చిట్టి గుండెను.. కాపాడుకుందాం..
1 min readజన్యులోపాలతో …గుండె సమస్యలు..
- పోషకాల లోపం…మేనరికంతో…కొన్ని సమస్యలు..
- అవగాహనతో… గుండె సమస్యలకు చెక్..
- ఫిబ్రవరి 7 నుంచి 14వ తేదీ వరకు పుట్టుకతో వచ్చే గుండె లోపాల వారోత్సవం..
ప్రస్తుత సమాజంలో పోషకాహారం కంటే…. ఫాస్ట్, జంకు ఫుడ్‌కు అలవాటు పడి ..తమతోపాటు పుట్టబోయే పిల్లలకు కూడా అనేక సమస్యలు ( వ్యాధులు) కొని తెచ్చుకుంటున్నారు. ఆహారపు అలవాట్లు… చేయాల్సిన పనులపై ఏ మాత్రం అవగాహన లేకపోవడంతో… ఇటువంటి సమస్యలకు గురవుతున్నారని వైద్యనిపుణులు పేర్కొంటున్నారు. ఈ సందర్భంగా గర్భిణీ తీసుకోవాల్సిన ఆహారం, జాగ్రత్తలపై పూర్తి అవగాహన ఉంటే…. పుట్టబోయ చిన్నారులు ఆరోగ్యంగా పుడతారని వెల్లడిస్తున్నారు.
కర్నూలు, పల్లెవెలుగు:ఇటీవల కాలంలో ఎక్కువగా పుట్టుకతో పిల్లలకు అనేక రకాలైన సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా గుండె సమస్యలతో చిన్నారుల అనేక ఇబ్బందులకు గురువుతున్నారు. ప్రతి 1000 మందిలో 8 నుండి 10 మంది చిన్నారులు గుండె సంబంధిత సమస్యలతో జన్మిస్తున్నారు. భారతదేశంలో ప్రతి ఏటా దాదాపు 2.4 లక్షల మంది చిన్నారులు పుట్టకతో వచ్చే గుండె సమస్యలతో జన్మిస్తున్నారు. 85శాతం వరకు కారణాలు తెలియదు. కానీ వంశపారంపర్యంగా 10 నుండి 15శాతం మాత్రమే ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి. అంటే, వీళ్లను కాపాడుకోవాలంటే.. కచ్చితంగా మొదటి సంవత్సరంలో చికిత్స చేయవలసి ఉంటుంది.
గుండె నిర్మాణం… సంక్లిష్టం… :
అతి సున్నితమైన గుండె నిర్మాణం ఎంతో సంక్లిష్టమైంది. పిండంలో 21వ రోజుకే గుండె కొట్టుకోవటం, రక్త ప్రసరణ మొదలవుతాయి. గుండె గదులు 4 వారాల కల్లా ఏర్పడతాయి. 12 వారాలకు గుండె పూర్తిగా అభివృద్ధి చెందుతుంది. ఈ స్టేజ్‌లో ఎక్కడ పొరపాట్లు జరిగినా లోపాలకు దారితీస్తాయి. వీటిల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సినవి.. గుండెలో రంధ్రాలు (సెప్టల్ డిఫెక్ట్స్) గదుల లోపాలు రక్తనాళ సమస్యలు వాల్వ్ సమస్యలు.
ఆయాసం…న్యుమోనియా… ఉంటే… :
గుండెలో రంధ్రాలు ఏర్పడిన పిల్లల్లో ఆయాసం, తరచూ న్యుమోనియా బారినపడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. పిల్లలు పాలు కూడా సరిగ్గా తాగలేరు. గుండె గదుల మధ్య రంధ్రాలు ఉన్నప్పుడు చెడు రక్తంతో మంచి రక్తం కలిసిపోతూ ఉంటుంది. దీంతో ఊపిరితిత్తులకు మరింత ఎక్కువగా రక్తం చేరుకుంటుంది. ఫలితంగా ఊపిరితిత్తులు తడితడిగా అయిపోతాయి. చెడు రక్తం, మంచి రక్తం కలిసిపోయి, ఒళ్లంతా విస్తరించటం వల్ల పెదాలు, వేళ్లు, గోర్లు, నాలుక వంటిని నీలంగా అవుతాయి. కవాటాలు బిగుసుకుపోవటం, లీక్ అయ్యేవారిలో అలసట, నిస్సత్తువ ఎక్కువగా ఉంటుంది. యాక్టివ్‌గా ఉండరు. ఆడుకోవడానికి అంతగా ఇట్రస్ట్ చూపరు. నిద్రలేమి సమస్యతోనూ బాధపడుతుంటారు. శ్వాస సరిగ్గా తీసుకోలేరు.
పుట్టిన తర్వాత ఈ టెస్ట్ చేయాలి:
పసిపిల్లలు చురుకుగా లేకపోయినా, గోర్లు , నాలుక నీలంగా ఉంటే, పాలు సరిగ్గా తాగకపోయినా, శ్వాస వేగంగా తీసుకుంటుంటే.. ఇవి పుట్టుకతో వచ్చే గుండె లోపాలకు సంకేతాలు. ఈ లక్షణాలు కనిపిస్తే.. ఎకో కార్డియోగ్రామ్ తప్పనిసరిగా చేయించాలని సూచించారు. విదేశాలలో పిల్లలు పుట్టిన తర్వాత.. ఆక్సిజన్ సంతృప్త స్థాయిలను పల్స్ ఆక్సిమీటర్‌తో పరీక్షిస్తారని.. గుండె లోపాలు ఉంటే ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉంటుంది. మన దేశంలోనూ ఈ పద్ధతిని అమలు చేయాల్సిన అవసరం ఉంది.
జున్యుపరమైన కారణాలు:
జన్యుపరమైన కారణాల వల్ల పుట్టుకతో గుండె లోపాలు రావచ్చు. కొందరికి జన్యు లోపాల వల్ల గుండె నిర్మాణ ప్రక్రియ అస్తవ్యస్తం కావొచ్చు. బిడ్డ కడుపులో ఉన్నప్పుడు.. డౌన్ సిండ్రోమ్ జెనిటిక్ టెస్టింగ్ ద్వారా వీటని గుర్తించవచ్చు.
జర్మన్ మీజిల్స్ (రుబెల్లా) :
గర్భధారణ సమయంలో తల్లికి రుబెల్లా ఎఫెక్ట్ అయితే.. కడుపులోని శిశువు గుండె అభివృద్ధిపై ప్రభావం పడుతుంది. తొలి మూడు నెలల్లో.. ముఖ్యంగా పిండంలో గుండె ఏర్పడే దశలో రుబెల్లా వంటి వైరల్ ఇన్‌ఫెక్షన్లు గురైతే గుండె లోపాలకు కారణం అవుతుంది.
డయాబెటిస్ (చక్కెర వ్యాధి) :
తల్లికి టైప్ 1, టైప్ 2 డయాబెటిస్ ఉంటే.. శిశువు గుండె అభివృద్ధి చెందే విధానంపై ప్రభావం పడుతుంది. గర్భధారణ సమయంలో డయాబెటిస్ కారణంగానూ గుండెలోపాలు వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. కొన్ని మెడిసిన్స్ కారణంగా.. గర్భవతిగా ఉన్నప్పుడు కొన్ని మందులు తీసుకోవడం వల్ల పుట్టుకతో వచ్చే గుండె జబ్బులు, ఇతర పుట్టుకతో వచ్చే లోపాలు ఏర్పడవచ్చు. బైపోలార్ డిజార్డర్‌కు వాడై.. లిథియం, మోటిమలు చికిత్సకు ఉపయోగించే ఐసోట్రిటినోయిన్ (క్లారవిస్, మైయోరిసన్, ఇతరులు) వంటి మెడిసిన్స్ వల్ల పసి పిల్లల్లో గుండె లోపాలు వచ్చే ప్రమాదం ఉంది.
పోషక లోపం:
గుండె లోపాల విషయంలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది దీని గురించే. గర్భం ధరించిన తొలినాళ్లలో పోషకాల లోపం.. ముఖ్యంగా ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి12 లోపం గర్భస్థ శిశువులో గుండె లోపాలకు దారితీయొచ్చు.
మేనరిక వివాహాలు:
మేనరిక పెళ్లి చేసుకున్నవారికి పుట్టబోయే పిల్లల్లో జన్యుపరమైన కారణాలతోనూ గుండె లోపాలు వచ్చే ప్రమాదం ఉంది. మేనరిక వివాహాలు చేసుకున్నవారికి పుట్టబోయే పిల్లల్లో ప్రతి వెయ్యిమందిలో 40-50 మందికి గుండె లోపాలు ఉండే అవకాశముంది.
పోషకాహారం లోపంతో…చిన్నారులకు సమస్యలు..
డా.భువనేశ్వరి, ఎండి, పీడియాట్రిక్స్
జి.వి.ఆర్. చిల్ర్డన్ హాస్పిటల్, కర్నూలు
గర్బిణీగా ఉన్నప్పుడే సదరు మహిళ పోషకాహారం తీసుకోవాలి. జన్యుపరంగా ఉంటే కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయి. కానీ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. పుట్టబోయే పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే… గర్భిణీ సమయంలో తీసుకోవాల్సిన ఆహారం, చేయాల్సిన పనులపై అవగాహన ఉండాలి. గ్రామీణ మహిళలు అవగాహన లేక తమతోపాటు పిల్లలకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. పుట్టుకతో వచ్చే ఆరోగ్య సమస్యలను మందులు, శస్ర్తచికిత్స ద్వారా నయం చేసే అవకాశం ఉంది. గుండె లోపాలు ఉన్న వ్యక్తులందరూ వారి జీవితాంతం కార్డియాలజిస్ట్‌ను అనుసరించాలి.