అనంత రీహాబిలిటేషన్ సెంటర్‌ను ప్రారంభించిన చిన్న జీయర్ స్వామీజీ
1 min readకార్యక్రమానికి హాజరైన వైద్యరంగ ప్రముఖులు, దాతలు
75 పడకలతో కూడిన ఈ కేంద్రంలో సమగ్ర సేవలు
పల్లెవెలుగు వెబ్ హైదరాబాద్ : “మానవ సేవే సర్వప్రాణి సేవ” అని శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామీజీ అనుగ్రహ భాషణం చేశారు. బేగంపేటలోని అనంత రీహాబ్ ట్రాన్సిషనల్ కేర్ మరియు పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్‌ను ఆయన పవిత్ర హస్తాల మీదుగా సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన తన అనుగ్రహ భాషణం ఇస్తూ, “సాధారణంగా మానవసేవే మాధవ సేవ అంటారు. కానీ ఎవరూ ఈ గ్రహం మీద నివసిస్తున్న ఇతర ప్రాణుల గురించి ఎవరూ ఆలోచించరు. భగవంతుడు మనందరినీ సమానంగానే సృష్టించాడు. మనం గాలి, నీరు, మొక్కలు, జంతువులు, పురుగులు, ఇతర ప్రాణాల గురించి కూడా ఆలోచించాల్సిన సమయం ఇది. ఎందుకంటే, మనం వాటితో కలిసి శాంతియుతంగా జీవిస్తున్నాం. ముందుగా నేను వైద్య ప్రముఖులు, దాతలు కలిసి ఈ మిషన్‌ను సాకారం చేసినందుకు వారందరికీ ధన్యవాదాలు చెబుతున్నాను. మనుషులు మాత్రమే వైద్యుల వద్దకు, ఆస్పత్రులకు వెళ్తారు. కానీ జంతువులు తమకు అనారోగ్యం అనిపించినప్పుడు వాటికవే నయం చేసుకుంటాయి. ఒక కుక్క గానీ, పిల్లి గానీ ఆరోగ్యం బాగోకపోతే ఏమీ తినకుండా ఉపవాసం చేస్తాయి. పచ్చగడ్డి తిని, తర్వాత వాంతి చేసుకుంటాయి. ఇది ప్రకృతి సహజంగా అందించిన డీటాక్స్ ప్రక్రియ. మనుషులుగా మనం ప్రకృతిని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మనం ఎప్పుడూ ఒకేలా కాకుండా ఏదైనా విభిన్నంగా చేయాలి. మన పనిని నిరంతరం పరిశీలిస్తుండాలి, అప్డేట్ కావాలి. సమాజంలో అట్టడుగు వర్గాల కోసం తరచు వైద్యశిబిరాలు నిర్వహిస్తున్న వైద్యులు, దాతలకు నేను కృతజ్ఞతలు చెబుతున్నాను.మన సమాజంలో మహిళలు వైద్యశిబిరాలకు హాజరై, తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. తరచు వైద్య పరీక్షలు చేయించుకోవాలి. చాలామంది మహిళలు గర్భాశయ ముఖద్వార కేన్సర్ గురించి పట్టించుకోరు. అందుకే నేను వైద్యుల వద్దకు వెళ్లి పాప్‌స్మియర్ పరీక్షచేయించుకోవాలని గట్టిగా చెబుతుంటాను. రీహాబిలిటేషన్ కేంద్రాలు ఇప్పుడు చాలా అవసరం, హైదరాబాద్‌లో ఇవి క్రమంగా ప్రాచుర్యం పొందుతున్నాయి. ఇలాంటి రీహాబ్, నర్సింగ్ కేంద్రాలు విదేశాల్లో చాలా ఎక్కువ. నేను అన్నిరకాల వైద్యాలను గౌరవిస్తాను. కానీ వాటిలో చాలావరకు ప్రత్యామ్నాయ, సప్లిమెంటరీలు ఉంటాయి. మంచి ఆహారం, సరైన వ్యాయామం అనేవి తక్కువ ఖర్చుతో కూడుకున్నవి, చికిత్సకు కూడా మంచిది. అవయవ దానం చాలామంచి ఆలోచన. కానీ, అది మీ శరీరంలోకి మరో డూప్లికేట్‌ను పంపడమే అవుతుంది” అని స్వామీజీ తెలిపారు. అనంత సహ వ్యవస్థాపకుడు డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, “రీహాబ్ థెరపీ అనేది మన తర్వాతి స్థాయికి సమాధానం లాంటిది. మేం రోగులను నేరుగా చేర్చుకోం. కేవలం ఆస్పత్రి నుంచి రిఫర్ చేస్తేనే తీసుకుని, మళ్లీ తిరిగి పంపుతాం. మా ఆస్పత్రిలో నెగెటివ్, పాజిటివ్ ఫెసిలిటీలు, అత్యాధునిక హైపర్బారిక్ ఆక్సిజన్ ఛాంబర్ లాంటివి కూడా ఉన్నాయి. అనంతలో ఉన్న సమగ్ర సేవలలో రీహాబిలిటేషన, ట్రాన్సిషనల్ కేర్, నొప్పి నివారణ, పాలియేటివ్ కేర్ లాంటివి ఉన్నాయి. క్రిటికల్ కేర్ ఫిజిషియన్లు, జనరల్ ఫిజిషియన్లు రోజంతా అందుబాటులో ఉంటారు. పాజిటివ్, నెగెటివ్ ప్రెషర్ రూమ్స్‌లో ఇన్ఫెక్షన్లకు ప్రత్యేక చికిత్సలు చేస్తారు. కార్డియాలజి, రెస్పిరేటరీ, స్పోర్ట్స్ మెడిసిన్, న్యూరో సర్జరీ, ఆర్థోపెడిక్స్ లాంటి విభాగాల్లో ప్రత్యేక శిక్షణ పొందిన 10 మంది ఫిజియోథెరపిస్టులు కూడా ఇక్కడ ఉన్నారు. 75 గదులు, ప్రత్యేక నిపుణుల బృందంతో అనంత అనేది దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద రీహాబిలిటేషన్ కేంద్రాల్లో ఒకటి. తీవ్రమైన, దీర్ఘకాలిక సమస్యలన్నింటికీ చికిత్స చేస్తూ సమగ్ర సంరక్షణ అందించాలన్నదే మా లక్ష్యం’’ అని డాక్టర్ చంద్రశేఖర్ చెప్పారు. ఇక్కడ ఒక డైటీషియన్ ఆధ్వర్యంలో ప్రతి రోగికీ ప్రత్యేకంగా ఆహార ప్రణాళిక కూడా అందిస్తారు. అనంతలో రోగులకు అత్యుత్తమ సేవలు అందించేందుకు అత్యాధునిక మౌలిక వసతులు కల్పించాం. ఉత్తమ వైద్య సేవలు అందించేందుకు ఆయా రంగాలకు చెందిన అత్యుత్తమ వైద్యులు మా దగ్గర ఉన్నారు. 75 పడకలతో, వివిధ రంగాల్లో నిష్ణాతులైన వైద్యులు, సహాయక సిబ్బందితో సహా 125 మంది సిబ్బందితో కూడిన ఈ సదుపాయం ప్రస్తుతం వైద్య ఆరోగ్య రంగంలో ఉన్న అంతరాన్ని పూడ్చాలని లక్ష్యంగా పెట్టుకుంది’ అని అనంత రీహాబిలిటేషన్ సెంటర్ర ప్రమోటర్ డాక్టర్ ఎంఎస్ ఆనందరావు తెలిపారు. కిమ్స్ ఆస్పత్రి ఛైర్మన్ డాక్టర్ బొల్లినేని భాస్కరరావు మాట్లాడుతూ, “రీహాబ్ అనేది ఇప్పుడు క్రమంగా విస్తరిస్తోంది. హైదరాబాద్‌లో అన్నిరకాల అత్యాధునిక సదుపాయాలతో కూడిన అత్యుత్తమ కేంద్రం ఏర్పాటుచేసి అనంత చాలా మంచి పనిచేస్తోంది. ఇక్కడ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ మిషన్లు, సి ఆర్మ్, అల్ట్రా సౌండ్ లాంటివి ఉన్నాయి. ఇవన్నీ కలిసి దీర్ఘకాలంగా ఉండే వెన్ను నొప్పి, మోకాలినొప్పి, ముఖం నొప్పులను, కేన్సర్ వల్ల వచ్చే నొప్పులను నివారించగలవు. నొప్పి నివారణ విభాగం కూడా అంతర్జాతీయంగా క్వాలిఫై అయిన పెయిన్ ఫిజిషియన్ల ఆధ్వర్యంలో పనిచేస్తోంది” అన్నారు.సన్‌షైన్ ఆస్తప్రి ఎండీ డాక్టర్ గురవారెడ్డి బ్రోచర్ ఆవిష్కరించి మాట్లాడుతూ, “రీప్లేస్మెంట్, మెడికల్ థెరపీలకు హైదరాబాద్ పెట్టింది పేరు. ఓర్పు, ప్రేమ, సహనం లాంటివి ఉండటం వల్లే ఎక్కడెక్కడివారో హైదరాబాద్‌కు వైద్య చికిత్సల కోసం వస్తున్నారు” అని చెప్పారు. డాక్టర్ వేదప్రకాష్ మాట్లాడుతూ, “స్వామీజీ లాంటివాళ్లు మన జీవితాలను వైద్యచికిత్సలకు తోడు ఆధ్యాత్మిక చికిత్సలతో తేజోమయం చేస్తారు. ఆయన స్పర్శ్ అనే పాలియేటివ్ కేర్ సెంటర్‌ను ఉదాహరణగా తెలిపారు” అన్నారు. కార్యక్రమంలో ఎంపీ టీజీ వెంకటేష్, ఏఐజీ ఛైర్మన్ డాక్టర్ నాగేశ్వరరెడ్డి, మైహోం గ్రూప్ ఛైర్మన్ జూపల్లి రామేశ్వరరావు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.