పిఎంఇజిపి కింద పరిశ్రమల ఏర్పాటు…
1 min readపిఎంఇజిపి లబ్దిదారుల ధరఖాస్తుల్లో లోటుపాట్లు లేకుండా అవగాహన పరచండి..
ఔత్సాహిక పారిశ్రామికవేత్తల దరఖాస్తులను సింగిల్ విండో పధకంలో నిర్దేశిత సమయంలో ఆమోదించాలి..
8 వివిధ పరిశ్రమలకు రూ.55.40 లక్షల రాయితీ మంజూరు..
జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : పిఎంఇజిపి లబ్దిదారులు ఆయా పరిశ్రమల ఏర్పాటుకు చేసుకునే సమగ్ర ప్రాజెక్ట్ రిపోర్టు, ధరఖాస్తుల్లో లోటుపాట్లు లేకుండా అవగాహన పరచాలని జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ సంబంధిత అధికారులకు సూచించారు. స్ధానిక కలెక్టరేట్ గౌతమీ సమావేశ హాలులో మంగళవారం జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామికాభివృద్ధికి, నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి పధకాలు మంజూరుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నదని , అందుకు తగిన విధంగా అధికారులు, బ్యాంకర్లు చర్యలు తీసుకోవాలన్నారు. పిఎంఇజిపి కింద పరిశ్రమల ఏర్పాటుకు డిఐసి, కెవిఐసి, కెవిఐవి ద్వారా బ్యాంకులకు సమర్పించే ధరఖాస్తుల్లో మార్గదర్శకాలకు అనుగుణంగా సరైన రీతిలో చేసిన ధరఖాస్తులు, సరైన విధానంలో సమర్పించ్చని ధరఖాస్తులను, ఫీజిబిలిటి నివేదిక లల్లో కొన్నింటిని తన దృష్టికి తీసుకువస్తే వాటిలో కొన్నింటిని ఎంపికచేస్తామని వాటిని ఎంఎస్ఎంఇ శిక్షణా అవగాహన కార్యక్రమంలో లబ్దిదారులకు చూపించి వాటిలో వున్న వ్యత్సాలను చూపి వారికి అవగాహన పరచాలని పరిశ్రమల అధికారులను కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆదేశించారు. లబ్దిదారులకు సంబందించిన 511 దరఖాస్తులను రుణాలు అందించేందుకు బ్యాంకర్లకు పంపించగా, వాటిలో 210 దరఖాస్తులను వివిధ కారణాలతో బ్యాంకర్లు తిరస్కరించడం, మరో 189 దరఖాస్తులు పెండింగ్ లో ఉండడంపై కలెక్టర్ స్పందిస్తూ దరఖాస్తులో ఏమైనా లోటుపాట్లు ఉంటె వాటిని సరిదిద్దుకునేలా ధరఖాస్తుదారులకు అవగాహన చేయాలన్నారు. అదేవిదంగా సంబంధిత శాఖల అధికారులతో సమన్వయము చేసుకుని, లోటుపాట్లు సరిచేసి రుణాలు మంజూరు చేయాలనీ బ్యాంకర్లకు కలెక్టర్ సూచించారు. పరిశ్రమల ఏర్పాటుకు సింగిల్ విండో పధకం ద్వారా 297 దరఖాస్తులు అందగా , వాటిలో 283 దరఖాస్తులు వివిధ శాఖల ద్వారా ఆమోదించడం జరిగిందన్నారు. మిగిలిన దరఖాస్తులను కూడా నిర్దేశించిన సమయంలోగా ఆమోదించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పారిశ్రామిక అభివృద్ధి పాలసీ కింద జిల్లాలోని 8 మంది ఎం ఎస్ ఎం ఈ, వై.ఎస్.ఆర్. బడుగు వికాసం యూనిట్లకు 55.40 లక్షల రూపాయల వివిధ ప్రోత్సాహకాలను మంజూరు చేస్తూ సమావేశం తీర్మానించింది. ప్రతి గ్రామ పంచాయితీలో యువకేంద్రాల ఏర్పాటులో భాగంగా ఇంతవరకు జిల్లాలో 547 గ్రామ పంచాయితీల్లో 7 వేల 550 మంది యువతను గుర్తించడం జరిగిందన్నారు. వచ్చే సమావేశం నాటికి వీరందరి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని డిపివోను కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో 10 లేదా 10 కి మించి మహిళా కార్మికులు ఉన్న పరిశ్రమల్లో పిల్లలకు పాలిచ్చే ప్రత్యేక గదులు, చైల్డ్ కేర్ గదులను ఏర్పాటుచేసే చర్యలను కలెక్టర్ సమీక్షించారు. ఈ విధంగా 110 పరిశ్రమలను గుర్తించగా వాటిలో ఇంతవరకు 73 చోట్ల ప్రత్యేక గదులు ఏర్పాటు చేశారని మిగిలినవి వెంటనే ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని డిప్యూటి ఛీఫ్ ఇన్స్పేక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఆర్. త్రినాధరావు ను కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జిఎం ఆదిశేషు, ఎపిఐఐసి జెడ్ఎం బాబ్జి, డిపిఓ టి. శ్రీనివాస్ విశ్వనాథ్, ఉప రవాణా కమిషర్ శాంతి కుమారి, ఏలూరు నగరపాలక సంస్థ కమీషనర్ ఎస్. వెంకటకృష్ణ, డిప్యూటీ ఇన్స్పేక్టర్ ఆఫ్ ప్యాక్టరీస్ ఆర్. త్రినాధరావు, జిల్లా ఫైర్ ఆఫీసర్ సిహెచ్ రత్నబాబు, పరిశ్రమల అసోషియేషన్ ప్రతినిధి రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.