కుంభాభిషేకం చేస్తామని.. అదరగొట్టారు.. ఊదరగొట్టారు.. చివరకు ఉసురుమనిపించారు
1 min readపల్లెవెలుగు వెబ్ మహానంది: శైవ క్షేత్రాల్లో ఒకటైన మహానంది క్షేత్రంలో కుంబాభిషేకం చేస్తామని… అదరగొట్టారు.. ఊదరగొట్టారు.. చివరకు ఊసురు అనిపించారు అని భక్తుల నుండి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహానంది క్షేత్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంతోపాటు ఆధ్యాత్మికత ,భక్తి భావన ఉట్టిపడేలా చర్యలు తీసుకుంటామని ప్రస్తుత పాలకమండలి ప్రమాణ స్వీకారోత్సవంలో ప్రకటించి భక్తుల మన్ననలు పొందాలని తహతలాడారు. ఇందులో భాగంగానే మహానంది క్షేత్ర ప్రధాన ఆలయ పై భాగాన దెబ్బతిన్నటువంటి కలశ స్థానంలో పీఠాధిపతుల చేత పునః ప్రాణ ప్రతిష్ట చేస్తామని పాలక మండలి ఏర్పడిన అనంతరం తీర్మానాలు కూడా చేశారు. దీంతోపాటు ఆలయం ముందు బాగానే ఉన్నా నంది సర్కిల్ యందు ఏర్పాటుచేసిన నంది విగ్రహానికి కూడా ప్రాణ ప్రతిష్ట చేస్తామని మీడియా ముందు ఎన్నోసార్లు పాలకమండలి మరియు ఆలయ అధికారులు ప్రకటించి భక్తులకు, స్థానికులకు ఆశలు కల్పించారు . ఇవన్నీ సక్రమంగా సాగాలని ఆశించి భక్తి భావనతో పీఠాధిపతుల అనుమతులు ఆశీస్సుల కోసం అనంతపురానికి విచ్చేసిన ఒక పీఠాధిపతిని పాలకమండలి మరియు క్షేత్ర అధికారి, వేద పండితులు మరియు క్షేత్రంలోని నిత్య అన్నదాన ప్రసాద కార్యక్రమానికి కూరగాయలు నిరంతరం వితరణ చేస్తున్న మార్కెట్ ప్రసాద్ తదితరులు 2023వ సంవత్సరం కలిశారు. మహానంది క్షేత్రంలోని ప్రధాన ఆలయంలో కలశం దెబ్బతిన్నదని దానిని మరల కుంభాభిషేకం, ప్రాణ ప్రతిష్ట నిర్వహించడానికి తమరు మహానంది క్షేత్రానికి రావాలని కుంభాభిషేకం మరియు ప్రాణ ప్రతిష్ట తదితర దైవ కార్యక్రమాలు నిర్వహించడానికి దైవాంశ సంభూతులైన తమరు ఒక తేదీని ప్రకటించి ఆ కార్యక్రమం సవ్యంగా జరిగేలా ఉండేందుకు గాను తమ ఆశీస్సుల కోసం వచ్చామని విన్నవించారు. అందుకు పీఠాధిపతి ఒక తేదీని ఖరారు చేసి తప్పక హాజరవుతామని తమకు మరో మారు సమాచారం ఇవ్వాలని సూచించినట్లు తెలిసింది. అంతా సౌవ్యంగా సాగిపోతుందన్న తరుణంలో పాలకమండలి మరియు అధికారులు మధ్య వర్గ విభేదాలు తలెత్తినట్లు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. దీనిపై ఒకటి రెండు సార్లు మీడియా ప్రశ్నించగా కలశ స్థాపనకు 50 నుండి 60 లక్షల రూపాయలు ఖర్చు అవుతాయని దాతలు ముందుకు రావడంలేదని దాతల కోసం వెతుకుతున్నామని త్వరలో కుంభాభిషేకం, ప్రాణ ప్రతిష్ట పూర్తి చేస్తామని ప్రకటించారు. పాలకమండలి పదవి నేటితో ముగియనుండడంతో పాటు ఆలయ అధికారి కూడా త్వరలో డిప్యూటేషన్ కాలం పూర్తయి మాతృ సంస్థకు బదిలీ కానున్నట్లు తెలుస్తుంది. 2019 సంవత్సరానికి ముందు అప్పట్లో రెవెన్యూ డిపార్ట్మెంట్ నుండి ఆర్డిఓ కేడర్లో డిప్యూటేషన్ పై మహానంది దేవస్థానం ఈవోగా పనిచేసిన శంకర వరప్రసాద్, అప్పటి చైర్మన్ కుంభాభిషేకం, కలశ ప్రాణ ప్రతిష్ట చేయడానికి ఏర్పాట్లు చేశారు. కలశాన్ని కూడా తయారు చేయించి మహానంది క్షేత్రానికి తీసుకొని వచ్చారు. కోవిడ్ మరియు అనివార్య కారణాలవల్ల వాయిదా పడింది. అనంతరం చోటు చేసుకున్న కొన్ని పరిణామాలతో పదవి బాధ్యతలు చేపట్టిన పాలకమండలి మరియు అధికారులు ఆర్భాటంగా ప్రకటించి అట్టకెక్కించడం వారి పనితీరుకు నిదర్శనమని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. కేవలం ఆలయ అధికారి నెత్తిపైనే దాతల భారం వేస్తున్నారు అనే ప్రచారం జరుగుతున్నట్లు తెలుస్తుంది. అప్పట్లో తయారు చేయించిన కలశానికి బంగారు తాపడం చేయడానికి కూడా అప్పట్లో ఒక దాత ముందుకు వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం కుంభాభిషేకానికి పీఠాధిపతుల అనుమతి ఉన్న దాతలు రాలేదని సాకు, మండలి మరియు అధికారుల మధ్య వర్గ విభేదాలు కారణమనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత ఏడాది వర్షాలు సరిగా కురువకపోవడంతో మహానంది క్షేత్రంలో సహస్త్ర ఘట్టాభిషేకం నిర్వహిస్తామని ప్రకటించిన ఈ కార్యక్రమానికి దాతలు ముందుకు రావడంలేదని చేతులు ఎత్తివేయడం వివాదాస్పదంగా మారినట్లు తెలుస్తుంది.