వ్యాక్సిన్ తో పిల్లలు పుట్టరా ?.. కేంద్రం ఏం చెప్పింది
1 min readపల్లెవెలుగు వెబ్: వ్యాక్సిన్ వేసుకుంటే ఆడ, మగ వారిలో పిల్లలు పుట్టే అవకాశం తగ్గుతుందన్న వార్తలు అవాస్తవమని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. వ్యాక్సిన్ వేయించుకున్న వారిలో సంతాన సౌఫల్యతకు సంబంధించిన సమస్యలు వస్తాయనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది. కొందరు వైద్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ వర్కర్లు, నర్సుల్లో ఉన్న మూఢనమ్మకాలు, అపనమ్మకాలకు.. మీడియాలోని కొన్ని వర్గాలు విస్త్రత ప్రచారం కల్పిస్తున్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. గతంలో పోలియో , మీజిల్స్ -రూబిల్లా వ్యాక్సినేషన్ సమయంలో కూడ ఇలాంటి వదంతులు వ్యాపింపజేశారని చెప్పింది. వ్యాక్సిన్లను మొదట జంతువుల పై, ఆ తర్వాత మనుషుల పై పరిశోధనలు చేస్తారని, వ్యాక్సిన్ నుంచి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని తేలిన తర్వాతే వాటి వినియోగానికి అనుమతి ఇస్తారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.