ఓపెన్ స్కూల్ విద్యార్థులు పోటీపడి చదవాలి
1 min read-జిల్లా ఉపాధి కల్పనాధికారిణి దీప్తి
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఓపెన్ స్కూలు విద్యార్థులు రెగ్యులర్ విద్యార్థులతో పోటీపడి చదవాలని జిల్లా ఉపాధి కల్పనాధికారిణి శ్రీమతి దీప్తి పిలుపునిచ్చారు. చదువుకు సంబంధించి ఓపెన్, రెగ్యులర్ అనే తేడాలు ప్రభుత్వం వద్ద లేవని, ఎక్కడైనా సబ్జెక్టులు ఒక్కటేనని ఆమె చెప్పారు. స్థానిక కొత్త బస్టాండు సమీపంలోని సీతారామ్ నర్సింగ్ కాలేజీలో మేఘన ఓపెన్ స్కూలు ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యార్థుల అవగాహన సదస్సులో ఆమె ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. ఓపెన్ స్కూలు విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. విద్యార్థులు తమ సర్టిఫికెట్లతో జిల్లా ఉపాధి కార్యాలయంలో తమ వివరాలు నమోదు చేసుకోవాలని ఆమె కోరారు. ప్రభుత్వ శాఖల్లో ఎక్కడెక్కడ ఉద్యోగావకాశాలు ఉన్నాయో తెలుసుకోవడానికి తమ వెబ్ సైట్ ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా పరీక్షల పరిశీలనాధికారి చంద్రభూషన్ రావు మాట్లాడుతూ ఓపెన్ స్కూలు విద్యార్థులు నిరక్ష్యం వీడి, పోరాట పటిమ ప్రదర్శించాలని కోరారు. ఓపెన్ స్కూలు విద్యార్థులకు అన్ని ప్రభుత్వ ఉద్యోగాలలో అవకాశాలు ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాళ్ళు విజయకుమార్, జీవనజ్యోతి, రహమాన్, బషీర్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.