సొంత గూటికి బైరెడ్డి…?
1 min readఆసక్తిగా ఉమ్మడి కర్నూలు రాజకీయాలు..
ఉమ్మడి ఏపీ రాజకీయాలను శాసించి రాజకీయ చతురతను చాటుకున్న బైరెడ్డి.
మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి త్వరలోనే టీడీపీలో చేరనున్నారా.. ?
ఓపిగ్గా ఉండాలని కార్యకర్తలకు సూచన..
టీడీపీలో చేరికపై గందరగోళ పరిస్థితి..
అంతర్మథనంలో జిల్లా నేతలు..
టీడీపీ చేరదీయకుంటే బైరెడ్డి కార్యాచరణ ఏమిటి..
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: ఉమ్మడి ఏపీ రాజకీయాలను శాసించి రాజకీయ చతురతను చాటుకున్న మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి త్వరలోనే సొంతగూటికి చేరనున్నారా .. అదే నిజమైతే మళ్లీ రాజకీయ చదరంగం మొదలు కానుందా… బైరెడ్డిని గౌరు వెంకట రెడ్డి, మాండ్ర శివానంద రెడ్డి పార్టీలోకి ఆహ్వానిస్తారా.. ఒక వేళ బైరెడ్డి పార్టీలో చేరితే వీరి పరిస్థితేంటి..టీడీపీలో చేరాలని పార్టీ శ్రేణులు పట్టుబడుతున్నారా..బీజేపీని వీడి రాయలసీమ నినాదంతో మళ్లీ సొంత గూటికి చేరనున్నారా అంటే అవుననే సమాధానం వస్తోంది. ఉమ్మడి ఏపీ రాజకీయాలను ఒక ఊపు ఊపిన బైరెడ్డి మళ్లీ టీడీపీ ఆరంగేట్రంతో తన ఉనికిని చాటుకునేందుకు కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగానే కొన్ని నెలల క్రితం సిద్దేశ్వరం వద్ద చేపట్టిన ప్రజా ప్రదర్శనతో టీడీపీ అధినేత దృష్టిని ఆకర్షించేందుకు చేశారా అన్న సందేహాలు వ్యక్తమౌతున్నాయి. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అభివృద్ధి అంటే మళ్లీ చూపిస్తామని పరోక్షంగా చెప్పడం చూస్తుంటే బైరెడ్డి టీడీపీ గూటికి రానున్నట్లు తెలుస్తోంది.
ఏపీ రాజకీయాలను శాసించిన బైరెడ్డి..
ఉమ్మడి కర్నూలు జిల్లాలో బైరెడ్డి రాజశేఖర రెడ్డి పేరు చెప్పగానే ఉమ్మడి ఏపీలో తనదైన శైలిలో రాజకీయాలు శాసించిన వ్యక్తిగా అందరికీ సుపరిచితమే. అలాంటి రాజకీయ చతురత కలిగిన నేత కొంత కాలం పాటు రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.1994, 1999లో నందికొట్కూరు ఎమ్మెల్యేగా గెలిచి తన సత్తా ఏంటో రాష్ర్ట ప్రజలకు చూపించారు. ఈయన హవా చూసిన వారంతా బైరెడ్డికి ఎదురులేదని భావించారు. అదే క్రమంలో గౌరు వెంకట రెడ్డి కుటుంబీకులతో ఉన్న రాజకీయ వైరంతో గౌరును చెర్లపల్లి జైలుకు పంపారు. తర్వాత నియోజక వర్గంలో పాలనా పరంగా పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు రాష్ర్ట రాజకీయాలను శాసించారు. ఈయనకు ఎవరూ ఎదురులేరని, ఎలాగైన ఈయన ఈమెజ్ తగ్గించాలని భావించిన అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి నందికొట్కూరు నియోజక వర్గాన్ని ఎస్సీ రిజర్వుడుకు కేటాయించారు. అప్పటి నుంచి నేటి వరకు ఆ ప్రాంతంలో పోటీ చేసేందుకు ఎలాంటి అర్హత లేకపోవడంతో పాణ్యానికి మకాం మార్చారు. ప్రత్యేక తెలంగాణ ఊపందుకున్న నేపథ్యంలో బైరెడ్డి 2012లో టీడీపీని వీడి ప్రత్యేక రాయలసీమ పరిరక్షణ సమితిని స్థాపించారు. ఆ సమయంలో రాయలసీమ జిల్లాలను కలియ తిరిగి సీమ వాసులను ఏకతాటిపై తెచ్చేందుకు కృషి చేశారు. కానీ ఫలితం లేకుండా పోయింది. తర్వాత 2018లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాహుల్ గాంధీని కర్నూలు కు రప్పించి మరీ బహిరంగ సభ ఏర్పాటు చేయించి తన సత్తా ఏంటో జన సమీకరణతో చూపించారు. ఈ క్రమంలో ఇక్కడి రాజకీయాల గురించి తెలిసిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆధిపత్య పోరు లేకుండా ఉండేందుకు 2019 ఎన్నికలలో బైరెడ్డి, గౌరు వెంకట రెడ్డి, మాండ్ర శివానంద రెడ్డిను కలిపారు. ఆ సమయంలో బైరెడ్డి పాణ్యం టికెట్ ఆశించినా ఫలితం లేకుండా పోయింది. ఆ సీటును గౌరు చరితా రెడ్డికి అధిష్టానం కేటాయించింది. దీంతో అందరూ కలిసి కట్టుగా పని చేశారు . ఆ తర్వాత ఆయన తన కుమార్తె డాక్టర్ బైరెడ్డి శబరితో కలిసి బీజేపీలో చేరారు. ప్రస్తుతం బీజేపీ రాయలసీమ కన్వీనర్‌గా ఉన్నారు.
ఎంపీ..ఎమ్మెల్యే సీట్ల ప్రతిపాదనతో ముందుకు.?
బైరెడ్డి రాజశేఖర రెడ్డి తమకు టీడీపీలో రెండు సీట్లు కావాలనే ప్రతిపాదనతో పార్టీలో చేరుతున్నట్లు సమాచారం. అందులో తనకు నంద్యాల ఎంపీ సీటు, తన వారికి పాణ్యం ఎమ్మెల్యే సీటు ఆశించినట్లు తెలుస్తోంది. వీరి ప్రతిపాదన ఇలా ఉంటే టీడీపీ జిల్లా అధ్యక్షులు గౌరు వెంకట రెడ్డి, పార్లమెంట్ నియోజక వర్గ ఇంచార్జి మాండ్ర శివానంద రెడ్డిలు మాత్రం తమకు రాజ్యసభ, ఎమ్మెల్సీ సీట్లు కేటాయించి మిగతావి ఎవరికైనా ఇవ్వండని అధినేతకు సూచించినట్లు తెలుస్తోంది. అయితే ఇవి ఒట్టి పుకార్లు మాత్రమే అని టీడీపీ నేతలు, కార్యకర్తలు కొట్టిపారేస్తున్నారు.నంద్యాల ఎంపీ గా మాండ్ర శివానంద రెడ్డికి టికెట్ అని ఆయన అనుచరులు, అభిమానులు బల్ల గుద్ది చెపుతున్నారు. ఇలా రాజ్యసభ, ఎమ్మెల్సీ సీట్లను తమకు కేటాయించమని అడిగిన వీరు బైరెడ్డి రాజశేఖరరెడ్డిని పార్టీలో చేరేందుకు ఒప్పుకుంటారా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఒకవేళ చేరితే గౌరు దంపతులు, మాండ్ర శివానంద రెడ్డిలు బైరెడ్డికి సపోర్టు చేస్తారా లేదా అనేది సందేహంగా మారింది.
బైరెడ్డితో టీడీపీకి పూర్వ వైభవం వచ్చెనా..
గతంలో ఉమ్మడి ఏపీలో తన రాజకీయ చతురతను చాటుకున్న బైరెడ్డి రాజశేఖర రెడ్డి మళ్లీ టీడీపీ గూటికి రావాలని కార్యకర్తలు, పార్టీ శ్రేణులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈయన టీడీపీలో చేరితే ఆ పార్టీకి పూర్త వైభవం వస్తుందని కార్యకర్తలు, నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కొన్నిరోజులుగా బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ముఖ్య అనుచరులు ,కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణ గురుంచి చర్చలు జరిపారు. కార్యకర్తల అభిప్రాయం తెలుకున్నారు. కొద్ది రోజులు వేచిచూడాలని సూచినట్లు సమాచారం. ప్రస్తుతం వైసీపీ ఐదు ఏళ్ల కాలంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ప్రజల్లో వైసీపీ పాలనా తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే టీడీపీకి ఉమ్మడి కర్నూలు జిల్లాను లీడ్ చేసే పరిస్థితి లేకపోవడం 2019లో ఆశించిన ఫలితాలు లేవు. ఈ క్రమంలో బైరెడ్డి వస్తే పార్టీకి పూర్వ వైభవంతో పాటు అనేక మంది వైసీపీ నేతలు టీడీపీలో చేరే అవకాశాలున్నాయి. ఇప్పటికే సిద్దేశ్వరం జలాల కోసం రాయలసీమ స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ పేరుతో టీడీపీ అధినేతకు మరింత దగ్గరయ్యరని సమాచారం.టీడీపీ అధినేత కూడా ఉమ్మడి కర్నూలు జిల్లాకు మంచి లీడర్‌ను తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఏదేమైనా బైరెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకోవడం లాంఛనమే అనిపిస్తోంది. అందుకు ఛలో సిద్దేశ్వరం కార్యక్రమం కోసం గతంలో నందికొట్కూరు పట్టణ కేంద్రంలో ప్రజలు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశం నిదర్శనం. అందులో తమ ప్రభుత్వం (టీడీపీ) వస్తే నందికొట్కూరు నియోజక వర్గాన్ని కర్నూలులో కలిపి తీరుతానని చెప్పారు. అంటే ఆయన పరోక్షంగా టీడీపీలో చేరుతున్నట్లు కార్యకర్తలకు హింట్ ఇచ్చారు.