరేకంగా మార్క్సిజం, లెనినిజం, కామ్రేడ్ శిబ్దాస్ ఘోష్ ఆలోచనలతో కార్మికులు, మహిళలు, విద్యార్థులు, యువకులు అందరూ ప్రజా ఉద్యమాల లోకి వచ్చి, సోషలిస్టు విప్లవం తీసుకొని వచ్చినప్పుడు మాత్రమే నేడు ఉన్న సమస్యలు పరిష్కరించబడుతాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో SUCI(C) పార్టీ సీనియర్ సభ్యులు ఎం. నాగన్న, ఎస్. ఖాదర్, బాబు, మల్లేష్, రోజా, శక్రప్ప, పవన్ తదితరులు పాల్గొన్నారు.