నిరుద్యోగ యువత కష్టాలకు టిడిపి గెలుపే పరిష్కారం..
1 min readకర్నూలు టిడిపి ఇంచార్జి టి.జి భరత్
అశోక స్టడీ సెంటర్లో నిరుద్యోగులతో ముఖాముఖి నిర్వహించిన టి.జి భరత్
డీఎస్సీ కోసం ఎదరుచూస్తున్న నిరుద్యోగులకు చంద్రబాబు న్యాయం చేస్తారన్న టి.జి భరత్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: నిరుద్యోగులకు ఈ ప్రభుత్వంలో కన్నీళ్లే మిగిలాయని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భరత్ అన్నారు. నగరంలోని బిర్లా కాంపౌండ్‌లో ఉన్న అశోక స్టడీ సెంటర్లో నిరుద్యోగులతో ఆయన ముఖాముఖి కార్యక్రమం నిర్వహించి మాట్లాడారు. తమ ప్రభుత్వ హయాంలో రెండు సార్లు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశామని తెలిపారు. ఈ ఐదేళ్లుగా నోటిఫికేషన్ కోసం యువతీ, యువకులు ఎదురుచూసినా ఫలితం దక్కలేదన్నారు. తమ ప్రభుత్వం రాగానే నిరుద్యోగులకు తప్పకుండా న్యాయం జరుగుతుందని భరత్ తెలిపారు. యువతీ, యువకులు కొందరు ముందుకొస్తే తానే స్వయంగా తీసుకొని వెళ్లి చంద్రబాబు, లోకేష్‌తో మాట్లాడిస్తానని చెప్పారు. తమ ప్రభుత్వం వస్తే 20 లక్షల ఉద్యోగాలు రాష్ట్రంలో వస్తాయన్నారు. ఇక కర్నూల్లో తనను గెలిపిస్తే పరిశ్రమలు తీసుకొచ్చి ఈ జిల్లాను మొత్తం అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. చంద్రబాబు కానీ, తాను కానీ డబ్బుల కోసం రాజకీయాల్లో ఉండటం లేదన్నారు. ప్రజలకు మేలు చేయడమే తమ లక్ష్యమన్నారు. ఈ విషయాలన్నీ యువత గ్రహించాల్సిన సమయం వచ్చిందన్నారు. ఈ ప్రభుత్వంలో ఇష్టానుసారంగా తీసుకున్న నిర్ణయాలను తామొచ్చిన తర్వాత శుద్ధిచేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టడీ సెంటర్ నిర్వాహకులు, తదితరులు పాల్గొన్నారు.