PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

 అప్రెంటిస్ విధాన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల : బుధవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో విద్యా రంగంలో అప్రెంటిస్ విధానం నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి నగిరి శ్రీనివాసులు, నంద్యాల జిల్లా కార్యదర్శి ఆవుల మునిస్వామి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం గడివేములలో జరిగిన ఏపీటీఎఫ్ సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలో 1994 డీఎస్సీ ద్వారా అప్రెంటిస్ విధానమును ప్రవేశపెట్టారని అయితే ఏపీటీఎఫ్ వ్యక్తిగతంగాను, ఉమ్మడిగాను ఉపాధ్యాయ సంఘాల సుదీర్ఘ పోరాటాల ద్వారా అప్రెంటిస్ విధానాన్ని 2012లో రద్దు చేయడం జరిగిందని వారు పేర్కొన్నారు.  1998 మరియు 2008 డీఎస్సీ ల ద్వారా మినిమం టైం స్కేల్ (ఎం టి ఎస్) ఉపాధ్యాయులకు రెగ్యులర్ ప్రాతిపదికన జీతాలు చెల్లించాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంటే మళ్లీ ఉపాధ్యాయ నియామకాలలో అప్రెంటిస్ విధానమును ప్రవేశపెడుతూ రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకోవడం దురదృష్టకరమని, ఉపాధ్యాయుల ప్రయోజనాలను కాపాడటానికి ఏపీటీఎఫ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నదని వారు తెలిపారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 50వేల  ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని పార్లమెంట్ లో ప్రకటించడం జరిగిందని అయితే రాష్ట్ర మంత్రి మండలి కేవలం 6,100 ఉపాధ్యాయ పోస్టులకు మాత్రమే డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయడానికి ఆమోదం తెలపడం దురదృష్టకరమని, కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం 50వేల  ఉపాధ్యాయ ఖాళీలను  రెగ్యులర్ ప్రాతిపదికన డీఎస్సీ ద్వారా భర్తీ చేయాలని వారు రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఏపీటీఎఫ్ సీనియర్ నాయకులు ఎస్. మహబూబ్ బాషా, నాగన్న, రాముడు, మండలశాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎల్. బాలస్వామి, మానపాటి రవి, జిల్లా నాయకులు ఎం. ప్రతాపరెడ్డి, చంద్రశేఖర ఆచారి, మల్లికార్జునయ్య, రాంపుల్లారెడ్డి, మారెన్న, నాగయ్య, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

About Author