కర్నూలు అభివృద్ధిలో యువత భాగస్వామ్యం కావాలి.. టిడిపి ఇంచార్జి టి.జి భరత్
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు నగర అభివృద్ధిలో యువత భాగస్వామ్యం అవ్వాలని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భరత్ అన్నారు. నగరంలోని శంకరాస్ డిగ్రీ కళాశాలలో కర్నూలు యువగళం పేరుతో యువతీ, యువకులతో ఆయన ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ ఎన్నికల సంవత్సరంలో యువత తీసుకునే నిర్ణయాలు ఎంతో కీలకమన్నారు. భవిష్యత్తు బాగుండాలంటే మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని ఆయన సూచించారు. తమ ప్రభుత్వం ఉన్న సమయంలో తీసుకున్న ఎన్నో మంచి విధానాలు ఈ ప్రభుత్వం అమలు చేయడం లేదన్నారు. అన్నా క్యాంటీన్ ఎత్తివేసిందని, చెత్తకు పన్ను వేసే విధానం కొత్తగా తీసుకొచ్చిందని, ఇష్టానుసారంగా ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటుచేశారని మండిపడ్డారు. ఎలాంటి జీవనాధారం చూపించకుండా గాంధీనగర్ సమీపంలోని చిన్న పార్క్ వద్ద దుకాణాలు ఎత్తివేశారని చెప్పారు. తాము అధికారంలో ఉంటే ప్రజలు నష్టపోయే నిర్ణయాలు తీసుకోబోమన్నారు. కర్నూల్లో విద్యార్థులు చదువుకునేందుకు స్టడీ హాల్స్ నిర్మాణం చేపట్టేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. స్థానికంగా ఉద్యోగాలు లేవని యువత అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. తన గెలుపే యువత భవిష్యత్తుకు మార్గం అవుతుందని తెలిపారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు అమలవుతున్న విధానాలను ప్రక్షాళన చేసి ప్రజలకు మేలు చేసే కొత్త విధానాలు అమల్లోకి తీసుకొస్తామన్నారు. కర్నూల్లో తనను గెలిపించాలని టి.జి భరత్ యువతను కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ హరికిషన్, తదితరులు పాల్గొన్నారు.