యువతకు మంచి భవిష్యత్తు అందిస్తా.. కర్నూలు టిడిపి ఇంచార్జి టి.జి భరత్
1 min readనగరంలో విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం
రాష్ట్ర ప్రయోజనాల కోసం యువత ఆలోచించాల్సిన సమయం వచ్చిందన్న టి.జి భరత్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు యువత భవిష్యత్తును బాగుచేసేందుకు తాను కంకణం కట్టుకున్నానని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భరత్ అన్నారు. నగరంలోని సుంకేసుల రోడ్డులోని సెయింట్ జోసెఫ్ డిగ్రీ కళాశాలతో పాటు బిర్లా కాంపౌండ్‌లోని విజేత స్టడీ సెంటర్లో విద్యార్థులతో ఆయన ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తు ఉంటుందన్న విషయాలపై చర్చించారు. చంద్రబాబు దూరదృష్టితో తీసుకున్న నిర్ణయాల వల్ల ఇప్పుడు హైదరాబాద్ ముఖచిత్రం మారిపోయిందని టి.జి భరత్ చెప్పారు. రాష్ట్రంలో ఐ.టి కంపెనీలు లేనందు వల్ల చదువుకున్న యువత ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. చంద్రబాబు సీఎంగా ఉంటే ఆయన విజన్‌తో మన రాష్ట్రంలోనే ఐ.టి కంపెనీలు ఏర్పాటుచేసేలా అభివృద్ధి చేస్తారని తెలిపారు. ఐ.టి కంపెనీలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు మన రాష్ట్రంలో లేవన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక తగిన విధంగా ముందుకు వెళతామన్నారు. ఇక కర్నూల్లో పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉద్యోగాలు కల్పించే బాధ్యత తాను తీసుకుంటానని యువతకు టి.జి భరత్ హామీ ఇచ్చారు. మూడు రాజధానులన్నది అంత ఈజీ కాదని.. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన 6 నెలల నుండి సంవత్సరంలోపు కర్నూలుకు హైకోర్టు బెంచ్ తీసుకొస్తానన్నారు. రాజధాని ఒకే ప్రాంతంలో ఉన్నప్పటికీ అభివృద్ధి మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుందని తెలిపారు. ఓర్వకల్లులో ఉన్న ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో ఎన్నో కంపెనీలు రావాల్సి ఉన్నప్పటికీ ఈ ప్రభుత్వంలో ఒక్కటి కూడా రాలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక పేదలపై పన్నుల భారం పడకుండా చంద్రబాబు నాయుడు చూసుకుంటారన్నారు. ఇక లీడర్ సరైన వ్యక్తి అయితే లంచాలు లేని పాలన ఉంటుందన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ డబ్బుల కోసం రాజకీయాల్లోకి రాలేదని, ప్రజాసేవ కోసమే వచ్చారన్నారు. కర్నూల్లో తనను గెలిపిస్తే జిల్లా మొత్తం బాగుపడేలా చూసుకుంటానని హామీ ఇచ్చారు. విద్యార్థులు చదువుతో పాటు అన్నిరకాల నైపుణ్యాలపై పట్టు సాధించాలని సూచించారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖాలీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలిపారు. వెనుకబడిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే చంద్రబాబు నాయకత్వం రాష్ట్రానికి ఎంతో అవసరమని యువతకు టి.జి భరత్ వివరించారు. కర్నూలును నిజమైన స్మార్ట్ సిటీగా మారుస్తానని.. ప్రజలు అవకాశమిచ్చి చూడాలని కోరారు. తమ కంపెనీలో వేలాది మంది ఉద్యోగాలు చేస్తున్నారన్నారు. ప్రజలకు మినరల్ వాటర్ ఉచితంగా అందించి దేశంలోనే తాము గుర్తింపు పొందామన్నారు. స్వలాభం కోసం రాజకీయాల్లోకి వచ్చే వారు ఎప్పుడూ అభివృద్ధి గురించి ఆలోచించరన్నారు. టిడిపి, జనసేన ప్రభుత్వంలో వంద శాతం ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేత సోమిశెట్టి నవీన్, జనసేన ఇంచార్జి అర్షద్, పవన్, రబ్బాని, అనిత, శ్రీనివాస రెడ్డి, కాపు సంక్షేమ సేన జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్లు, విజయ్, మోహన్, తదితరులు పాల్గొన్నారు.