వైభవం.. శ్రీ భక్త మార్కెండేయస్వామి జయంతి
1 min readఅంగరంగ వైభవంగా స్వామి వారి రథోత్సవం
- ఆదోనిలో భారీగా తరలివచ్చిన పద్మశాలీలు
- పద్మశాలీల ఐక్యత చాటాం…. : ఆదోని పద్మశాలీ సేవా సంఘం కమిటీ అధ్యక్షులు బుదారపు లక్ష్మన్న
ఆదోని, పల్లెవెలుగు: కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో పద్మశాలీల ఆరాధ్య దైవం శ్రీ భక్త మార్కెండేయ స్వామి జయంతి ఉత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామివారి జయంతి సందర్భంగా సోమవారం ఉదయం 5.30 గంటలకు స్వామి వారికి మహన్యాసపూర్వక ఏకాదశవార రుద్రాభిషేకం, బిల్వార్చన, దేవి సహస్ర్తనామ కుంకుమార్చన, 8.30 గంటలకు పూర్ణాహుతి, నీరాజనము కార్యక్రమాలను నిర్వహించారు. సాయంత్రం 6.05 గంటలకు శ్రీ స్వామివారి రథోత్సవమును భజనలు, కోలాటాలు, మంగళవాయిద్యాలతో పురవీధుల గుండా ఊరేగించారు. భక్తులు స్వామివారికి టెంకాయ కొట్టి… మొక్కు సమర్పించారు. అంతకు ముందు రాజకీయ ప్రజాప్రతినిధులు శ్రీ భక్త మార్కెండేయ స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు.
దేవాలయ అభివృద్ధికి మరింత కృషి
పద్మశాలీల ఆరాధ్య దైవం శ్రీ భక్త మార్కెండేయ స్వామి వారి జయంతిని భక్తిశ్రద్ధలతో నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు ఆదోని పద్మశాలీ సేవా సంఘం కమిటీ అధ్యక్షులు బుదారపు లక్ష్మన్న. ఆదోని పట్టణంతోపాటు చుట్టు పక్కల గ్రామీణ ప్రాంతాల్లోని పద్మశాలీలు స్వామివారిని దర్శించుకుని మొక్కులు సమర్పించుకున్నారు. భక్తుల విరాళాల ద్వారా వచ్చిన డబ్బుతో మార్కెండేయ స్వామి దేవాలయంను అభివృద్ధి చేశామని, మున్ముందు మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ఆదోని పద్మశాలీయులు ఐక్యతతో కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు.