PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వ్యాయమంతో..గుండెపోటుకు చెక్..

1 min read

డయాబెటిస్​..కొలెస్ర్టాల్​ కంట్రోల్ లో ఉంచుకోవాలి

  • కర్నూలు హార్ట్​ అండ్​ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ఎండి, సీనియర్​  కార్డియాలజిస్ట్​ డా. చంద్రశేఖర్​
  • ఫాస్ట్​ఫుడ్​కు అలవాటు పడొద్దు…
  • రిటైర్డు కలెక్టర్ రాంశంకర్​ నాయక్​ ఐఏఎస్​

కర్నూలు, పల్లెవెలుగు: ఆధునిక జీవనశైలి…ఆహారపు అలవాట్లు… వ్యాయామం లేక మానసిక ఒత్తిడికి గురవుతున్న వారు గుండెపోటు ( హార్ట్​ ఎటాక్​) కు గురవుతున్నారని, కానీ గుండెకు అవసరమైన ఆక్సిజన్​, రక్త సరఫరా సక్రమంగా చేరితే… గుండెపోటు వచ్చే అవకాశం లేదన్నారు హార్ట్​ అండ్​ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ఎం.డి. ప్రముఖ సీనియర్​ కార్డియాలజిస్ట్​ డా. చంద్రశేఖర్​. నగరంలోని కర్నూలు హార్ట్​ ఫౌండేషన్​ ఛాంబరులో ఆదివారం విద్యార్థులకు ‘హార్ట్​ ఎటాక్​’ పై  ఆయన అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి రిటైర్డు కలెక్టర్​ రాంశంకర్​ నాయక్​ ఐఏఎస్​ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా డా. చంద్రశేఖర్​ మాట్లాడారు. గుండె మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవం. ఇది శరీరంలో ఛాతీ, ఊపిరితిత్తుల మధ్య ఉంటుంది. గుండె ఆక్సిజన్, పోషకాలని రక్తం ద్వారా శరీరంలోని అన్ని భాగాలకి సరఫరా చేస్తుంది. అయితే మారిన జీవనశైలి మరియు ఆహార అలవాట్ల వల్ల ప్రస్తుతం వయస్సు మరియు లింగ భేదంతో సంబంధం లేకుండా చాలా మందిలో గుండె సంబంధిత సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. ప్రతిరోజు వ్యాయామం చేస్తూ ఆరోగ్యంగా ఉన్న యువతలో కూడా అకస్మాత్తుగా గుండెపోటు రావడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్న విషయం.

గుండెపోటు రావడానికి గల కారణాలు:

అస్తవ్యస్తమైన జీవన విధానం మరియు ఆహారపు అలవాట్లు గుండెపోటుకు ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. వీటితో పాటు మధుమేహం, అధిక రక్తపోటు (BP), అధిక బరువు (ఒబెసిటీ)ను కలిగి ఉండడం , శారీరక శ్రమ, వ్యాయామం చేయకపోవడం, వృత్తిపరమైన మరియు వ్యక్తిగత ఒత్తిడి , ధూమపానం మరియు మద్యం సేవించడం, అధిక కొవ్వు పదార్థాలు మరియు మైదాతో చేసిన ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండె పోటు వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుంది.

హార్ట్​ ఎటాక్​ రాకుండా ఉండాలంటే… :

 మధుమేహం మరియు కొలెస్ట్రాల్‌ నియంత్రణలో పెట్టుకోవాలి (డయాబెటిస్‌ మరియు అధిక కొవ్వు గల వ్యక్తులకు గుండెపోటు మరియు స్ట్రోక్ వచ్చే ప్రమాదం 2-3 రెట్లు ఎక్కువ). ధూమపానం మానేయాలి (గుండెపోటుకు ప్రధాన కారణమైన ధూమపానం మానేస్తే బీపీ మరియు గుండె సంబంధ వ్యాధులు దరిచేరవు).  శారీరక శ్రమ మరియు వ్యాయామం తప్పనిసరి (రోజుకూ 30 నిమిషాలు లేదా వారంలో కనీసం 150 నిమిషాలు వ్యాయామం చేయడం వల్ల గుండె ఆరోగ్యం, పనితీరు పెరిగి గుండె ప్రమాదాల నుంచి రక్షణ పొందవచ్చు).

కొవ్వు…తగ్గాలి…!

 ప్రతి రోజూ ఆహారంలో వివిధ రకాల పండ్లు, కూరగాయలు నట్స్ మరియు డ్రై ఫ్రూట్స్, మొలకలు వంటి వాటిని తీసుకుంటూ ఉండాలి (ఇందులో కొవ్వు తక్కువగా మరియు విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి).  ఫాస్ట్ ఫుడ్స్, శీతల పానీయాలు తీసుకోరాదు.  వృత్తిపరమైన మరియు వ్యక్తిగత ఒత్తిళ్లు మరియు అధికంగా ఆలోచనలు చేయరాదు. రోజులో కనీసం 7-8 గంటల పాటు నిద్రించడం వల్ల గుండె పోటు వచ్చే ముప్పును తగ్గించుకోవచ్చని  కర్నూలు హార్ట్​ మరియు మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ఎండి, సీనియర్​ కార్డియాలజిస్ట్​ డా. చంద్రశేఖర్​ ఈ సందర్భంగా విద్యార్థులకు వెల్లడించారు.

లక్ష్యం వైపే.. అడుగులు వేయండి:రిటైర్డు కలెక్టర్​ రాంశంకర్​ నాయక్​

ప్రస్తుత సమాజంలో చాలా మంది ఫాస్ట్​ ఫుడ్​కు అలవాటు పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు రిటైర్డు కలెక్టర్​ రాంశంకర్​ నాయక్​ ఐఏఎస్​. ఆరోగ్యం బాగా లేకున్నప్పుడే వైద్యుల దగ్గరకు వెళ్తామని, కానీ అప్పుడప్పుడు హెల్త్​ చెకింగ్​ చేసుకోవడం మంచిదన్నారు.  వైద్యుల సలహాలు, సూచనలు పాటించాలని పేర్కొన్న రిటైర్డ కలెక్టర్​ రాంశంకర్​ నాయక్​… ప్రతిఒక్కరూ రోజు వ్యాయామం చేయాలన్నారు. మంచి క్రమ శిక్షణతో మెలగాలని, ఎప్పుడూ లక్ష్యం వైపు అడుగులు వేయాలన్నారు.  ఆరోగ్యం సరిగా ఉంటేనే.. ఏదైనా చేయగలమన్నారు.

రిటైర్డు కలెక్టర్​కు..ఘనసన్మానం

అవగాహన సదస్సు అనంతరం రిటైర్డు కలెక్టర్​ రాంశంకర్​ నాయక్​ ఐఏఎస్​ను కర్నూలు హార్ట్​ ఫౌండేషన్​ తరుపున హార్ట్​ ఫౌండేషన్​ ప్రధాన కార్యదర్శి, ప్రముఖ కార్డియాలజిస్ట్​ డా. చంద్రశేఖర్​ ఘనంగా సన్మానించారు.  పూలమాల వేసి, శాలువా కప్పి సత్కరించారు. కార్యక్రమంలో విద్యార్థులు, మేధావులు, వైద్యులు తదితరులు పాల్గొన్నారు.

About Author