PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చదువుల రామయ్య సర్కిల్ గా నామకరణం చేయాలి

1 min read

గుత్తి టర్నింగ్ సర్కిల్ ను స్వర్గీయ కామ్రేడ్ చదువుల రామయ్య సర్కిల్ గా పేరు పెట్టాలి ..సిపిఐ సూచన

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ:   పత్తికొండ పట్టణంలోని గుత్తి టర్నింగ్ సర్కిల్ ను భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ అగ్ర నాయకులు పత్తికొండ నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేసిన మహానీయుడు స్వర్గీయ కామ్రేడ్ చదువుల రామయ్య సర్కిల్ గా నామకరణం చేయాలని ఈ మేరకు గ్రామపంచాయతీ  తీర్మానం చేయాలని సోమవారం సిపిఐ ఆధ్వర్యంలో పత్తికొండ గ్రామపంచాయతీ కార్యదర్శి డి నరసింహులు కు వినతి పత్రం అందజేశారు. అనంతరం సిపిఐ మండల కార్యదర్శి డి రాజా సాహెబ్  మాట్లాడుతూ, పత్తికొండ నియోజకవర్గం మారెళ్ళ గ్రామంలో జన్మించిన  చదువుల రామయ్య  భారత కమ్యూనిస్టు పార్టీ (సిపి ఐ) పత్తికొండ నియోజకవర్గ కార్యదర్శిగా, ఉమ్మడి కర్నూలు జిల్లా కార్యదర్శిగా పనిచేశారు. ఈ ప్రాంత ప్రజలను బానిసలుగా చేసి వెట్టిచాకిరి చేయించుకుంటూ, ప్రజల్ని పీడించేవారని తెలిపారు. అలాంటి సమయంలో దౌర్జన్యపరులకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు నిర్వహించి, భూస్వాముల దగ్గర ఉన్న వేలాది ఎకరాల భూములను పేద ప్రజలకు పంపిణీ చేసిన ఘన చరిత్ర  చదువుల రామయ్య కి కలదని అన్నారు. ఈ ప్రాంతంలో పంటలు లేక ఉపాధి లేకపోవడంతో కొంతమంది ముఠా రాజకీయాలు నడుపుతున్న స్వార్థపరుల విష కౌగలిలో యువకులు చిక్కుకొని గ్రామాలకు గ్రామాలు బలైపోతుంటే కనులారా చూసిన చదువుల రామయ్య గారు ఫ్యాక్షన్ ముఠా రాజకీయాలకు కు వ్యతిరేకంగా పనిచేసి ఫ్యాక్షన్  అంతం కావాలంటే ఈ ప్రాంతం అభివృద్ధి కావాలని సుదీర్ఘకాలం వెనుకబడిన పత్తికొండ ప్రాంతానికి రాజోలు బండ కుడి కాలువ ద్వారా నీళ్లు మళ్లించాలని గత 50 సంవత్సరాల క్రితం నుండి పోరాటాలు చేసిన ఘనత వారికి ఉందని పేర్కొన్నారు. పూర్తిగా వెనుకబాటుకు గురైన  పత్తికొండ నియోజకవర్గం కరువు కాటకాలతో అల్లాడుతున్న సందర్భంలో రాజోలి బండ కుడి కాలువ తో పాటు కృష్ణా జలాలు మళ్లించాలని,కరువును పారదోలాలని అవిశ్రాంతంగా ఆయన చేసిన పోరాట కృషి ఫలితమే నేడు హంద్రీ నీవా ప్రాజెక్టు ప్రత్యక్ష నిదర్శనమని తెలిపారు.ఆయన చేసిన పోరాట ఫలితంగా ప్రస్తుతం పత్తికొండ సమీపంలో హంద్రీనీవా ప్రాజెక్టు రావడం జరిగిందని అన్నారు.ప్రధాన కాలువ పత్తికొండ పట్టణ సమీపంలో నిండుగా పారుతూ మన ప్రాంత సాగు, తాగు నీటి అవసరాలు తీరుస్తున్నదన్నారు. ఈ ప్రాంతంలో పేద ప్రజలు, కార్మికులు,కష్టజీవుల కోసం, వారి సమస్యల పరిష్కారం కోసం,ఈ ప్రాంత అభివృద్ధి కోసం,అనేక పోరాటాలు చేసిన చరిత్ర ఆయనకు ఉందని తెలిపారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో జిల్లా అభివృద్ధి కోసం,సాగునీటి ప్రాజెక్టుల కోసం విశేషంగా కృషి చేశారు.ఆయనకు జిల్లాలో ప్రముఖ నాయకుడిగా పేరు ఉన్నది. చదువుల రామయ్య  అంటే ఈ ప్రాంత ప్రజలకు ఎనలేని అభిమానం,ఆయన పేరుతో జిల్లాలో కర్నూలు,ఆదోని,శ్రీశైలం,డోన్,గోనెగండ్ల,ఎమ్మిగనూరు, కోడుమూరు ప్రాంతాలలో  కాలనీలు ఏర్పాటు చేశారు. అలాగే పత్తికొండలో సిపిఐ కార్యాలయం చదువుల రామయ్య నామకరణమై ఉందని గుర్తు చేశారు.ఆయన 1992 సంవత్సరం ఫిబ్రవరి నెల 24వ తేదీ నాడు అనారోగ్య రీత్యా మరణించడం జరిగిందని, మన ప్రాంత అభివృద్ధికి కృషి చేసిన నాయకులను స్మరించుకోవడం వారు చేసిన సేవలను గుర్తు చేసుకోవడం ప్రస్తుతం మనందరి బాధ్యతగా భావించాలని అన్నారు.అందుకోసం పత్తికొండ పట్టణంలో గుత్తి టర్నింగ్ సర్కిల్ ను చదువుల రామయ్య సర్కిల్ గా పేరు పెట్టుటకు గ్రామపంచాయతీ తీర్మానం చేసి ఆయనను గౌరవించాల్సిందిగా వారు ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో  సిపిఐ పట్టణ కార్యదర్శి రామాంజనేయులు సంఘం జిల్లా కార్యదర్శి కే తిమ్మయ్య, సిపిఐ జిల్లా సమితి సభ్యులు బి సురేంద్ర కుమార్, ఎం కారన్న, ఆర్ గురుదాసు, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కారుమంచి తదితరులు పాల్గొన్నారు.

About Author