PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఓ పి యస్ విధానాన్ని పునరుద్ధరించాల్సిందే – యుటిఎఫ్

1 min read

పల్లెవెలుగు వెబ్ ప్యాపిలీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ,ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని వెంటనే పునరుద్ధరించాలని యుటిఎఫ్ జిల్లా సీనియర్ నాయకులు అబ్దుల్ లతీఫ్ డిమాండ్ చేశారు. పాత పెన్షన్ అనేది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే భిక్ష కాదని ఉద్యోగుల హక్కని పునరుద్ఘాటించారు.పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి ఆ తర్వాత దానిపైన అవగాహన లేక మాట ఇచ్చారని చెప్పడం హాస్యాస్పదం అన్నారు. మన పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రంలో మాట ఇచ్చిన ప్రకారంగా పాత పెన్షన్ విధానం అమలుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ రాష్ట్ర శాసనసభలో ప్రకటిస్తే ఇక్కడ ఉన్న ప్రభుత్వం మాత్రం అత్యంత దుర్మార్గమైన గ్యారంటీ పెన్షన్ స్కీమ్ తీసుకొని రావడం అంటే 3 లక్షల ఉద్యోగ,ఉపాధ్యాయుల గొంతు కోయడమే అని అన్నారు.పాత పెన్షన్ సాధన కోరుతూ గత నెలలో రాజమండ్రిలో నిర్వహించిన బహిరంగసభకు 7 వేల మంది యుటిఎఫ్ కార్యకర్తలు తరలివచ్చారని గుర్తు చేశారు.ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఉద్యోగ,ఉపాధ్యాయులకు మేలు కలిగించే పాత పెన్షన్ విధానాన్ని వెంటనే పునరుద్ధరించాలని కోరారు.పాత పెన్షన్ విధానం అమలు చేస్తామని తమ ఎన్నికల మేనిఫెస్టో లో చేర్చడమే కాక ఖచ్చితంగా పునరుద్ధరించే వారికే తమ ఓటు ఉంటుందని స్పష్టం చేశారు.పాత పెన్షన్ విధానం అమలు చేయాలని కోరుతూ రాష్ట్రంలోని నాలుగు ప్రధాన రాజకీయ పార్టీలకు పోస్టు కార్డులను పంపడం జరుగుతున్నదని తెలిపారు.మండలంలోని ఓబుళ దేవర పల్లి,వెంగళాం పల్లి పాఠశాలల ఉపాధ్యాయులు పోస్టు కార్డులు పంపారు.ఈ కార్యక్రమంలో షుకూర్,లక్ష్మీ ఈశ్వరమ్మ,కౌసర్,శేషన్న,విజయ్ కుమార్,శిరీష తదితరులు పాల్గొన్నారు.

About Author