వ్యవసాయ శాఖలో వింత పోకడలు
1 min readనామమాత్రంగా వ్యవసాయ మండల సమావేశం
సభ్యులు లేకుండా సలహా మండలి సమావేశాలు
సమావేశ మందిరంగా ఎంపీపీ చాంబర్
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : వ్యవసాయ కేంద్రాలలో వ్యవసాయ అధికారులు నామమాత్రంగా సమావేశాలు నిర్వహిస్తూ సభ్యులు లేకుండానే, ఒకే చోటనే సంవత్సరాలకు తరబడి సమావేశాలు ఏర్పాటు చేస్తూ వ్యవసాయ కేంద్రాలను నిర్వీర్యం చేస్తున్నారు. మండలంలో తొమ్మిది సచివాలయాలు ఉన్నాయని ఒక్కో నెలలో ఓ గ్రామపంచాయతీ సచివాలయంలో సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ గ్రామ రైతులకు వ్యవసాయ పద్ధతులను వివరిస్తే బాగుంటుందని చాలామంది రైతులు కోరుతున్నప్పటికీ వ్యవసాయ అధికారులు మాత్రం మండల హెడ్ క్వార్టర్ లో వారికి అందుబాటులో ఉన్న వ్యవసాయ కేంద్రం లో మాత్రమే సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతు భరోసా కేంద్రాలు నిర్మించినప్పటికీ మండలంలో నిరుపయోగంగా తయారయ్యాయి. రైతు శ్రేయస్య ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోట్లాది రూపాయలు ఖర్చు చేసే రైతు భరోసా కేంద్రాలు నిర్మించడం జరిగింది. అయితే స్థానిక వ్యవసాయ అధికారులు ముఖ్యమంత్రి ఆశయాలకు తూట్లు పొడుస్తూ రైతు భరోసా కేంద్రాలను నిరుపయోగం చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రతినెల గ్రామస్థాయిలో, మండల స్థాయిలో వ్యవసాయ సలహా మండలి సమావేశాలను నిర్వహించాల్సి ఉండగా అవేవీ మాకు పట్టవు అన్నట్లుగా శుక్రవారం మండల పరిషత్ అధ్యక్షులు చాంబర్లో సభాధ్యక్షులు లేకుండా సభ్యులకు సమాచారం ఇవ్వకుండా ఫోటోల కోసం వ్యవసాయ సలహా మండలి సమావేశం అని తెలుపుతూ ఓ బ్యానర్ కట్టి సమావేశాన్ని మమ అనిపించిన ఘనత స్థానిక వ్యవసాయ అధికారులకే దక్కింది. వ్యవసాయ సలహా మండలి సమావేశానికి రైతులకు మండలి సభ్యులకు సమాచారం ఇచ్చి వారికి అధికారులు సూచనలు ఇవ్వడంతో పాటు రైతుల నుండి సభ్యుల నుండి మరి కొన్ని సలహాలు తీసుకోవడం ఈ సమావేశ ఉద్దేశం. సభ్యులు లేకుండా, సభా అధ్యక్షులు లేకుండా సలహా మండల సమావేశం నిర్వహించడంపై సర్వత్రా చర్చ సాగుతోంది. గతంలో గ్రామాలలో, వ్యవసాయ అధికారులు సమావేశాలు నిర్వహించే వారని ప్రస్తుత అధికారులు ఫోటో కోసమే అన్నట్లుగా సాగిస్తున్నారని విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఇలాంటి తరుణంలో రైతులు వ్యవసాయం ముగ్గు చూపాలంటేనే భయపడే పరిస్థితి మండలంలో తయారయింది. జిల్లా అధికారులు స్పందించి ఆయా గ్రామాలలోని రైతు భరోసా కేంద్రాలలో వ్యవసాయ సలహా మండలి సమావేశాలు నిర్వహించి మంచి సూచనలు సలహాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుకుంటున్నారు.