వ్యాయామం లేక పెరుగుతున్న జబ్బులు..
1 min readకర్నూలు టిడిపి ఇంచార్జి టి.జి భరత్
నగరంలో ఉల్లాసంగా సాగిన 2కె రన్ మారథాన్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: శారీరక వ్యాయామం లేనందువల్ల రోజురోజుకూ ప్రజలు రోగాల బారిన పడుతున్నారని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భరత్ అన్నారు. కర్నూలు నగరంలో టిజివి అనంత సిటీ స్క్వేర్ మాల్, స్పార్టన్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన 2కె రన్‌లో ఆయన పాల్గొన్నారు. సిటీ స్క్వేర్ మాల్ నుండి అవుట్ డోర్ స్టేడియం చేరుకొని అటు నుండి మళ్లీ సిటీ స్క్వేర్ మాల్ వరకు ఈ 2కె రన్ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ బయటకు ఎంత ఫిట్‌గా కనిపించినా శరీరంలో ఏమైనా అనారోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంటుందన్నారు. ముఖ్యంగా కరోనా విజృంభించిన తర్వాత గుండె జబ్బులు పెరిగిపోయాయని చెప్పారు. యువకులు సైతం ఉన్నట్టుండి హార్ట్ఎటాక్‌తో చనిపోతున్న నేపథ్యంలో తమ గౌరీగోపాల్ హాస్పిటల్‌లో కర్నూలు ప్రజలకు ఉచిత గుండె వైద్య పరీక్షలు చేయిస్తున్నట్లు తెలిపారు. ఏడాదికి ఒకసారైనా ప్రతి ఒక్కరూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఇక ప్రజాస్వామ్య దేశంలో ఈ ఎన్నికల సంవత్సరం ఎంతో ముఖ్యమన్నారు. సరైన నాయకుడు, సరైన ప్రభుత్వాన్ని గెలిపించుకుంటే ప్రజలకు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. అనంతరం పాల్గొన్న వారికి ప్రశంసా పత్రాలు అందించారు. లక్కి డిప్ ద్వారా విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఐ శ్రీధర్, ప్రముఖ గుండె వైద్యులు లక్ష్మణ స్వామి, తదితరులు పాల్గొన్నారు.